వేసవిలో విజృంభించే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్తలివే

సాధారణంగా ఎండాకాలం రాగానే కేవలం ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తుతాయని భావిస్తుంటాం. కానీ కేవలం వేడి పెరగడమే కాకుండా పలు రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు కూడా విజృంభిస్తుంటాయి. ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ సమస్యలు, కలరా, విరేచనాలు, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటివి ఎక్కువగా దాడి చేస్తాయి. ఇక గుండెపోటు వంటి సమస్యలు కూడా ఎండాకాలంలో ఎక్కువ ప్రభావం చూపుతాయి. మరి వేసవిలో విజృంభించే వ్యాధులు, తలెత్తే ఆరోగ్య సమస్యలు, వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం..


ఆస్తమాతో జాగ్రత్త
ఎండాకాలంలో ఆస్తమా మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఆస్తమాతో బాధపడుతున్న పిల్లలకు సమస్య తీవ్రతరం అవుతుంది. వేసవి కాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సూక్ష్మజీవులు, ఫంగస్ వంటివి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఇక ఎండాకాలంలో గాలిలో చేరే కాలుష్యం ఎక్కువ సేపు విస్తరిస్తూనే ఉంటుంది. ఈ కారణాలతో ఆస్తమా దాడి తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆస్తమా బాధితులు వేసవి కాలమంతా తమ వెంట ఆస్తమా ఉపశమన ఔషధాలు తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది.

విజృంభించే చర్మ సమస్యలు.. కేన్సర్ కూ అవకాశం
వేసవి కాలంలో చర్మ సమస్యలు విజృంభించే అవకాశం ఎక్కువ. దీనికి రెండు కారణాలున్నాయి. వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి అధికంగా చెమట విడుదల కావడం వంటివి ఒకటైతే... సూర్యరశ్మిలోని అతినీలలోహిత (యూవీ) కిరణాల కారణంగా చర్మంలోని కణాలు దెబ్బతినడం రెండో కారణం.
  • చెమట అధికంగా విడుదల కావడం కారణంగా చర్మంపై తేమ ఎక్కువగా నిలిచి బ్యాక్టీరియా, ఫంగస్ విజృంభిస్తాయి. దీంతో ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముందు నుంచీ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి.. అవి మరింతగా పెరుగుతాయి.
  • ఇక యూవీ కిరణాల కారణంగా చర్మ కణాల్లోని డీఎన్ఏ దెబ్బతింటుంది. దాంతో ఇన్ ఫ్లమేషన్ (వాపు) వచ్చి.. బ్యాక్టీరియా, ఫంగస్ చేరుతుంది. ఇది ఇన్ఫెక్షన్ కు, పలు రకాల చర్మ వ్యాధులకు దారి తీస్తుంది.
  • యూవీ కిరణాల కారణంగా దెబ్బతిన్న చర్మ కణాలు కేన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. దాని వల్ల చర్మ కేన్సర్ తలెత్తుతుంది. ఇది చివరికి తీవ్ర అనారోగ్యానికి దారి తీసే అవకాశమూ ఉంది.
శోభి మచ్చలతో మరింత బాధ
టినియా వర్సికలర్ (శోభి మచ్చలు) సమస్య ఉన్నవారికి వేసవిలో ఈ బాధ మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే చర్మంపై ఫంగస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. చర్మంపై మచ్చలు మరింత పెద్దగా అయ్యే అవకాశముంది. విపరీతంగా చెమట పడుతుంది. మచ్చలు ఉన్న చోట దురద, స్వల్పంగా మంట కూడా వస్తుంది. వైద్యులను సంప్రదించి మందులు వాడడం ద్వారా, తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా దీని నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మం కమిలిపోతుంది
ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడంతోపాటు సూర్యరశ్మిలోని అతినీలలోహిత (అల్ట్రా వయోలెట్-యూవీ) కిరణాల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ సేపు ఎండలో తిరిగితే.. చర్మం కమిలిపోతుంది. దీనినే సన్ బర్న్ గా కూడా పేర్కొంటారు. దీనివల్ల చర్మం కందిపోయి, ఎర్రగా మారుతుంది. చిన్న చిన్న కురుపులు, పొక్కుల వంటివి ఏర్పడి.. మంటగా ఉంటుంది.
  • ఎండలో చర్మం కమిలిపోకుండా ఉండేందుకు ఎండ తగలకుండా వస్త్రాలు ధరించడం, సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
ప్రాణాలు తీసే హైపర్ థర్మియా
అధిక వేడి కారణంగా మన శరీర ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటన్నింటినీ కలిపి హైపర్ థర్మియా గా చెబుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెద్ద వయసు వారు దీని బారినపడే అవకాశం ఎక్కువ. సాధారణంగా మన శరీరంలోనే అంతర్గతంగా ఉష్ణాన్ని నియంత్రించే వ్యవస్థలు ఉన్నాయి. చర్మం ద్వారా, శ్వాస ప్రక్రియ ద్వారా శరీరంలోని అధిక వేడి బయటకు వెళ్లిపోతుంటుంది. కానీ ఎండలు బాగా పెరిగిపోయినప్పుడు మన శరీరం అధిక వేడిని నియంత్రించలేక.. హైపర్ థర్మియా సమస్య తలెత్తుతుంది. వడదెబ్బ తగలడం, నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, కండరాల్లో వణుకు, పట్టు సడలిపోవడం, మతి స్థిమితం కోల్పోవడం, శ్వాస వేగం, గుండె కొట్టుకునే వేగం పెరిగిపోవడం, తలనొప్పి వంటివి నెలకొంటాయి. చివరికి కోమాలోకి వెళ్లిపోతారు. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం. కొద్ది సేపట్లోనే మరణం సంభవించే అవకాశమూ ఉంటుంది.
  • ఆరు బయట ఎండలో పనిచేసేవారు, ఫ్యాక్టరీలు, గనుల వంటి చోట్ల బాగా వేడిగా ఉండే పరిస్థితుల్లో పనిచేసేవారు హైపర్ థర్మియా బారినపడే అవకాశం ఎక్కువ.
  • బాగా ఎండగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. తరచూ అవసరమైనంత నీరు తాగుతూ ఉండాలి.
కాక్సాకీ (Coxsackie) వైరస్ ఇన్ఫెక్షన్
వేసవికాలంలో ఎక్కువగా వ్యాపించే వైరస్ ఇది. ‘చేతులు, కాళ్లు, నోటి డిసీజ్’గా పేర్కొనే ఈ ఇన్ఫెక్షన్ పదేళ్లలోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది. జ్వరంగా ఉండడం, గొంతు బొంగురుపోవడం, నోటిలో పుళ్లు, చేతులు, కాళ్లపై చిన్న కురుపులు ఏర్పడడం వంటివి దీని లక్షణాలు. దీని బారిన పడిన పిల్లలు ఏదైనా తినడానికి, తాగడానికి విముఖత చూపుతుంటారు. చాలా మంది పిల్లలు దీని బారిన పడుతున్నా.. ఏదో సాధారణ జ్వరంగా భావిస్తుండడం జరుగుతుంటుంది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ఈ ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి ప్రత్యేకించి ఔషధాలేమీ లేవు. కొన్ని రకాల యాంటీ బయాటిక్ లు వాడితే తగ్గిపోతుంది. ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా.. పరిశుభ్రత పాటిస్తే, తరచూ నోరు, కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుంటే పది-పన్నెండు రోజుల్లోనే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

