మావోయిస్టులపై చావు దెబ్బ కొట్టేందుకు కారణమైన చిన్న క్లూ!
- మూడు రాష్ట్రాల ఆపరేషన్ తో మావోలపై కోలుకోలేని దెబ్బ
- 60 మందికి అల్పాహారం కావాలని ఆర్డర్
- అదే క్లూగా దూసుకెళ్లిన కూంబింగ్ దళాలు
- ఎన్ కౌంటర్ లో 39 మంది మావోల మృతి
50 నుంచి 60 మందికి సరిపడా అల్పాహారాన్ని తయారు చేసి అందించాలంటూ ఓ హోటల్ కు వచ్చిన ఆర్డర్ వివరాలు కూంబింగ్ దళాలకు చేరాయి. ఆ ఆర్డర్ ఎక్కడికి వెళుతుందో స్పష్టంగా విచారించిన పోలీసులు, ఆ ప్రాంతంపై మెరుపుదాడి చేశారు. ఆ ప్రాంతం చుట్టూ ఇంద్రావతి నది ప్రవహిస్తుండటంతో అక్కడే మావోల సమావేశం జరగనుందని నిర్ధారించి, ఆ ప్రాంతానికి దూసుకెళ్లారు.
కసన్సూర్ అడవుల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎన్ కౌంటర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకూ సాగింది. తొలుత 16 మంది మావోయిస్టుల మృతదేహాలు బయటపడగా, ఆపై ఇంద్రావతి నదిలో 15 మృతదేహాలు మంగళవారం, మిగతావి బుధవారం బయటకు వచ్చాయి. గ్రనేడ్ లాంచర్లు, సింగల్ షాట్ లాంచర్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లో లక్ష్యాలను సులువుగా చేరే ఆయుధాలను పోలీసులు ఉపయోగించారు. తొలుత మావోలు ఫైరింగ్ మొదలు పెట్టారని, ఆత్మ రక్షణ కోసమే తాము కాల్పులు జరిపామని అధికారులు వెల్లడించారు.