కీళ్ల వాతమా, కీళ్లల్లో నొప్పులా...? కారణం ఇదేనేమో...?

కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు నేడు మధ్య వయస్కుల్లోనూ కనిపిస్తున్నాయి. చెప్పుకుంటే ఇది కూడా ఓ లైఫ్ స్టయిల్ డిసీజ్ మాదిరిగానే తయారైంది. వాస్తవానికి కీళ్ల వాతం (గౌట్), కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ కీళ్లను కదలకుండా చేసేవే. వైద్య నిపుణుల వివరణ ప్రకారం వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


representational imageకీళ్లవాతం (గౌట్)
ఇదొక జీవక్రియ సంబంధిత సమస్య. ఈ సమస్యలో కీళ్లు వాచిపోతాయి. పట్టేసినట్టు ఉంటాయి. కొందరిలో ఈ వాపు ఎక్కువగా ఉండి, బాగా నొప్పి కూడా అనిపిస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి ప్యూరిన్స్ అనే రసాయనాలు చేరతాయి. మన శరీరంలోనూ తయారవుతాయి. చేపలు, ఆల్కహాల్ లోనూ ప్యూరిన్స్ ఉంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు శరీరం యూరిక్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ యూరిక్ యాసిడ్ ను మూత్రపిండాలు బయటకు పంపాల్సి ఉంటుంది. మూత్రపిండాలు యూరిక్ యాసిడ్ ను సమర్థవంతంగా బయటకు పంపకపోయినా, శరీరంలో అవసరానికి మించి యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతున్నా... అప్పుడు అవి స్ఫటికాలుగా మారి కీళ్ల చుట్టూ చేరతాయి. దీంతో గౌట్ సమస్య ఏర్పడుతుంది.

దీన్నుంచి బయపడాలంటే యూరిక్ యాసిడ్ ను సమర్థవంతంగా బయటకు పంపించేయాలి. ముందుగా ఆహారం, జీవన విధాన పరంగా మార్పులు చేసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. అదే సమయలో ఆల్కహాల్, శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండేవి తగ్గించేయాలి. ముఖ్యంగా మంచి నీటిని తగినంత పరిమాణంలో తీసుకోవాలి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనంగా ఉన్న యూరిక్ యాసిడ్, టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ఒత్తిడిని తగ్గించుకుని, కొంత మేర శారీరక వ్యాయామం చేయడం కూడా ఈ సమస్య నివారణకు మేలు చేస్తుంది.

నిమ్మరసాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని రోజూ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అర నిమ్మ చెక్క రసం సరిపోతుంది. ఎందుకంటే నిమ్మరసం మన శరీర ఆల్కలినిటీని పెంచుతుంది. దాంతో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏర్పడకుండా చూస్తుంది. పసుపులో వాపు వ్యతిరేక గుణాలున్నాయి. పైనాపిల్స్ లో ఉండే బ్రొమెలిన్ కూడా ఇంతే. వీటిని తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.

representational imageరుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ)
ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్ ల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంటుంది. పొరపాటుగా ఇది మన శరీరంలోని కీళ్ల కణాలపై దాడి మొదలు పెడితే ఏర్పడే సమస్యే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ సమస్యలో శరీరంలోని అన్ని జాయింట్లలోనూ మంట, వాపు ఏర్పడతాయి. జాయింట్ల వద్ద ఉన్న కండరాలు ఎర్రబారి గట్టిపడతాయి. తీవ్రమైన నొప్పి కూడా ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కదలికే కష్టంగా మారిపోవచ్చు. జాయింట్లలో లూబ్రికేషన్ కు సాయపడే కార్టిలేజ్ ను కూడా దెబ్బతీస్తుంది. దీంతో కీళ్ల మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. శరీరంలోని అతి ముఖ్యమైన గుండె సహా ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది. అందుకే ఆర్ఏ సమస్యతో బాధపడేవారికి గుండెపోటు ముప్పు ఎక్కువ. దెబ్బతిన్న జాయింట్లను తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావడం కష్టమే. మహిళలలో 30-60 ఏళ్ల మధ్య ఉన్న వారు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. పురుషుల్లో వృద్ధాప్యంలో కనిపిస్తుంది.

