స్నేహితులకు అప్పు ఇస్తున్నారా? లేదంటే హామీ ఇస్తున్నారా...? ఒక్కసారి ఇవి తెలుసుకోండి!

‘స్నేహితుడి దగ్గర రుణ దాత కావద్దు. రుణ గ్రహీత కావద్దు’ ఇది అనుభవమున్నవారు చెప్పే మాట. ఎందుకంటే స్నేహితుడికి రుణ సాయం చేస్తే డబ్బుతోపాటు స్నేహితుడ్నీ కోల్పోవాల్సి వస్తుందంటారు. కానీ, ’ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్’ అనే నానుడీ ఉంది. అంటే అవసరంలో ఆదుకునేవాడే అసలైన స్నేహితుడంటారు. కనుక మంచి స్నేహితులు, సన్నిహితులకు డబ్బును బదులుగా ఇవ్వాల్సి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం...

స్నేహితుల మధ్య ధనమనేది శత్రువుగా మారగలదు. ఇది చాలా సున్నితమైన అంశం. జాలా జాగ్రత్తగా డీల్ చేయకపోతే బంధమే దెబ్బతింటుంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. సాధారణంగా స్నేహితుల మధ్య నగదు వ్యవహారాలకు సంబంధించి చట్టబద్ధమైన ఒప్పందాలు అధిక శాతం జరగవు. స్నేహితులపై నమ్మకంతో అడిగినంత ఎటువంటి హామీలు లేకుండానే ఇచ్చేస్తుంటారు. చెప్పిన గడువుకు తిరిగి చెల్లిస్తారన్నది ఒక నమ్మకం. కానీ అవసరం ఏర్పడినప్పుడు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో మీ స్నేహితుడు విఫలం కావచ్చు. అతడి వైపు ఆర్థిక ఇబ్బందులు, లేదంటే మీ అవసరాలను గుర్తించలేకపోవడం, లేదా ఎటువంటి ఒప్పందాలు లేకుండా ఇచ్చినందున తిరిగి చెల్లించకపోతే ఏమవుతుందిలేనన్న నిర్లక్ష్యం.. ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందుకే అవసరంలో స్నేహితుడికి ఆపన్త హస్తం అందించే ముందు మీ ప్రయోజనాలను కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది.
representative imageరుణం వెంట రుణం
కారణమేదైతేనేమి తీసుకున్న రుణాన్ని మీ స్నేహితుడు తిరిగి చెల్లించడంలో విఫలమై, మరోసారి మరికొంత నగదు కావాలంటూ మీ దగ్గరకు రావచ్చు. సరిగ్గా ఇక్కడే సమస్య పెద్దది అవుతుంది. మీరు మీ స్నేహితుడు అడిగినంత మరోసారి ఇచ్చేస్తే మరింత సమస్యలో చిక్కుకున్నట్టే. ఇవ్వకపోయినా ఇదే పరిస్థితి. ఎందుకంటే మొదటి సారి ఇచ్చింది తిరిగి రాని పరిస్థితికి దారితీయవచ్చు. ఇచ్చిన నగదును తిరిగి చెల్లించాలని స్నేహితుడ్ని కోరితే అప్పుడు అతడిపట్ల మీకున్ననమ్మకం సైతం గాయపడవచ్చు. అడిగినంత పూర్తిగా ఇచ్చేస్తే సమస్యే ఉండదు. కొద్ది భాగం ఇచ్చి తర్వాత ఇస్తానని చెప్పవచ్చు.

తప్పించుకోవడమే ఉత్తమం
తనకు ధన సాయం కావాలంటూ మిమ్మల్ని ఆశ్రయించే వారి విషయంలో తెలివిగా వ్యవహరించండి. ఇస్తానని లేదా ఇవ్వనని చెప్పే ముందు కాస్త ఆలోచించండి. ఇవ్వను అంటే స్నేహాన్ని కోల్పోవాల్సి రావచ్చు. మీ నుంచి డబ్బులు కాకుండా స్నేహితుడికి రుణం పుట్టే ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించండి. పర్సనల్ లోన్, ప్రాపర్టీపై రుణం, బంగారంపై రుణం, ఎఫ్ డీపై రుణం, ప్రైవేటు ఫైనాన్షియర్ల నుంచి రుణం పొందే మార్గాల్లో ఏదో ఒకటి సూచించండి.

