మాల్దీవుల్లో ముదిరిన సంక్షోభం.. రెండు వారాలపాటు ఎమర్జెన్సీ.. సుప్రీం న్యాయమూర్తుల అరెస్ట్!

  • దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన అధ్యక్షుడు
  • ఈ తెల్లవారుజామున  సుప్రీం న్యాయమూర్తుల అరెస్ట్
  • సుప్రీం ఆదేశాలతో దేశంలో రాజకీయ సంక్షోభం
మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. సుప్రీంకోర్టుపై ఇప్పటికే యుద్ధం ప్రకటించిన ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ సోమవారం రాత్రి ఎమర్జెన్సీ ప్రకటించారు. 15 రోజుల పాటు అత్యయిక స్థితి కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేశారు. 12 విపక్ష ఎంపీలపై అనర్హత పేరుతో వేసిన వేటు చెల్లదని, జైల్లో ఉన్న వారందరినీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం వ్యాఖ్యలను యమీన్ బేఖాతరు చేశారు. న్యాయవాదులను తొలగించేందుకు ప్రయత్నించారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు దేశంలో 15 రోజులపాటు అత్యవసర స్థితిని విధిస్తున్నట్టు రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు.  

ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలంటూ సుప్రీం ఆదేశించిన తర్వాత మాజీ అధ్యక్షుడు నషీద్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. దీంతో రాజధాని మాలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కోర్టు ఆదేశాలను పాటిస్తామన్న పోలీస్ చీఫ్‌ అహ్మద్ అరిఫ్‌ను ప్రభుత్వం తొలగించింది. కాగా, దేశంలో అత్యవసర స్థితిని విధించిన ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్లా సయీద్, అలీ హమీద్‌లను ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసింది.  
Go Back to Shorts
Maldives
emergency
Abdulla Yameen
Supreme Court

More Telugu News