హోం థియేటర్లు, స్పీకర్ సిస్టంలలో ఏది బెటర్? ఎక్కువ RMS ఉంటేనే ఎక్కువ సౌండ్..

ఇటీవలి కాలంలో హోం థియేటర్ సిస్టమ్ లు, బ్లూటూత్ స్పీకర్ల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్లో ఎన్నో రకాల స్పీకర్ సిస్టమ్ లు అందుబాటులో ఉన్నాయి. 5.1, 4.1, 2.1, సౌండ్ బార్లు, టవర్ స్పీకర్లు వంటి ఎన్నో విభిన్నమైన పేర్లతో లభిస్తున్నాయి. వాటి సామర్థ్యానికి సంబంధించి కూడా RMS, Watts, PMPO అని పేర్కొంటూ ఉంటారు. వీటికి అర్థం ఏమిటి, ఏది ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువగా వస్తుందనే దానిపై మాత్రం చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల ఏదో ఒక దానిని కొనేస్తుంటారు.


మరి ఈ 5.1, 4.1, 2.1, సౌండ్ బార్లు, టవర్ స్పీకర్లు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎక్కడెక్కడ ఎలా అమర్చాలి? పూర్తి స్థాయిలో హోం థియేటర్ అనుభూతి పొందేందుకు ఏయే పరికరాలు అవసరం? బ్లూటూత్ స్పీకర్లలో ఏది కొంటే బెటర్? స్పీకర్ సిస్టమ్ లు, బ్లూటూత్ స్పీకర్లను కొనుగోలు చేసేముందు పరిశీలించాల్సిన అంశాలేమిటో తెలుసుకుందామా..


స్పీకర్ బాక్స్, స్పీకర్ సైజు ముఖ్యం కాదు..
మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు, చాలా రకాల సైజుల్లో హోం థియేటర్లు, స్పీకర్ సిస్టంలు లభిస్తుంటాయి. కొన్ని చాలా తక్కువ ధరలకే పెద్ద పెద్ద హోం థియేటర్ సిస్టంలను విక్రయిస్తుంటారు. అందంగా ఉండే డిజైన్లలో.. ఒక పెద్ద సబ్ వూఫర్ ను పెట్టి వాటి సామర్థ్యాన్ని 3000 వాట్స్, 5000 వాట్స్ అంటూ ప్రకటనలు గుప్పిస్తుంటారు. అవి చూసి మనం ధ్వని బాగా వస్తుంది, మంచి నాణ్యత ఉన్న స్పీకర్లు అనుకుని మోసపోతుంటాం. ధ్వని పెద్దగా వచ్చినా స్పష్టంగా, సరైన నాణ్యత లేకుండా ఉంటే మనకు విన్న అనుభూతి సరిగా ఉండదు. అందువల్ల మంచి బ్రాండెడ్ కంపెనీవి ఎంచుకోవడం ఉత్తమం.

చూడాల్సింది RMS రేటింగ్..
స్పీకర్ల ధ్వని తీవ్రతకు అసలైన ప్రమాణం Watts, PMPO కాదు. కచ్చితంగా స్పీకర్ నుంచి వెలువడే ధ్వని స్థాయిని తెలిపేది RMS రేటింగ్. ఇది ఎంత ఎక్కువగా ఉంటే స్పీకర్ నుంచి అంత పెద్దగా ధ్వని వస్తుంది.
  • PMPO అంటే పీక్ మ్యూజిక్ పవర్ ఔట్ పుట్ (గరిష్టంగా వెలువడే ధ్వని తీవ్రత). అంటే కేవలం ఆ యాంప్లిఫయర్/స్పీకర్ నుంచి గరిష్టంగా వెలువడే ధ్వని తీవ్రత. ఇది కేవలం ఒక సెకను పాటు కావొచ్చు. అంతకన్నా తక్కువ సమయం పాటు కూడా కావొచ్చు.
  • RMS అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ (నిరంతరంగా వెలువడే ధ్వని తీవ్రత). ఇది గణిత సంబంధమైన పదం. అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా యాంప్లిఫయర్/స్పీకర్ నుంచి కొంత సమయం పాటు వెలువడే ధ్వని తీవ్రత సగటుగా చెప్పవచ్చు. ఇది ఆయా స్పీకర్ల సరైన సామర్థ్యాన్ని కచ్చితంగా చెబుతుంది.
  • RMS గానీ, PMPO గానీ వాట్లలో వాటి సామర్థ్యాన్ని చెబుతుంటారు. ఉదాహరణకు 2000 వాట్ల PMPO, 20 వాట్ల RMS పవర్.. ఇలా పేర్కొంటారు.
  • PMPO సామర్థ్యాన్ని సూచించే సంఖ్యలు వందలు, వేలల్లో ఉంటాయి. ఉదాహరణకు 2000 వాట్లు, 5000 వాట్లు ఇలా.. అదే RMS సామర్థ్యాన్ని సూచించే సంఖ్యలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు 7 వాట్స్, 20 వాట్స్, 50 వాట్స్, 65 వాట్స్.. ఇలా ఉంటాయి.
  • సాధారణంగా చెప్పాలంటే ఒక వాట్ RMS పవర్ అంటే.. సుమారు 45 నుంచి 50 వాట్ల PMPO గా చెప్పవచ్చు. అంటే 50 వాట్ల RMS పవర్ అంటే దాదాపుగా 2500 వాట్ల PMPO తో సమానం. అయితే PMPO ను నిర్ధారించేందుకు కచ్చితమైన ప్రమాణాలేవీ లేవు. దాంతో చాలా కంపెనీలు తమకు ఇష్టం వచ్చిన అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని PMPO ను నిర్ణయించి, ప్రకటిస్తుంటాయి. అందువల్ల RMS పవర్ కు PMPO కు చాలా తేడా ఉంటుంది. కానీ ఏ కంపెనీ అయినా సరే RMS పవర్ ను పేర్కొంటే.. అది కచ్చితమైన విలువే అయి ఉంటుంది.
  • కానీ PMPO ఎంత ఎక్కువగా ఉన్నా.. స్పీకర్ల నుంచి వెలువడే శబ్దం నాణ్యత బాగుంటుందనే గ్యారెంటీ ఉండదు. తక్కువ ధరకు విక్రయించే కంపెనీలు తమ ఉత్పత్తులపై PMPO రేటింగ్ ను మాత్రమే పేర్కొంటాయి. వాటిలో స్పీకర్లు, యాంప్లిఫయర్ల నాణ్యత కూడా తక్కువగా ఉంటుంది.
  • మంచి కంపెనీలు తమ హోంథియేటర్లు, స్పీకర్ల సామర్థ్యాన్ని RMS పవర్లో మాత్రమే పేర్కొంటుంటాయి. వాటిలో స్పీకర్లు, యాంప్లిఫయర్ల నాణ్యత బాగుంటుండడం వల్ల వెలువడే శబ్దం నాణ్యత, బేస్ చాలా బాగుంటుంది.
హోం థియేటర్, స్పీకర్ సిస్టం కాన్ఫిగరేషన్లు..
స్పీకర్ల కాన్ఫిగరేషన్.. అంటే ఎన్ని స్పీకర్లు, సబ్ వూఫర్ ఉందా అనే అంశాలను మీకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా స్పీకర్, హోంథియేటర్ సిస్టంలు 2.1.. 4.1.. 5.1.. 7.1.. 9.1 ఇలా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ స్పీకర్లు ఎందుకంటే డీటీఎస్ సినిమా థియేటర్ లోలాగా ఒక్కో వైపు నుంచి వేర్వేరుగా ధ్వనులు వినిపించే అనుభూతి కోసం. ఇలా పూర్తి స్థాయి అనుభూతి పొందాలంటే కంప్యూటర్ లో 5.1 సపోర్ట్ ఉండాలి. లేకపోతే అదనంగా సౌండ్ కార్డ్ అమర్చుకోవచ్చు.

2 చానల్ (2.0) స్పీకర్స్:
ఇవి అత్యంత సాధారణ స్పీకర్లు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతోపాటు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెటకు కూడా అనుసంధానించుకోవడానికి వీలుగా ఉంటాయి. 3.5 ఎంఎం జాక్ తో అనుసంధానించుకోవచ్చు. వీటికి ప్రత్యేకంగా పవర్ సప్లై అవసరం లేకుండా యూఎస్ బీ పోర్టు నుంచి విద్యుత్ తీసుకునేలా కూడా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకు లభించడం, చిన్నగా ఉండడం, అవసరమైతే ఎక్కడికైనా తీసుకెళ్లగలగడం వీటితో అదనపు ప్రయోజనం. సాధారణ ఆడియో అవసరాలకు ఇవి సరిపోతాయి.

2.1 చానల్ స్పీకర్లు:
సాధారణ స్పీకర్లకు కొంచెం మెరుగ్గా, మంచి బేస్ ఎఫెక్ట్ తో వినేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. వీటిలో రెండు స్పీకర్లకు తోడు ఒక సబ్ వూఫర్ ఉంటుంది. 3.5 ఎంఎం జాక్ తో వస్తాయి. ఇందులో తక్కువ సామర్థ్యం నుంచి పవర్ ఫుల్ సౌండ్ ఔట్ పుట్ ఇచ్చే దాకా చాలా మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. మన బడ్జెట్ ను, అవసరాన్ని బట్టి కావాల్సిన దానిని ఎంచుకోవచ్చు. వీటిని తప్పనిసరిగా పవర్ సప్లైకి అనుసంధానించాల్సిందే. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎంపీ3 ప్లేయర్లను అనుసంధానం చేసుకుని పాటలు వినవచ్చు. కొన్నింటిలో ఇన్ బిల్ట్ గా మెమరీ కార్డ్ రీడర్లు, యూఎస్ బీ పోర్టు కూడా ఉండేవి అందుబాటులో ఉన్నాయి.

4.1 చానల్ స్పీకర్లు:
వాస్తవానికి చెప్పాలంటే 4.1 చానల్ స్పీకర్లు అనేది సాంకేతికంగా తప్పు. ఎందుకంటే ఇది దాదాపుగా 2.1 తరహాలోనే పనిచేస్తుంది. అదనంగా ఇచ్చే రెండు స్పీకర్లు ఒక్కొటి ఇరు పక్కలా ఉండే స్పీకర్లకు అనుసంధానమై ఉంటాయి. కాస్త పెద్ద ధ్వని కోసం, గదిలో అన్ని వైపుల నుంచీ ధ్వని వస్తున్నట్లుగా అనుభూతి కోసం ఇవి తోడ్పడతాయి. కానీ వేర్వేరు ధ్వనులు వేర్వేరు స్పీకర్ల నుంచి వచ్చే సౌకర్యం ఉండదు.