ఇస్తానని మాటిస్తే...?
స్నేహితుడి అవసరాన్ని గుర్తించి రుణం ఇవ్వడానికి సిద్ధమైపోతే దానికంటే ముందు కొన్ని పాటించాల్సి ఉంటుంది. తీసుకుంటున్న నగదును తిరిగి కచ్చితంగా ఎన్నాళ్లకు చెల్లిస్తారన్న విషయాన్ని సూటిగా ప్రశ్నించాలి. కచ్చితంగా ఫలానా తేదీకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని ముందే స్పష్టం చేయాలి. తీసుకున్న రుణాన్ని ఒకేసారి మొత్తం తిరిగి చెల్లించడం కష్టతరం కావచ్చు. అందుకే నెలనెలా వాయిదాల రూపంలో చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి.
representative imageఒప్పందం అవసరం...
స్నేహితుడే కదా అన్న గుడ్డినమ్మకం పనికిరాదు. ధనంతో ముడిపడిన వ్యవహరాల్లో ఒప్పందాలు చేసుకోవడం చాలా అవసరం. రుణం తీసుకుంటున్నా, ఇస్తున్నా ప్రామిసరీ నోటు లేదా తెల్లకాగితం లేదా స్టాంప్ పేపర్ పై అన్ని వివరాలు రాసుకుని సంతకాలు తీసుకోవాలి. ఇందులో రుణం మొత్తం ఎంత? కాల వ్యవధి, నిబంధనలు, వడ్డీ తీసుకుంటే అది ఎంత శాతం వంటి వివరాలన్నీ ఉండాలి. హామీదారు లేదా సాక్షుల సంతకాలు కూడా తీసుకోవాలి. వాటిని నోటరీ కూడా చేయించుకోవడం ద్వారా ఆ వ్యవహారానికి చట్టబద్ధత, పారదర్శకత ఏర్పడతాయి. అలాగే, రుణ సాయాన్ని అకౌంట్ పేయీ చెక్ రూపంలో ఇవ్వడం ద్వారా ఆధారంగా పనికివస్తుంది. పైగా సంబంధిత చెక్ నంబర్ ను అగ్రిమెంట్ లో పేర్కొనాలి. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వాలని కూడా కోరవచ్చు.

ప్రామిసరీ నోట్ అన్నది తిరిగి కోరినప్పుడు చెల్లిస్తానని అంగీకారం తెలియజేయడం, నిర్దిష్ట, వివరణాత్మక నిబంధనల మేరకు రుణ ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని డీహెచ్ లా అసోయిేట్స్  పార్ట్ నర్ గుర్మీత్ సింగ్ కెయినాథ్ సూచన. కేవలం రికార్డుల కోసమే అయితే, ప్రామిసరీ నోటు సరిపోతుంది. స్టాంప్ పేపర్ పై నోట్ రాసుకుని దాన్ని నోటరీతో అటెస్ట్ చేయించడం ఉత్తమం. ఒకేసారి చెల్లించాలా? లేక నెలనెలా చెల్లించాలా? తదితర మఖ్య విషయాలను కూడా రాసుకోవాలి. స్టాంప్ పేపర్లు, ప్రామిసరీ నోట్లపై పూర్తిపేరును వారి గుర్తింపు ధ్రువీకరణ పత్రాల సాయంతో తెలుసుకుని రాసుకోవాలి. స్నేహితులకు ఇచ్చే రుణంపై వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను ఉంటుందన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి.

