ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం: అమిత్ షా హామీ
- పదేళ్లు పూర్తి మెజార్టీతో ఉన్నా రిజర్వేషన్లు తొలగించలేదని గుర్తు చేసిన అమిత్ షా
- తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలు అమలు కాలేదన్న అమిత్ షా
- కశ్మీర్‌తో తెలంగాణ, రాజస్థాన్ ప్రజలకు ఏం పని అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారని మండిపాటు
రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తే సాయంత్రానికి అంతా అయిపోతుందని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.12 వేల రైతు కూలీ, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఏళ్ల పాటు అడ్డుకుందని ఆరోపించారు. మోదీ హయాంలో రామాలయం పూర్తి చేశామన్నారు. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో ఏం పని అని మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ కోసం భువనగిరి వాసులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ కశ్మీర్ మనదేనని చాటారన్నారు.
కేంద్రంలో బీజేపీ వచ్చాక ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌ను నిలువరించగలవా? అని ప్రశ్నించారు. ఎ అంటే అక్బరుద్దీన్, బీ ఆంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఇవన్నీ ఒక్కటేనని విమర్శించారు. ఈ మూడు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోందని మండిపడ్డారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టను కాంగ్రెస్ బహిష్కరించిందని గుర్తు చేశారు. మోదీ జాతీయ టెక్స్ టైల్ విధానాన్ని తీసుకు వచ్చారని, రూ.14వేల కోట్లతో పోచంపల్లి టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేశారన్నారు. బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు.