కెమెరా పిక్సల్స్ కాదు లెన్స్ రిజల్యూషన్ ముఖ్యం... కెమెరా గురించి తెలియని విషయాలు ఎన్నో...?

నెట్ విహారం, గేమ్స్, కెమెరా, యాప్స్ ఇవన్నీ స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా ఫోన్లో కెమెరా అవసరం బాగా పెరిగిపోయింది. సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, వాటిని సన్నిహితులు, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోవడం నేటితరానికి ఒక హాబీ అయిపోయింది. అందుకే కెమెరా ఫీచర్లతో ఉన్న ఫోన్లు తెగ అమ్ముడుపోతున్నాయి. 


ఈ సెల్ఫీ మోజు మన దేశవాసుల్లో బాగా పెరిగిపోయింది. దీంతో కంపెనీలు సెల్ఫీ కెమెరాను హైలైట్ చేస్తూ కొత్త, కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.  మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్మార్ట్ ఫోన్ కెమెరా గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కెమెరా పిక్సల్స్ ఎక్కువగా ఉంటే అది సూపర్బ్ కెమెరా అని సాధారణంగా అనుకుంటారు. కానే కాదు. పిక్సల్స్ ఎన్ని ఉన్నా గానీ, ఆ చిత్రం నాణ్యంగా ఉండాలంటే అవసరమైనవి, మరికొన్ని ఉన్నాయి.  


representational imageస్మార్ట్ ఫోన్ కంపెనీలు ఈ మధ్య కాలంలో కెమెరా పిక్సల్స్ ను హైలైట్ చేయడం గమనించే ఉంటారు. 18 మెగా పిక్సల్స్, 23 మెగా పిక్సల్స్ అంటూ పెద్ద అక్షరాలతో కంపెనీలు ప్రకటనలు ఇస్తుంటాయి. అన్నేసి మెగా పిక్సల్స్ చూడ్డానికి మంచిగానే కనిపిస్తాయి. అయితే, స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ గురించి మాత్రం ప్రకటనల్లో ఎక్కడా కనిపించదు. ఫోన్ కంపెనీలు కెమెరా సెన్సార్లను, కెమెరా లెన్స్ లను విడిగా సమకూర్చుకుని రెండింటినీ ఫోన్లో అమర్చుతుంటాయి. లెన్స్ లతో పోల్చుకుంటే కెమెరా సెన్సార్లు చౌకగా ఉంటాయి. చౌకగా వస్తుండడంతో సాధారణంగా ఎక్కువ ఫోన్లలో అధిక రిజల్యూషన్ తో కూడిన కెమెరా సెన్సార్ ను, ఖరీదు ఎక్కువగా ఉండడంతో తక్కువ రిజల్యూషన్ ఉన్న లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నాయి. లెన్స్ రిజల్యూషన్ తక్కువ కావడం వల్ల కెమెరా రిజల్యూషన్ ఎక్కువ ఉన్నప్పటికీ అది పరిమితమవుతోంది. దీంతో వాస్తవంగా చూస్తే ఫొటో రిజల్యూషన్ తక్కువగా వస్తుంది.

రిజల్యూషన్
representational imageడిజిటల్ ఫొటోగ్రఫీలో రిజల్యూషన్ చాలా ముఖ్యమైంది. రిజల్యూషన్ కెమెరా సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఫొటో తీసినప్పుడు వస్తువు లేదా మూలకం వివరాలు సుస్పష్టంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదాహరణకు పార్క్ లో ఫొటో తీశారనుకోండి. అందులో ప్రతీ గడ్డి పరక, మొక్క, ఆకులు, పువ్వులు అన్నీ చాలా స్పష్టంగా ఉంటేనే ఉపయోగకరం. ఇందుకు మంచి సామర్థ్యం ఉన్న కెమెరా కావాలి.

ఇక ఓ దృశ్యంలో ఎన్ని పిక్సల్స్ ఉన్నాయనేది రిజల్యూషన్ లో పేర్కొంటారు. ఓ ఇమేజ్ ఎత్తు, వెడల్పు ఆధారంగా అది ఎంత రిజల్యూషన్ ను కలిగి ఉందో చెప్పొచ్చు. ఉదాహరణకు ఓ ఇమేజ్ 2048 పిక్సల్స్ వెడల్పు, 1536 పిక్సల్స్ ఎత్తు ఉందనుకుంటే ఈ రెండింటినీ హెచ్చవేస్తే 31,45,728 వస్తుంది. ఇన్ని పిక్సల్స్ ఆ చిత్రంలో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది 3.1 మెగా పిక్సల్స్ తో సమానం. ఒక మెగా పిక్సల్ అంటే పది లక్షల పిక్సల్స్. ఈ ఫొటోను 2048X1536 అని కూడా చెప్పొచ్చు.