5.1 చానల్ స్పీకర్లు:
థియేటర్ల తరహాలో డాల్బీ డిజిటల్ సౌండ్ (DTS) అనుభూతిని పొందడానికి వీలయ్యే స్పీకర్ సిస్టమే 5.1 హోం థియేటర్. దీనిలో ఒక సబ్ వూఫర్ తోపాటు ఐదు స్పీకర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో సబ్ వూఫర్ తోపాటు ఒక స్పీకర్ ను మధ్యలో అమర్చుకుని.. మిగతా స్పీకర్లను వివిధ దిశల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని వైర్లు ఉండడం వల్ల వీటిని అమర్చుకోవడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. కానీ సరిగ్గా అమర్చితే అద్భుతమైన ఆడియో అనుభూతిని పొందవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం వినాలనుకున్న ఆడియో లేదా వీడియో 5.1 చానల్ సౌండ్ ఎఫెక్ట్ కల్పించబడిందై ఉండాలి. ప్రస్తుతం వస్తున్న అన్ని పాటలు, సినిమాలు దీనికి అనుగుణంగానే ఉంటున్నాయి.
  • ఈ 5.1 చానల్ హోం థియేటర్లు మూడు 3.5 ఎంఎం జాక్ లతో వస్తాయి. అయితే పూర్తి స్థాయిలో డీటీఎస్ అనుభూతిని పొందాలంటే కంప్యూటర్ లో 6 చానల్ ఆడియో సపోర్ట్ ఉండాలి లేదా అదనంగా సౌండ్ కార్డ్ ను అమర్చుకోవచ్చు.
సౌండ్ బార్ లు, టవర్ స్పీకర్లు
పలు రకాల హోం థియేటర్లలో భాగంగానూ, విడిగా స్పీకర్ సిస్టంలుగాను సౌండ్ బార్ లు, టవర్ స్పీకర్ వంటి రకాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో సాధారణంగా సబ్ వూఫర్ ఉండదు. ఒకటికి మించిన సంఖ్యలో స్పీకర్లు ఉంటాయి. కొన్ని రకాల సౌండ్ బార్ లు, టవర్ స్పీకర్లలో మాత్రం సబ్ వూఫర్లు కూడా ఉంటాయి.
  • నిలువుగా ఉండే స్పీకర్లను టవర్ స్పీకర్లు అంటారు. తక్కువ స్థలంలో ఇమిడిపోయేలా ఇవి ఉంటాయి. పూర్తిగా బాక్స్ లా కొన్ని ఉంటే.. ఒక స్టాండ్ సహాయంతో కొంత ఎత్తులో ఏర్పాటు చేసేలా మరికొన్ని టవర్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి. హోం థియేటర్లను గదిలో ఏర్పాటు చేసేందుకు సరైన సౌకర్యం లేకపోతే టవర్ స్పీకర్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
  • ఇక అడ్డంగా ఒక బార్ లాగా ఉండే స్పీకర్లను సౌండ్ బార్లు అంటారు. ఇవి అడ్డంగా ఉండి ఒకటికి మించి స్పీకర్లను కలిగి ఉంటాయి. అందం కోసం, ప్లేస్ మెంట్ కోసం ఈ తరహా స్పీకర్లు బాగా పనికివస్తాయి. ముఖ్యంగా 50 అంగుళాలకు పైబడిన భారీ టీవీల వంటి వాటికి హోం థియేటర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు సౌండ్ బార్ లను ఎంచుకుంటారు.
బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు
ఇటీవలి కాలంలో బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు అందుబాటులోకి వచ్చాయి. మనం ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లగలిగేలా.. ఓ మోస్తరు స్థాయిలో ధ్వనిని ఇచ్చేలా ఉండడం, రీచార్జబుల్ కావడం వాటి ప్రత్యేకతలు. బ్లూటూత్ సౌకర్యం ఉన్న ఏ ఫోన్, ట్యాబ్లెట్ తో అయినా వీటిని వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ చార్జింగ్ కేబుల్ తోనే చార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం అదనపు ప్రయోజనం కూడా. రెండు, మూడు గంటల పాటు చార్జింగ్ పెడితే దాదాపు ఐదారు గంటల పాటు పాటలు వినేందుకు వీలుంటుంది.
  • బ్యాటరీ సామర్థ్యాన్ని, ధ్వని తీవ్రతను, నాణ్యతను బట్టి రూ.500 నుంచి రూ.4,000 వరకు ఈ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు అందుబాటులో ఉన్నాయి.
  • ఎక్కడికైనా బయటికి వెళ్లినప్పుడు, పిక్నిక్ ల వంటి సమయాల్లో బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు బ్లూటూత్ టెక్నాలజీ చాలా తక్కువ విద్యుత్ ఉపయోగించుకుంటుంది కాబట్టి.. మన ఫోన్ లో చార్జింగ్ తగ్గిపోతుందన్న సమస్య ఉండదు.
  • కొన్ని పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లలో మెమరీకార్డ్, పెన్ డ్రైవ్ ల వంటివి పెట్టుకునే సౌకర్యం ఉంటోంది. వాటిలో అయితే నేరుగా మెమరీకార్డు పెట్టుకుని పాటలు వినవచ్చు.
ఎక్కువ వాల్యూం పెట్టి చూడండి
హోం థియేటర్, స్పీకర్ల నుంచి వెలువడే ధ్వని నాణ్యతను నిర్ధారించే ప్రమాణాలేవీ లేవు. మంచి కంపెనీలకు చెందిన ఉత్పత్తులు మంచి ధ్వనిని అందించలేవు. తక్కువ ధరకు దొరికే సాధారణ కంపెనీల స్పీకర్లు, హోం థియేటర్ల నుంచి వెలువడే ధ్వని పూర్తి స్పష్టంగా ఉండదు. వాటి నుంచి నాయిస్ (ఇబ్బందికరమైన శబ్దాలు) వస్తుంటాయి. తక్కువ వాల్యూమ్ పెట్టి చూసినప్పుడు దీనిని గుర్తించలేం. ఎక్కువ వాల్యూం పెట్టి పరీక్షించినప్పుడు మాత్రమే ధ్వని స్పష్టత ఎలా ఉందనేది తెలుస్తుంది. సబ్ వూఫర్ల సామర్థ్యమేమిటో తెలియాలంటే.. మంచి బేస్ ఉన్న ఆడియోను ప్లే చేసి చూడాలి.

