విదేశాలకు చెక్కేస్తున్నారా...? పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఉండాలి మరి!

విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, విదేశాల్లో వ్యాపారం కోసమైనా కావచ్చు... విదేశీ ప్రయాణానికి సంసిద్ధులయ్యేవారికి పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరం. ఇది ఎందుకు, ఎవరికి అవసరం, ఎలా తీసుకోవాలి? తదితర వివరాలు తెలుసుకుందాం.


విదేశాలకు వెళ్లే భారత పౌరులకు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) అవసరమవుతుంది. అయితే, అందరికీ కాదు. విదేశాల్లో నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్న వారు, ఉపాధి కోసం వెళుతున్నవారు, దీర్ఘకాలం పాటు విదేశాల్లో ఉండేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి పీసీసీ అవసరం. విదేశీ అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులకు మాత్రం పీసీసీ ఇవ్వరు. విదేశాంగ శాఖ పరిధిలోని పాస్ పోర్ట్ కార్యాలయం ఈ బాధ్యత చూస్తుంటుంది.

representational imageపీసీసీ తీసుకునేందుకు ఏం కావాలి?
ఈసీఆర్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లే నైపుణ్య కార్మికులు పీసీసీ తీసుకునేందుకు గాను పాస్ పోర్ట్ లో మొదటి రెండు పేజీలు, చివరి రెండు పేజీలు (వీటిలో ఈసీఆర్/నాన్ ఈసీఆర్ కూడా ఉండాలి) ఫొటోకాపీ తీసి దానిపై స్వయంగా వాటిపై అటెస్టేషన్ (ధ్రువీకరణ) చేయాలి. శాశ్వత చిరునామా ధ్రువీకరణ పత్రం, విదేశీ ఉపాధి సంస్థ నుంచి తీసుకున్న ఉద్యోగ కాంట్రాక్టు పత్రం, వీసా (అప్పటికి తీసుకుని ఉంటే) జిరాక్స్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. ఈసీఆర్ దేశాలంటే యూఏఈ, యేమెన్, సౌదీ అరేబియా, సూడాన్, ఖతార్, అప్ఘానిస్థాన్, ఒమన్, ఇండోనేషియా, కువైట్, సిరియా, బహ్రెయిన్, లెబనాన్, మలేషియా, థాయిల్యాండ్, లిబియా, ఇరాక్, జోర్డాన్. ఈ దేశాలకు చెందిన కంపెనీలతో నేరుగా ఉపాధి కాంట్రాక్టు కుదుర్చుకుంటే వారి తరఫున ఆయా సంస్థలు పీసీసీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇక నైపుణ్యం లేని కార్మికులు, మహిళా కార్మికులు ఉపాధి కోసం ఈ దేశాలకు వెళుతుంటే ఆయా దేశంలో ఉపాధి కల్పించే వారితో కుదుర్చుకున్న కాంట్రాక్టు పత్రాన్ని పీసీసీ కోసం దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఆ దేశంలోని భారత హైకమిషన్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. చిరునామా, పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీలు, వీసా తీసుకుంటే అదొక కాపీని కూడా అందజేయాల్సి ఉంటుంది. ఏజెంట్ల ద్వారా నియమితులైన వారు పైన పేర్కొన్న పత్రాలకు అదనంగా, విదేశాంగ శాఖలోని వలసదారుల పరిరక్షణ విభాగం జారీ చేసే రిజిస్ట్రేషన్ పత్రం తీసుకోవాలి. ఏజెంట్ల ద్వారా వెళ్లే మహిళా కార్మికులైతే పైన పేర్కొన్న పత్రాలకు అదనంగా విదేశాల్లోని భారతీయ హైకమిషన్ అటెస్టేషన్ చేసిన ఉపాధి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

representational imageఈసీఆర్ కాని దేశాలకు వెళుతుంటే...
స్వయంగా అటెస్టేషన్ చేసిన పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీలు, నివాసిత చిరునామా ధ్రువీకరణ, విదేశాల్లో నివాసం కోసం, ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటే అందుకు సంబంధించిన రుజువులు (ఉపాధి కాంట్రాక్టు పత్రం) అందజేయాలి. ఈసీఆర్, నాన్ ఈసీఆర్ దేశాల్లో నివాసం ఉంటున్న వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు పీసీఆర్ కోసం పాస్ పోర్ట్ జిరాక్స్ కాపీ (దానిపై అటెస్టేషన్ చేయాలి), శాశ్వత చిరునామా ధ్రువీకరణ, విదేశాల్లో ఉంటున్న వ్యక్తి స్పాన్సర్ షిప్ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎందుకు?
పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసుల వెరిఫికేషన్ ఉంటుందని తెలిసిందే. అంటే సంబంధిత దరఖాస్తుదారుడికి నేర చరిత్ర ఉందా, వివరాలు సరైనవేనానా, ఇచ్చిన చిరునామాలోనే ఉంటున్నారా? తదితర వివరాలన్నింటినీ ఆరాతీస్తారు. ఈ విధమైన పరిశీలన తర్వాత వచ్చిన ఫలితాల ఆధారంగా వారు పాస్ పోర్ట్ కార్యాలయానికి నివేదిక ఇస్తారు. అంతా సవ్యంగా ఉంటే పాస్ పోర్ట్ కార్యాలయ సిబ్బంది సంబంధిత వ్యక్తులకు పాస్ పోర్ట్ మంజూరు చేస్తారు. ఇక వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే కొన్ని దేశాలు పీసీసీ కోరతాయి. విద్య, ఉపాధి, వలస వచ్చిన వారు ఇలా కారణాలేవైనా తమ దేశంలో ఉంటున్న వారిని విదేశీ ప్రభుత్వాలు పీసీసీ ఇవ్వాలని కోరుతుంటాయి. అందుకోసమే పీసీసీ తీసుకోవాలి. విదేశాల్లో ఇప్పటికే నివాసం ఉంటున్న పీసీసీ కోసం భారతీయ హైకమిషన్ వెబ్ సైట్ నుంచి లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరణ పత్రాలను జత చేయాలి. దాంతో భారతీయ రాయబార కార్యాలయం సంబంధిత దరఖాస్తును పాస్ పోర్ట్ కార్యాలయానికి పంపిస్తుంది. పాస్ పోర్ట్ అధికారులు అన్నీపరిశీలించి తర్వాత  పీసీసీనీ జారీ చేస్తారు.

