అప్పట్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? అని చంద్రబాబును అడిగా.. ఆయన నిరాకరించారు!: గవర్నర్ నరసింహన్
- రాష్ట్రపతి పాలన విధించి.. అధికారాన్ని అనుభవించాలనే కోరిక లేదు
- చంద్రబాబు, కేసీఆర్ లతో మంచి సంబంధాలు ఉన్నాయి
- మీ వార్తలను చూసే.. చంద్రబాబు నాపై అలా స్పందించి ఉంటారు
ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అంటూ చంద్రబాబును తాను అడిగానని... దానికి ఆయన నిరాకరించారని నరసింహన్ చెప్పారు. ఆ తర్వాతే రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు, కేసీఆర్ లతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు.
'మీపై చంద్రబాబు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు కదా?' అనే ప్రశ్నకు సమాధానంగా... చంద్రబాబు తనకు మంచి స్నేహితుడని నరసింహన్ చెప్పారు. మీరే తన గురించి ఏదో రాసి ఉంటారని... ఆ నేపథ్యంలో చంద్రబాబు అలా స్పందించి ఉంటారని అన్నారు. రాజకీయ నాయకుల ద్వారానే మాకు అలాంటి సమాచారం అందుతుందని మీడియా ప్రతినిధులు చెప్పగా... వారు తనను కలిసినప్పుడు తాము ఎన్నడూ అలా చెప్పలేదని అంటారని, వెళ్లేటప్పుడు కాళ్లకు నమస్కారం పెట్టి వెళ్తారని చమత్కరించారు.
మరోవైపు, గవర్నర్ గా నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో ఆయన భేటీ అవుతారనే ప్రచారం జరిగినప్పటికీ... ఎవరినీ కలవకుండానే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.