పొరపాటు చేసి, తర్వాత నాలుక్కరుచుకున్న యూఎస్ మిలటరీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొరపాటు చేసి, తర్వాత నాలుక్కరుచుకున్న యూఎస్ మిలటరీ!

జీవించి ఉన్న ఆంత్రాక్స్ బ్యాక్టీరియాను 9 రాష్ట్రాలకు పంపి అమెరికా సైన్యం పెద్ద పొరపాటే చేసింది. కాస్త అజాగ్రత్తగా ఉండి దాన్ని బయటకు తీసుంటే, ప్రజల ప్రాణాలకు పెను విఘాతమే కలిగివుండేది. అయితే అదృష్టవశాత్తూ అలా జరగలేదు. పొరపాటును గ్రహించి నాలుక్కరుచుకున్న అధికారులు ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బ్యాక్టీరియా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని పెంటగాన్ అధికారులు స్పష్టం చేశారు. బ్యాక్టీరియాను పరీక్షించే నిమిత్తం దాన్ని క్రియారహితంగా మార్చకుండానే, సౌత్ కొరియాలోని అమెరికా ఎయిర్ బేస్ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ల్యాబొరేటరీలకు పంపిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన గత సంవత్సరం జరిగిందని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ లేదని ఆయన అన్నారు. నలుగురు అమెరికన్ పౌరులకు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆంత్రాక్స్ నిరోధక యాంటీ బయాటిక్స్ ఇస్తున్నామని, వీరి ప్రాణాలకూ ప్రమాదం లేదని మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్న యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం అధికారి జాసన్ మెక్ డొనాల్డ్ వివరించారు. గాల్లో కలిసిన ఆంత్రాక్స్ బ్యాక్టీరియా జీవావరణానికి కలిగించే హాని ఎలా ఉంటుందో తెలుసుకునే నిమిత్తం పరీక్షలు చేసేందుకు క్రియారహిత దశలో ఉన్న బ్యాక్టీరియాను పంపాల్సి వుండగా, అది జరగలేదని, జీవించి ఉన్న బ్యాక్టీరియా ల్యాబ్ లకు చేరిందని ఆయన తెలిపారు. ఈ పొరపాటు 11 నెలల తరువాత వెలుగులోకి రావడం గమనార్హం.

More Telugu News