మెగా పిక్సల్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సైజులో చిత్రాన్ని షూట్ చేసుకునే వీలుంటుంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) అన్నది ఒక అంగుళం విస్తీర్ణంలో ఉండే పిక్సల్స్ ను సూచించేది. స్మార్ట్ ఫోన్లలో స్క్రీన్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లలో ఇది కనిపిస్తుంది. మెగా పిక్సల్స్ అన్నవి ఓ చిత్రం ఏ పరిమాణంలో ఉన్నదీ తెలియజేస్తుంది. ఒక గదిలో 10 మంది ఉంటే ఏం కాదు. కానీ, ఓ 50 లేదా 100 మంది అదే గదిలోకి వచ్చేస్తే ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తుంది. ఇలాగే కెమెరా సెన్సార్ పై ఎక్కువ మెగా పిక్సల్స్ ను దగ్గర దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల చిత్రం నాణ్యత తగ్గిపోతుంది. చాలా వరకు బడ్జెట్ ఫోన్లలో కెమెరాలతో తీసిన ఫోన్లు బ్లర్ గా ఉండడం అందుకే. అందుకే మెగా పిక్సల్ కౌంట్ చూడకుండా లెన్స్ సెన్సార్ ను చూడాలంటారు నిపుణులు.

లెన్స్ లు, సెన్సార్లు...
representational imageలెన్స్ లలో చాలా ముఖ్యమైన అంశం డయామీటర్ (వ్యాసార్థం). ఒక లెన్స్ లో ఇతర అంశాలన్నీ పక్కాగా ఉండి, డయామీటర్ చిన్నగా ఉంటే తేడా వచ్చేస్తుంది. ఎందుకంటే డయామీటర్ అన్నది రిజల్యూషన్ ను పరిమితం చేయగలదు. లెన్స్ ఎంత వెలుగును సేకరించగలదు? అనేది డయామీటర్ పైనే ఆధారపడి ఉంటుంది. లెన్స్ లు పెద్దగా ఉండి, అధిక రిజల్యూషన్ కలిగినవి అయితే ఎక్కువ వెలుగును సేకరిస్తాయి. సాధారణంగా డిజిటల్ కెమెరా లెన్స్ లు 10ఎంఎం నుంచి 50ఎంఎం వరకు ఉంటాయి. ఇంకా పెద్దగా కూడా ఉండొచ్చు. స్మార్ట్ ఫోన్ కెమెరా లెన్స్ లు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి 2ఎంఎం డయామీటర్ తో ఉంటాయి. లెన్స్ చిన్న సైజు లో ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్ లో కెమెరా సెన్సార్లు మాత్రం అధిక రిజల్యూషన్ తో ఉంటాయి. ఉదాహరణకు 20 మెగా పిక్సల్స్ ఉన్నఫోన్ తో అధిక స్పష్టతతో కూడిన చిత్రాలు తీసుకోవచ్చని భావించడం సహజం. కానీ, అధిక స్పష్టతతో కూడిన చిత్రాలు తీసుకోవాలంటే కెమెరా పిక్సల్స్ ఎక్కువ ఉంటే సరిపోదు. కెమెరా లెన్స్ డయామీటర్ కూడా పెద్దగా ఉండాలి.

అపెర్చూర్/ ఎఫ్- స్టాప్
representational imageకెమెరా అపెర్చూర్ కూడా అత్యంత కీలకమైనది. ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్లలో దీని ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. చాలా ఫోన్లలో అపెర్చూర్ ఎఫ్2.2 లేదా ఎఫ్1.8 ఉంటున్నవి. పిక్చర్ నాణ్యత విషయంలో అపెర్చూర్ నంబర్ కు ప్రాధాన్యం ఉంది. ఫొటోగ్రఫీ అంతా వెలుగుపైనే ఆధారపడి ఉంటుందని తెలిసిందే. ఒక కెమెరా ఎంత వెలుగును సంగ్రహిస్తుంది (క్యాప్చరింగ్) అనే దాని ఆధారంగా దాని క్వాలిటీని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్లలో లెన్స్ లు, సెన్సార్లు చిన్నగా ఉంటాయి. దీంతో వాటిలోకి తక్కువ వెలుగు వెళుతుంది. దీంతో తుది చిత్రం నాణ్యతపై ప్రభావం పడుతుంది. ఎంత వెలుగు లెన్స్ ద్వారా  పిక్సల్స్ ను చేరుతుందన్నది కెమెరా క్వాలిటీకి ముఖ్యం. అపెర్చూర్ అన్నది దీన్ని నిర్ణయిస్తుంది.

