అమరావతిలో 'అన్న క్యాంటీన్లు'... రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, 5 రూపాయలకు పులిహోరా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమరావతిలో 'అన్న క్యాంటీన్లు'... రూపాయికి ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, 5 రూపాయలకు పులిహోరా

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మూడు 'అన్న క్యాంటీన్లు' నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు మంత్రులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ల స్పూర్తితో రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అమరావతి పరిధిలోని వెలగపూడి, తుళ్లూరు, నవులూరుల్లో తొలుత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ అన్న క్యాంటీన్లలో 1 రూపాయికే ఇడ్లీ, 3 రూపాయలకే పెరుగన్నం, 5 రూపాయలకే పులిహోరాను అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. అన్న క్యాంటీన్లలో రోజుకు 500 మందికి అల్పాహారం, భోజనం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వారు చెప్పారు. కాగా, ఈ 'అన్న క్యాంటీన్ల'ను సత్వరమే ఏర్పాటు చేయాలని సూచించిన ముఖ్యమంత్రి, ధరల పట్టిక, మెనూ గురించి కూడా వారితో చర్చించారు.

More Telugu News