వేడి జలుబు
శీతాకాలంలో లాగానే వేసవి కాలంలోనూ తీవ్రమై జలుబు చేసే అవకాశం ఉంటుంది. వేసవిలో రైనో, కరోనా, పారా ఇన్ ఫ్లూయెంజా రకాలతో పాటు ఎంటెరో వైరస్ లు సంక్రమిస్తాయి. చలికాలంలో సంక్రమించే వైరస్ ల కన్నా ఇవి మరింత ప్రభావంతంగా ఉంటాయి. వీటి వల్ల జలుబు లక్షణాలే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులు, డయేరియా, తలనొప్పి, విపరీతమైన దగ్గు వంటి కూడా వస్తాయి. అందువల్ల మందులు వాడినా కూడా ఎక్కువ రోజుల పాటు జలుబు కొనసాగే అవకాశాలు ఎక్కువ. వేడి జలుబుతో పాటు గొంతులో మంట, ముక్కులో శ్లేష్మం కూడా మంటగా ఉండడం జరుగుతుంది. తలనొప్పి కూడా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్స్ కు వెళ్లడం, ఏసీలను వినియోగించడం వంటి కారణాలతో వేడి జలుబు వైరస్ విస్తరించే అవకాశాలు ఎక్కువ. అందువల్ల సరైన పరిశుభ్రత పాటించడం మంచిది.

