చిన్నారులను వేధించే ఆస్తమా... పేరెంట్స్ కాస్త జాగ్రత్త

ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి దీర్ఘకాలం పాటు విడవకుండా వేధించే క్రానిక్ డిసీజ్. ఈ సమస్యలో ఊపిరితిత్తుల్లోకి వాయువును తీసుకెళ్లే శ్వాసకోస నాళాల లోపలి గోడలు ఉబ్బిపోతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. పెద్ద వారి కంటే ఈ వ్యాధి ముప్పు పిల్లల్లోనే ఎక్కువ. ఎందుకంటే వారి శ్వాసకోస నాళాలు చాలా చిన్నగా ఉంటాయి. ఆస్తమా వల్ల చిన్నారులకు ప్రాణాపాయం ఉంటుంది. చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే అనారోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.


లక్షణాలు
గురక, దగ్గు, ఛాతీ బిగపట్టినట్టు ఉండడం, శ్వాస కష్టంగా తీసుకోవడం (ముఖ్యంగా రాత్రులు, తెల్లవారుజామున) వంటివి ఉంటే దాన్ని ఆస్తమాగానే భావించాలి. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే నిద్రలో ఎక్కువగా కదులుతుంటారు. ముఖ్యంగా రాత్రులు ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా ఉన్న పిల్లల్లో తరచుగా బ్రాంకైటిస్ వస్తుంటుంది. దగ్గు అన్నది తరచుగా లేదా అడపాదడపా రావచ్చు. తల్లి పాలు తాగే చిన్నారులు ఆస్తమాలో ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడం గుర్తించొచ్చు. ఆస్తమాలో శ్వాస తీసుకోవడం వేగంగా ఉంటుంది. దీనివల్ల హార్ట్ రేట్ కూడా పెరిగిపోతుంది.

కారకాలు
అలెర్జీ కారకాలు, జంతువులు, సిగరెట్ల పొగ, వాతావరణ కాలుష్యం, చల్లటి గాలి, వాతావరణంలో మార్పులు, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వైరస్ లు, దుమ్ములోని క్రిములు, జలుబు సైతం ఆస్తమాకు దారితీస్తాయి. వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల, కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వారసత్వంగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఉన్నా, తక్కువ బరువుతో జన్మించిన చిన్నారుల్లో, నాసల్ అలెర్జీలు (రైనైటిస్) వల్ల ఈ సమస్య రావచ్చు. ఇంటిలోని కాలుష్యాలైన దుమ్ము, దోమల నివారణ మందులు, పెర్ ఫ్యూమ్, డియోడరెంట్, పరుపులు, తలగడలో ఉండే బ్యాక్టీరియా కూడా ఆస్తమా కారకాలే. హైదరాబాద్ నగరంలోనే 10 శాతం మంది చిన్నారులు శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి అంత ప్రబలంగా ఉండదు. కనుక వారికి అలెర్జీలు, ఆస్తమా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

వైద్యులను ఆశ్రయించాలి...
పైన చెప్పుకున్న తరహా లక్షణాల్లో ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రారంభంలోనే వైద్యులను ఆశ్రయిస్తే పరిస్థితి తీవ్రతరం కాకుండా వేగంగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ తరహా వ్యాధుల్లో ఆలస్యం చేస్తే రికవరీ కూడా ఆలస్యం అవుతుంది. ఐదేళ్లు ఆపై వయసున్న పిల్లలకు పెద్దల మాదిరే పరీక్షల ద్వారా ఆస్తమాను నిర్ధారిస్తారు. స్పైరోమెట్రీ (బ్రీతింగ్ టెస్ట్) టెస్ట్ ద్వారా గుర్తిస్తారు. ఎక్స్ రే, రక్త పరీక్షలు కూడా సూచించొచ్చు. దీనిలో ఊపిరితిత్తుల పనితీరు తెలుస్తుంది. ఐదేళ్ల కంటే చిన్న వయసులో స్పైరోమెట్రీ టెస్ట్ ఫలితాలు అంత కచ్చితంగా ఉండవు. లక్షణాలు, పెద్దలు చెప్పే వివరాలు, స్టెత్ సాయంతో పిల్లల శ్వాస, గుండె స్పందనలు విని, ఎక్స్ రే ఆధారంగా డాక్టర్లు సమస్యను గుర్తిస్తారు.
 
చికిత్స
రెండు రకాలుగా ఉంటుంది. ఉబ్బసం నుంచి ఉపశమనం కోసం మందులు ఇస్తారు. దీర్ఘకాలంలో ఈ లక్షణాలు రాకుండా తిరిగి రాకుండా ఉండేందుకు కూడా మందులు సూచిస్తారు. ఇందుకోసం కార్టికోస్టెరాయిడ్ మందులను సిఫారసు చేస్తారు. వైద్యుల సూచన మేరకు నిర్ణీత సమయంలో మందులు ఇవ్వడం చాలా అవసరం. చిన్నారులకు నెబ్యులైజర్ ద్వారా మందులు సూచిస్తారు. రోజులో తగినంత విటమిన్ డి లభించేలా చూసుకోవడం మంచిది.

వీటికి దూరం
మందులు వాడడమే కాకుండా మరోవైపు ఆస్తమాకు దారితీసే కారకాలకు పిల్లల్ని దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోతపాలతోనూ ఆస్తమా వచ్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. కనుక సాధ్యమైనంత వరకు తల్లిపాలు ఉంటే అవే పట్టించాలి. ఐస్ క్రీములు వంటివి ఇవ్వకూడదు. కూల్ డ్రింక్స్, ఎయిర్ కూలర్లకూ దూరంగా ఉంచాలి. చాక్లెట్లు మరీ ఎక్కువ ఇచ్చినా ఇబ్బందే. బయటకు తీసుకెళితే మాస్క్ లు ధరింపజేయడం మంచిది.


More Articles