వివాదం తలెత్తితే...
ఇక స్నేహితుల మధ్య రుణం విషయంలో వివాదం ఏర్పడితే రాసుకున్న ఒప్పందాలు సాయంగా పనికివస్తాయి. చెప్పిన గడువుకు చెల్లింపులు జరగకపోతే వెంటనే చట్టబద్ధమైన చర్యలు ప్రారంభించాలి.
representative imageఈ జాగ్రత్తలు అవసరం
- ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన నగదు లావాదేవీల గురించి ఇతర స్నేహితుల వద్ద, ఇతరుల వద్ద ప్రస్తావనకు తేకూడదు. దీనివల్ల స్పర్థకు దారితీస్తుంది. ఎందుకంటే ఒకరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారనే తప్పుడు సంకేతం కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
- ఒకవేళ ధన సాయం కావాలంటూ వచ్చే స్నేహితుడికి ఇవ్వలేని పరిస్థితే ఉంటే నిర్మొహమాటంగా అదే చెప్పేయాలి.
- అసలు మీ స్నేహితుడు మీ వద్ద చేయి చాచాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్నది పరిశీలించిన తర్వాత గానీ సరే, కాదు అనే వాటిలో ఓ నిర్ణయం తీసుకోండి.
- ఒకవేళ ఎవరికైనా రుణం ఇవ్వడానికి సిద్ధమైపోతే, భవిష్యత్తులో ఆ మొత్తం తిరిగి రాకపోయినా మీ జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటేనే ఆ నిర్ణయం తీసుకోవాలి.
- స్నేహితుడు ధన సాయం కోరుతూ వచ్చిన సమయంలో మీ వద్ద అత్యవసరాలకు కేటాయించిన డబ్బులు ఉన్నాయనుకోండి. లేదా ఇంటి కోసం, పిల్లల విద్యావసరాల కోసం పొదుపు చేస్తున్న నిధి ఉందనుకోండి. వాటి నుంచి ఇవ్వడం ఎంత మాత్రం సరైనది కాదు.
- పొదుపులో 5 శాతాన్ని లిక్విడ్ ఫండ్స్ లో పెట్టడం వల్ల వాటిని స్నేహితులు, సన్నిహితులకు అవసరంలో సాయం చేసేందుకు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల తిరిగి చెల్లించడంలో వారు విఫలమైనా సమస్యల్లో పడకుండా ఉంటుందని పేర్కొంటారు.

ఇస్తే ఏమవుతుంది..?
ధన సాయం కావాలంటూ వచ్చే స్నేహితుడికి నో చెప్పడం కొందరికి చిటికెలో పని. కానీ, ఇలా చెప్పడం వల్ల మంచి స్నేహితుడ్ని కోల్పోవాల్సి వస్తుందేమో ఓ సారి ఆలోచించండి. నిజంగా స్నేహితుడికి అత్యవసరం ఉందని గుర్తిస్తే ధన సాయం చేయడం ద్వారా తమ మధ్యనున్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు.

టీబీఎన్జీ కేపిటల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు తరుణ్ బిరానీ మాత్రం తాను బంధువులు, స్నేహితులకు ఏమివ్వాలన్నా ముందుగా ఓ సారి పరిశీలించుకుంటానని తెలిపారు. కొందరు తరచుగా అడిగే పనిలోనే ఉంటుంటారు. అలాంటి వారికి ఒకటి రెండుసార్ల తర్వాత నుంచి తిరస్కరించడం సరైనదని 'మనీమంత్ర' వ్యవస్థాపకుడు విరాళ్ భట్ సూచించారు. లేదా ముందు ఇచ్చిన దాన్ని తిరిగి చెల్లించిన తర్వాతే మళ్లీ అడగానికి అవకాశం ఉంటుందని చెప్పేయాలంటారు.

ఇక రూపీవిజ్ సీఎఫ్ వో సప్నాతివారీ చెబుతున్న దాని ప్రకారం తనకు నగదు సాయం కావాలని కోరుతూ వచ్చే వ్యక్తి ఎంత కాలం నుంచి తెలుసు?, ఎంత తరచుగా ఇద్దరూ మాట్లాడుకుంటారు అన్నవి గమనించుకోవాలట. దాని ద్వారా అడిగే వ్యక్తి అసలైన స్నేహితుడా? కాదా? అన్నది తెలుస్తుందని చెబుతారు.