ఎందుకొస్తుంది?
రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎందుకు మన పైనే దాడి చేస్తుందన్న దానికి ఇతమిద్ధమైన కారణాలను గుర్తించలేకపోయారు. అయితే, జీన్స్, హార్మోన్లు, పర్యావరణపరమైన అంశాలు ఇందుకు దారితీయవచ్చన్నది వైద్యుల అభిప్రాయం. హెచ్ఎల్ఏ తరహా జెనెటిక్ మార్కర్ ఉన్న వారికి ఐదు రెట్లు ఆర్ఏ ముప్పు ఎక్కువని గుర్తించారు.

గుర్తించడం
వైద్యులు రోగి చెబుతున్న లక్షణాలను విని, వారి కీళ్లను పరిశీలించడం ద్వారా గుర్తించగలరు. దీనికి అదనంగా రక్తంలో ఈఎస్ఆర్, సి రియాక్టివ్ ప్రొటీన్ (సీఆర్పీ) అన్నవి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలో పెరిగిపోతాయి. రక్త పరీక్షల ద్వారా వీటిని తెలుసుకోవచ్చు.

వెంటనే చికిత్స తీసుకోవాలి
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. మంట, వాపులను వెంటనే తగ్గించాల్సి ఉంటుంది. వాపును తగ్గించేందుకు, రోగ నిరోధక వ్యవస్థ దాడిని నిలువరించేందుకు వైద్యులు కార్టికో స్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమ్మేషన్ డ్రగ్స్ ను, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తారు. కొన్ని రకాల ఎక్సర్ సైజ్ లు, జాయింట్లపై హీట్ ప్యాడ్లు పెట్టుకోవడం, ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి.

రెండూ ఒకేలా...?
గౌట్, ఆర్ఏ రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. ఎందుకంటే రెండింటిలోనూ కీళ్లలో మంట, వాపు, పట్టేసినట్టు ఉండడం, నొప్పి వంటివి ఉండొచ్చు. గౌట్ అన్నది ఎక్కువగా చిన్న జాయింట్లలోనే వస్తుంది. ముఖ్యంగా కాలి బొటన వేళ్లు. అలాగే, కాలి మడమ. కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మాత్రం చేతి మణికట్టు, భుజాలు, మోకాళ్లు, కాలి మడమలు ఇలా అన్ని ముఖ్యమైన జాయింట్లలోనూ రావొచ్చు. ఎక్కువగా చేతి జాయింట్లలో ఇది కనిపిస్తుంది.

ఆర్ఏ లక్షణాలు
జాయింట్లలో నొప్పి, పట్టేసినట్టు ఉండడం, వాపు, మంట ఈ సమస్యలు కనీసం ఆరు వారాల పాటు కొనసాగుతాయి. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత కనీసం 30 నిమిషాల పాటు జాయింట్లు కదలనీయవు. ఒకటికి కంటే ఎక్కువ జాయింట్లు ప్రభావితం అవుతాయి. నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది. వైద్యులు సులభంగానే గుర్తించగలరు.

గౌట్ లక్షణాలు
కాలి బొటన వేలులో తీవ్రమైన నొప్పి వస్తుంది. నొప్పి తగ్గిన తర్వాత కూడా అసౌకర్యం అలానే ఉంటుంది. మంట, వాపు, ఎర్రదనం కనిపిస్తుంది. సమస్య రాకముందు ఉన్నంత కదలిక వచ్చిన తర్వాత జాయింట్ లో ఉండదు.

representational imageఆస్టియో ఆర్థరైటిస్
జాయింట్లలో కణజాలం క్షీణించిపోయే సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. డీజనరేటివ్ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తుంటారు. ఏ కీలులోనైనా ఇది రావచ్చు. కానీ ఎక్కువగా మోకాళ్లకే వస్తుంటుంది. మోకాళ్ల తర్వాత తుంటి కీలు, మెడ, నడుము కింది భాగంలోని జాయింట్లలో, చేయి, కాలి వేళ్లలోనూ సమస్య వస్తుంటుంది.

