అమీర్ 'పిలుపు'కు విశేష స్పందన... సర్వర్ డౌన్ అయిందట!
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా ప్రాజెక్టు కోసం సోషల్ మీడియాలో ఓ కాస్టింగ్ కాల్ పోస్టు చేశాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోయే చిత్రం కోసం బాగా పాడగలిగిన నూతన నటి కావాలని తెలిపాడు. ఈ కాస్టింగ్ కాల్ ను అమీర్ ట్విట్టర్లో పోస్టు చేసిన కాసేపటికే 3000కు పైగా స్పందనలు వచ్చాయట. ఆ ఎంట్రీలన్నీ చాలా భారీగా ఉన్నాయని, వాటికి వీడియోలు అటాచ్ చేసి పంపారని అమీర్ ఖాన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. కొద్ది వ్యవధిలోనే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అమీర్ ఆఫీసులో సర్వర్ డౌన్ అయిందట.
ప్రస్తుతం ఈ ఎంట్రీలను వర్గీకరించి, పరిశీలిస్తున్నామని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో తాజా ప్రాజెక్టుకు డైరక్షన్ బాధ్యతలు దక్కించుకున్న అద్వైత్ చందన్ తెలిపాడు. తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చందన్ మాట్లాడుతూ... ఎంట్రీలను పరిశీలించి తమకు కావాల్సిన నటిని ఎంపిక చేసుకుంటామని తెలిపాడు. కాగా, ఇంకా పేరుపెట్టని ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నట్టు తెలిసింది.