ధన సాయం కోరే వ్యక్తి ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవాలి. ఎటువంటి ఉపాధి లేని వారయినా, భారీగా అప్పులు చేసి ఉన్నా వారికిచ్చే రుణం గంగపాలైనట్టుగానే భావించాలి. ధనం కావాలంటూ వచ్చే వారికి వెంటనే ఇవ్వకుండా గడువు కోరాలి. దానివల్ల అంతకాలం ఆగవద్దనుకునే వారు దాన్ని ఇతరుల వద్ద సమకూర్చుకుంటారు. దానివల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
representative imageహామీ ఇస్తున్నారా...?
ధన సాయం కోరుతూ వచ్చే వారు కొందరయితే, తాను రుణం తీసుకుంటున్నా గ్యారంటర్ (హామీదారుడు)గా ఉండాలని కోరుతూ వచ్చే వారు కొందరు ఉంటారు. ఉత్తి హామీయేగా అని కొందరు అనుకుంటారు. కానీ హామీ ఇస్తే స్నేహితుడి రుణానికి పూర్తి బాధ్యత తలకెత్తుకున్నట్టే అని తెలుసుకోవాలి. ఏ రుణానికి గ్యారంటర్ గా ఉన్నా సరే.... రుణం తీసుకున్న వారికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎంతుంటుందో... వారు చెల్లించకుంటే అంతే బాధ్యత గ్యారంటర్ పై ఉంటుంది. రుణం తీసుకున్న వారు చెల్లించడంలో విఫలమైన పరిస్థితుల్లో అవసరమైతే తాను చెల్లిస్తానని రుణదాతకు గ్యారంటీ ఇస్తూ రుణ పత్రాలపై సంతకం చేసినట్టు తెలుసుకోవాలి. అందుకే రుణ గ్రహీత నెలవారీ వాయిదాలు చెల్లించకుంటే తొలుత బ్యాంకు సిబ్బంది వారికి ఫోన్ చేసి చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. అయినా చెల్లించకుంటే అప్పుడు గ్యారంటర్ గా ఉన్న వారికి కాల్స్ వస్తాయి. ఏ రుణానికి హామీగా ఉన్నా గానీ ఆ సమాచారం హామీదారుడి సిబిల్ రిపోర్ట్ లో కనిపిస్తుంది. హామీ నిలబెట్టుకోకుంటే సిబిల్ స్కోరు పడిపోయినట్టే.

గ్యారంటీ ఇచ్చే ముందు...
రుణానికి హామీదారుడిగా ఉండే ముందు సంబంధిత పత్రాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. సందేహాలుంటే న్యాయనిపుణులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా క్లాజులు ఇబ్బందిగా అనిపిస్తే లేదా అస్పష్టంగా అనిపిస్తే సంతకం చేయకండి. ఆర్థిక సంస్థలకు తప్ప మీ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ ఫొటో కాపీలను ఎవరికీ ఇవ్వకూడదు. హామీదారుడిగా ఉంటే రుణ గ్రహీత సక్రమంగా చెల్లిస్తున్నాడా అన్నది క్రమం తప్పకుండా చూసుకోవాలి. లేదంటే హామీగా ఉన్న వారి క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది.

హామీ ఇచ్చే ముందు రుణం తీసుకుంటున్న వారి సమగ్ర ఆర్థిక వివరాలు తెలిసి ఉండడం తప్పనిసరి. ఎందుకంటే వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఆ బాధ్యత మెడకు చుట్టుకునేది గ్యారంటర్ కే. ఒక్కసారి హామీగా నిలబడితే రుణం ఇచ్చే బ్యాంకు హామీదారుడి నుంచి జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లపై సంతకం చేయించుకుంటుంది. హామీదారుడి బ్యాంకు నంబర్ సైతం తీసుకుంటుంది. ఒకవేళ రుణ గ్రహీత వాయిదాలు చెల్లించకుంటే హామీదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆ మొత్తాన్ని డెబిట్ చేసుకుంటాయి. రుణాన్ని తిరిగి చెల్లించే ప్రాథమిక బాధ్యత రుణదాతలపైనే ఉంటుంది. వారు విఫలమైతేనే ద్వితీయ బాధ్యత హామీదారులకు ఉంటుంది.


More Articles