అగ్రిగోల్డ్ డిపాజిటర్లూ... బెంగపడొద్దు: సంస్థ అప్పుల కంటే ఆస్తులే ఎక్కువంటున్న విచారణ కమిటీ చైర్మన్
అగ్రిగోల్డ్ మాయలో పడి సర్వం కోల్పోయిన డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ చైర్మన్ సాంబశివరావు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో చక్రం తిప్పిన అగ్రిగోల్డ్ లక్షలాది మంది నుంచి రూ.7 వేల కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించింది. మెచ్యూరిటీ తీరిన బాండ్ల సొమ్ము చెల్లించడంలో చేతులెత్తేసిన అగ్రిగోల్డ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో నేటి ఉదయం విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విచారణ కమిటీతో సమావేశమయ్యారు. సంస్థ ఆస్తులు అమ్మైనా సరే డిపాజిటర్ల సొమ్ము వచ్చేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాంబశివరావు డిపాజిటర్లు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. సంస్థకు ఉన్న అప్పుల కంటే ఆస్తుల విలువే ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. సంస్థకు చెందిన మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని విక్రయించి డిపాజిటర్లకు న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కోర్టు అనుతిస్తే, వచ్చే నెలలోనే సంస్థ ఆస్తులను వేలం ద్వారా విక్రయిస్తామని సాంబశివరావు తెలిపారు.