అదనపు సౌకర్యాలనూ పరిశీలించాలి
హోంథియేటర్లు, స్పీకర్ సిస్టంలలో ఇటీవల ఎన్నో రకాల అదనపు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఎన్ని రకాల అదనపు హంగులు ఉన్నా.. స్పీకర్ల సామర్థ్యం, నాణ్యతకే ప్రాధాన్యమిచ్చి కొనుగోలు చేయడం ఉత్తమం.
  • ప్రస్తుతం చాలా కంపెనీల హోం థియేటర్లలో డిజిటల్ డిస్ప్లే ఉంటోంది. వాస్తవానికి స్పీకర్లలో ఇది అంత ముఖ్యమైనదేమీ కాదు. దీనివల్ల ధర ఎక్కువగా ఉంటుంది.
  • పలు రకాల హోం థియేటర్లు, స్పీకర్లలో రిమోట్ కంట్రోల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇది చాలా వరకు మంచి సౌకర్యం. ఎందుకంటే ప్రతిసారి దగ్గరికి వెళ్లి ధ్వనిని పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివి చేయనవసరం లేదు.
  • యూఎస్ బీ పోర్టులు, మెమరీ కార్డు రీడర్లు ఉన్న హోం థియేటర్లతో అదనపు ప్రయోజనం ఉంటుంది. వాటిని టీవీ, కంప్యూటర్ వంటి వాటికి అనుసంధానించాల్సిన అవసరం లేకుండానే.. నేరుగా పాటలు వినడానికి తోడ్పడుతుంది.
  • కొన్ని స్పీకర్ సిస్టం లలో బ్లూటూత్ సదుపాయం కూడా వస్తోంది. మన మొబైల్ ఫోన్, ట్యాబ్లెట్ల నుంచి ఆడియో ప్లే చేసుకోవడానికి ఇది బాగా సౌకర్యవంతంగా ఉంటుంది.
  • పలు కంపెనీల హోం థియేటర్లు, స్పీకర్ సిస్టంలలో ఎఫ్ఎం రేడియో సౌకర్యం కూడా ఉంటోంది. రేడియో వినే అలవాటు ఉన్నవారికి అది ఉపయుక్తంగా ఉంటుంది.
మంచి బ్రాండెడ్ వాటిని ఎంచుకోవడమే ఉత్తమం
హోం థియేటర్లు, స్పీకర్ సిస్టంల విషయంలో మంచి బ్రాండెడ్ కంపెనీలవి ఎంచుకోవడం ఉత్తమం. వాటి ధరలు ఎక్కువగా ఉన్నా ధ్వనిలో స్పష్టత బాగుంటుంది. ఎక్కువ కాలం బాగా పనిచేస్తాయి. డాల్బీ డీటీఎస్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మంచి హోం థియేటర్, స్పీకర్ సిస్టం బ్రాండ్లు.. F&D, Creative, JBL, Philips, Sony, Bose.. తక్కువ ధరలో లభించే కంపెనీలు.. iball, Intex, Zebronics, Logitech, Frontech, Portronics, Quantum.


More Articles