స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్..
చెవులలో ఎక్కువగా నీరు నిలిచి, ఇన్ఫెక్షన్ రావడమే స్విమ్మర్స్ ఇయర్ డిసీజ్ గా పిలుస్తారు. దీని వైద్యపరమైన పేరు ‘ఒటిటిస్ ఎక్స్ టెర్నా’. ఎక్కువ సమయం స్విమ్మింగ్ చేసేవారికి, షవర్ బాత్ చేసేవారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఎండాకాలంలో చాలా మంది స్విమ్మింగ్ పూల్స్ కు వెళుతుంటారు. తరచూ స్నానం చేస్తుంటారు. దాంతో చెవులలో నీరు నిలిచి బ్యాక్టీరియా, ఫంగస్ లు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎక్కువగా ఉండే ఉష్ణోగ్రత, తేమ కారణంగా మరింతగా పెరిగిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలకు కూడా దారితీస్తుంది.
  • స్విమ్మింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు దూదిని వినియోగించడం వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. పైగా దూదిని ఎక్కువ సేపు ఉంచడం వల్ల చెవిలో తడి ఎక్కువ సేపు ఉండి బ్యాక్టీరియా, ఫంగస్ ల పెరుగుదలకు దారితీస్తుంది.
  • స్విమ్మింగ్, స్నానం చేసిన తర్వాత కాటన్ టవల్, ఇయర్ బడ్స్ తో చెవి లోపలి భాగాన్ని సున్నితంగా శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. కిడ్నీల్లో రాళ్లు
వేసవి కాలంలో మూత్ర నాళ (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకూ వేసవి పరిస్థితులు కారణమవుతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా వస్తుంది. వేసవిలో శరీరానికి నీటి అవసరం పెరగడం, శరీరం ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకోవడం కోసం చెమటను ఎక్కువగా స్రవించడంతో.. శరీరంలో డీహైడ్రేషన్ పరిస్థితి వస్తుంది. దీంతో మూత్రపిండాల్లో వడపోత సరిగా జరుగక రాళ్లు ఏర్పడతాయి. దీంతో మూత్ర నాళ ఇన్ఫెక్షన్లూ వస్తాయి. అందువల్ల వేసవిలో దాహం వేసినా, వేయకపోయినా తరచూ నీళ్లు తాగుతుండడం మంచిది.

గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంది
మన శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా పెరిగితే.. గుండె కొట్టుకునే వేగం పెరిగి, రక్త నాళాల్లో ప్రవాహం ఎక్కువవుతుంది. తద్వారా రక్త నాళాల్లో ఒత్తిడి పెరిగి.. చిట్లిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసే అవకాశముంది. ఇక రక్తపోటు పెరగడం వల్ల మెదడులోనూ రక్త నాళాలు చిట్లిపోయి.. బ్రెయిన్ హెమరేజ్ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కోమాలోకి వెళ్లిపోతారు. మరణం సంభవించే ప్రమాదమూ ఉంటుంది.

ఫుడ్ పాయిజనింగ్
వేసవి కాలంలో బ్యాక్టీరియా, ఫంగస్ లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అందువల్ల ఆహారమేదైనా తక్కువ సమయంలోనే కలుషితం అవుతుంది. అలా కలుషితమైన ఆహారాన్ని తింటే పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధుల్లో ఈ ఫుడ్ పాయిజనింగ్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. డయేరియా, కలరా వంటివి తలెత్తుతాయి. అందువల్ల వేసవి కాలంలో నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం. ఎప్పటికప్పుడు వండుకోవడం, లేదా మైక్రోవేవ్ చేసుకోవడం బెటర్.
  • ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల్లో కూడా బయటకు తీశాక గంటలోపే బ్యాక్టీరియా, ఫంగస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల వెంటనే తినేయడం బెటర్.
  • ఆహార పదార్థాలను వండినప్పుడు పరిశుభ్రత పాటించాలి. వాటిని ఎక్కువ సేపు బయట ఉంచకుండా ఫ్రిజ్ లో పెట్టుకోవడం మంచిది.
పెద్ద వయసువారు, పిల్లలు మరింత జాగ్రత్
తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు, వడగాలుల కారణంగా పెద్ద వయసు వారు, చిన్న పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వడగాలుల వంటివి వీస్తే.. ఆస్తమా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇక పెద్ద వయసు వారిలో డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలు, కాలేయ సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. అంతేకాదు రక్తపోటు పెరగడం వంటి సమస్యలూ ఉంటాయి. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల్లో పలు రకాల వ్యాధులు, జబ్బులు విజృంభించే అవకాశం ఉంటుంది.

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • వీలైనంత వరకు ఎండగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం మంచిది.
  • తేలికైన, వదులుగా ఉన్న, లేత రంగుల వస్త్రాలు ధరించాలి. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ఉపయోగించడం బెటర్.
  • ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. దాహంగా అనిపించిన వెంటనే నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
  • ఆల్కాహాల్, కాఫీ, టీల వంటివి డీహైడ్రేషన్ కు కారణమవుతాయి. వీలైనంత వరకు వేసవిలో వాటికి దూరంగా ఉండాలి.
  • ఒకేసారి ఎక్కువగా తినకుండా ఎక్కువసార్లు కొద్ది కొద్దిగా తినాలి. దీనివల్ల శరీరం యాక్టివ్ గా ఉండి.. ఉష్ణోగ్రతను సమర్థంగా నియంత్రించగలుగుతుంది.
  • ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది.
  • రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.


More Articles