దరఖాస్తు దారుడు ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడి ఉంటే పీసీసీ అవసరం లేదు. ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా, శాశ్వత చిరునామాకు భిన్నంగా ఉంటే పీసీీసీ వెంటనే జారీ చేయరు. సమీపంలోని పోలీసు స్టేషన్ నుంచి వచ్చే వెరిఫికేషన్ సమాచారం ఆధారంగా జారీ చేయడమన్నది ఆధారపడి ఉంటుంది.  దరఖాస్తు దారుడు మైనర్ గా ఉన్నప్పుడు పాస్ పోర్ట్ జారీ చేసి ఉంటే, వారు పెద్దయిన తర్వాత పీసీసీ పొందొచ్చు. పోలీసుల తనిఖీ ప్రక్రియ ముగిసిన తర్వాతే పీసీసీని జారీ చేస్తారు.  

representational image
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
మీరు నివసిస్తున్న ప్రాంతం పరిధిలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, పాస్ పోర్ట్ విభాగం ఆన్ లైన్ వెబ్ సైట్ http://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink నుంచి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పాస్ పోస్ట్ ఇండియా వెబ్ సైట్ కు వెళ్లిన తర్వాత హోమ్ పేజీలోనే ఆన్ లైన్ సర్వీసెస్ కాలమ్ కింద పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ అన్న ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చే్యాలి. తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టిర్ నౌ అన్న ఆప్షన్ రెడ్ మార్క్ తో కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. యూజర్ లాగిన్ ఐడీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఇది అక్కర్లేదు. తర్వాత పాస్ పోర్ట్ ఆన్ లైన్ పోర్టర్ లో లాగిన్ కావాలి. అప్లయ్ ఫర్ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం కనిపించే దరఖాస్తులో వివరాలు నింపి సబ్ మిట్ చేయాలి. లేదా దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని దాన్ని నింపి తిరిగి ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత పే అండ్ షెడ్యూల్ అపాయింట్ మెంట్ ఆప్షన్ క్లిక్ చేసి అపాయింట్ మెంట్ ఎప్పుడన్నది ఖరారు చేసుకోవాలి. ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాలి.

representational image
అపాయింట్ మెంట్ ఖరారైన రోజున పాస్ పోర్ట్ మొదటి, చివరి పేజీ ఫొటో కాపీలు, కొత్త పాస్ పోర్ట్ అయితే మొదటి పేజీలో సీల్ వేసి ఉన్న ఫొటోకాపీ, ఐటీఏ లెటర్ రెండు కాపీలు, ఇతర పత్రాలను తమవెంట తీసుకెళ్లాలి. ఈ డాక్యుమెంట్లను పరిశీలించి, వేలిముద్రలు తీసుకుంటారు. చివరిగా గత ఆరు నెలలు, ఏడాదిలోపు మీకు సంబంధించి పోలీసు వెరిఫికేషన్ జరిగి ఉంటే, దాని ఆధారంగా పీసీసీ జారీ చేస్తారు. లేకుంటే మీ చిరునామా, ఇతర వ్యక్తిగత వివరాల ధ్రువీకరణకు గాను పాస్ పోర్ట్ అధికారి పోలీసు వెరిఫికేషన్ కోరతారు. పోలీసు వెరిఫికేషన్ లో ఎటువంటి నేర చరిత్ర, కేసులు లేవని తేలితే మీ దరఖాస్తుకు క్లీన్ చిట్ ఇచ్చి వారు పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి పంపుతారు. అప్పుడు పాస్ పోర్ట్ సేవా కేంద్రం నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. దరఖాస్తు అంతా సక్రమంగా ఉందని, పీసీసీ తీసుకెళ్లాలని సూచిస్తుంది. అనంతరం పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి పీసీీసీ పొందొచ్చు. పీసీసీని ఒకసారి ఒక దేశానికి మాత్రమే కేటాయిస్తారు. దీన్ని తీసుకునేందుకు వయసు పరిమితి లేదు. మైనర్లకు కూడా పీసీసీ జారీ చేస్తారు.


More Articles