భాజాపా కొత్త అధ్యక్షుడు అమిత్ షా దక్షిణాదిన పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు అమిత్ షా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి భాజాపా కూడా బలమైన కారణం అయినప్పటికీ....ఆ ఇమేజ్ ను తెలంగాణ భాజాపా నాయకత్వం క్యాష్ చేసుకోలేకపోయిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల తర్వాత తెలంగాణపై పూర్తిగా దృష్టిసారించనున్నారు అమిత్ షా. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలు పన్నుతున్నారు. తెలంగాణ లో బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు అమిత్ షా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయంలో అవసరమైతే తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు కూడా అమిత్ షా సిద్ధపడొచ్చని భాజాపా వర్గాలు అంటున్నాయి. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో కేసీఆర్, అమిత్ షా లు ఇద్దరూ దిట్టలే. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.