అపెర్చూర్ అన్నది కెమెరాలోకి వెలుగు ప్రవేశాన్ని నిర్ణయించే ఉపకరణం. అపెర్చూర్ ను ఎఫ్-స్టాప్స్ రూపంలో కొలుస్తారు. ఎఫ్ స్టాప్ అన్నది చిన్నగా ఉంటే అపెర్చూర్ పెద్దగా ఉంటుంది. దీంతో కెమెరా సెన్సార్ కు మరింత వెలుగు చేరుతుంది. దీంతో ఫొటోలు తక్కువ నాయిస్ (అస్పష్టతలు, బ్లర్)తో మెరుగ్గా వస్తాయి. అందుకే కెమెరాలో అపెర్చూర్ పెద్దగా ఉండాలి. పక్కనే ఉన్న ఇమేజ్ చూస్తే అవగాహన కలుగుతుంది. ఎఫ్ స్టాప్ తక్కువ ఉంటే కెమెరా సెన్సార్ కు మరింత వెలుగు చేరుతుంది. దీంతో షట్టర్ స్పీడ్ టైమ్ తగ్గి చిత్రంలో బ్లర్ అనేది రాదు. అపెర్చూర్ తగినంత విస్తీర్ణంతో ఉంటే కెమెరాలో పిక్సల్స్ సైజు భారీగా ఉండకపోయినా చిత్రం నాణ్యత బాగానే వస్తుంది. తక్కువ పిక్సల్స్, తక్కువ అపెర్చూర్ ఉంటే మాత్రం ఫొటోల నాణ్యత బాగా రాదు. చాలా వరకు స్మార్ట్ ఫోన్ల కెమెరాలు ఫిక్స్ డ్ అపెర్చూర్ (విశాలంగా ఉండి అధిక వెలుగు ప్రవేశించే విధంగా)తో ఉంటాయి. కానీ వెలుగన్నది లెన్స్ ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఎఫ్ స్టాప్ ఒక్కో నంబర్ తగ్గుతూ ఉంటే అపెర్చూర్ ఏరియా పెరుగుతూ వెళుతుంది. దాంతో లెన్స్ ద్వారా కెమెరాకు వెళ్లే వెలుగు అధికమవుతుంది.

కదులుతున్న వాటిని ఫోటో తీస్తే ఎందుకు సరిగా రావు?
representational imageవేగంగా వెళుతున్న దాన్ని ఫొటో తీయాలనుకుంటే అది సరిగా రాకపోవడం చాలా మందికి అనుభవమే. ఎందుకంటే చాలా వరకు ఫోన్లలో సీఎంఓఎస్ సెన్సార్లను వాడేస్తున్నారు.  ఈ సెన్సార్లు చిత్రాలను ఒక లైన్ తర్వాత లైన్ రూపంలో క్యాప్చర్ చేస్తాయి. అదే ఖరీదైన సీసీడీ ఇమేజ్ సెన్సార్లు అయితే అన్నింటినీ ఒకేసారి క్యాప్చర్ చేప్తాయి. స్టిల్ ఇమేజ్ (కదలకుండా ఉండేదాన్ని) తీసుకుంటే ఈ రెండు సెన్సార్లలోనూ ఒకే విధమైన ఫొటోలు వస్తాయి.

ఐఎస్ఓ సెట్టింగ్స్
representational imageఫొటోలు మంచిగా రావాలనుకునేవారు కెమెరా సెట్టింగ్స్ లో ఐఎస్ వో ఆప్షన్ ను తప్పకుండా పరిశీలించాల్సినది. ఇది కెమెరా సెన్సిటివిటీని నిర్ణయించేది. లైటింగ్ తక్కువ ఉన్న సమయంలో, మేగావృతమై చీకటిగా మారినప్పుడు ఫొటోల నాణ్యత పడిపోతుంది. ఉదాహరణకు సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నారు. ఆ సమయంలో ఫొటో తీస్తే ఎలా వస్తుంది? బ్లర్ గా ఉంటుంది. కానీ, ఫోన్ కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్లి ఐఎస్ఓను ఆటోమోడ్ లో పెట్టి చూడండి. ఫొటో తీసుకోండి. ఆ తర్వాత ఐఎస్ఓను ఆఫ్ చేసి చూడండి. రెండింటి మధ్య తేడా మీకే తెలుస్తుంది. తక్కువ నంబర్ వద్ద ఐఓఎస్ ను సెట్ చేసుకుంటే వెలుగు అధికంగా కావాల్సి ఉంటుంది. ఫిల్మ్ సెన్సిటివీ తగ్గి తీసుకున్న ఫొటోల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఐఎస్ వోను ఆటోమోడ్ లో ఉంచేసుకుంటే సరిపోతుంది. మరింత లైట్ కావాలనుకుంటే షట్టర్ స్పీడ్ ను తగ్గించాల్సి ఉంటుంది. మంచి వెలుగు ఉన్న చోట షట్టర్ స్పీడ్ ను 100, 200 దగ్గర ఉంచి వాడుతుంటారు. ఎక్కువ వెలుగు అవసరం లేదనుకుంటే లేదా షట్టర్ స్పీడ్ వేగం వద్దనుకుంటే ఐఎస్ఓను  పెంచుకోవచ్చు.

షట్టర్ స్పీడ్
దీన్నే ఎక్స్ పోజర్ టైమ్ అని కూడా చెబుతారు. లైటింగ్ కు కెమెరా షట్టర్ తెరుచుకుని దాన్ని కెమెరా సెన్సార్ కు పంపించండంతో దీని పాత్ర ఉంటుంది. ఉదాహరణకు సముద్రంలో డాల్ఫిన్ వేగంగా పల్టీలు కొడుతుందనుకోండి. దాన్ని షూట్ చేయాలంటే షట్టర్ స్పీడ్ వేగంగా ఉండాలి. నిదానంగా ఉంటే చిత్రం బ్లర్ గా వస్తుంది.


More Articles