సాధారణంగా మన కీళ్లలో కార్టిలేజ్ అనే రబ్బర్ వంటి సాగే కణజాలం ఉంటుంది. రెండు ఎముకలు కలిసే చోట అవి మడతకు వచ్చేందుకు, అటూ ఇటూ కదిలేందుకు వీలుగా వాటి చివర్లో ఈ అమరిక ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలో ఈ కార్టిలేజ్ క్షీణించిపోతుంది. దాంతో కీళ్ల కదలికలు సాఫీగా ఉండవు. వాపు, నొప్పి వస్తాయి. ఇక, కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయి రెండు ఎమకలు రాసుకోవడం మొదలైతే మంట కూడా ఉంటుంది. ఇదే ఫైనల్ స్టేజ్. ఇలా కొంత కాలం పాటు సాగితే అప్పుడు ఎముకలు దెబ్బతింటాయి.  

ఎవరికి రిస్క్
ఏ వయసు వారిలో అయినా ఇది వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే, ఎక్కువ శాతం 60 ఏళ్లు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. మహిళలు అయితే 50 ఏళ్లు పైన. మోకాళ్లను ఎక్కువగా ఉపయోగించడం, గతంలో కీళ్లకు గాయాలు అయితే, తొడ కండరాలు బలహీనపడడం వంటివన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ కు కారణం అవుతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ కు కారణం కావచ్చు. అధిక బరువు ఉన్న వారు కూడా ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటే ఆ ప్రభావం మోకాళ్లు, తుంటిపై పడుతుంది. సుదీర్ఘకాలం పాటు కీళ్లు అధిక బరువును మోయాల్సి రావడం వల్ల వాటిలోని కార్టిలేజ్ దెబ్బతింటుంది.

representational imageలక్షణాలు
ఏ భాగంలో సమస్య వచ్చిందన్నదాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. అయితే సాధారణంగా నొప్పితోపాటు పట్టేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత, లేదా ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుని లేచిన తర్వాత కూడా కదలిక వెంటనే రాదు. పట్టేసినట్టు ఉంటుంది. ఈ సమస్య వచ్చిన వారిలో సంబంధిత  కీలు అన్ని వైపులా కదిలించేందుకు వీలు కాదు. కీలు ముడుస్తున్నప్పుడు శబ్ధం వస్తుంది. కొంత పని చేసిన తర్వాత నొప్పి అధికం అవుతుంది. తుంటి ఎముక అరుగుదలలో గజ్జ, పిరుదుల్లో నొప్పి వస్తుంది. తొడల్లోనూ రావచ్చు.

ఫ్రాక్చర్ల ముప్పు
సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను ఎదుర్కొనే వారు 30 శాతం కింద పడిపోయే అవకాశాలు ఎక్కువ. అలాగే ఫ్రాక్చర్ల ముప్పు 20 శాతం అధికంగా ఉంటుంది. ఇలా ఎందుకంటే... ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడితే కీళ్ల కదలిక సాఫీగా ఉండదు. కండరాలు బలహీనపడతాయి. దీంతో బ్యాలన్స్ తప్పి కింద పడిపోతారు.

గుర్తించడం ఎలా...?
నొప్పి ఎప్పుడు ఉంటోంది, జాయింట్లను ఎంత వరకూ కదిలించగలుగుతున్నారు తదితర అంశాల ఆధారంగా, ఎక్స్ రే, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా సమస్యను వైద్యులు నిర్ధారిస్తారు.

representational imageచికిత్స
సాధారణ నడక ఉపయోపడుతుంది. వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది కనుక కండరాలు బలపడే సులభమైనవి సూచిస్తారు. బరువు కూడా తగ్గాల్సి ఉంటుంది. వైద్యులు అదే సమయంలో నొప్పి నివారిణి మాత్రలతోపాటు ఇతరత్రా మందులు సూచిస్తారు. ఫిజియో థెరపీ కూడా అవసరమవుతుంది.

సర్జరీ
దెబ్బతిన్న జాయింట్లను సరిచేసేందుకు, కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోతే... కృత్రిమ పరికరాలతో కీలు మళ్లీ అంతకుముందునాటి స్థితికి తీసుకొచ్చేందుకు గాను కీలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు  పరిస్థితిని బట్టి సిఫారసు చేస్తారు. మందులతో ఉపశమనం లేకుంటే సర్జరీ తప్ప మరో మార్గం లేదు.


More Articles