మర్చిపోతున్నారా... ప్రతిదీ మర్చిపోతున్నారా... ఏదీ గుర్తుండడం లేదా...?

బైక్ కీ నుంచి... కళ్లద్దాల వరకు అన్నీ మర్చిపోతున్నారా..? ఊరంతా తిరిగి ఇంట్లోకి అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం మర్చిపోతున్నారా...? రోజూ వెళ్లే దారే... కానీ కూడలిలో ఒక దారికి బదులు మరో దారిలో వెళుతున్నారా...? అయితే, జాగ్రత్త... ఈ మతిమరుపును వదిలించుకోకుంటే, చివరికి మిమ్మల్ని మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది సుమా...

ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే.. ఎక్కడా...? ఈ విధమైన గందరగోళాన్ని ప్రతీ ఒక్కరూ ఎదుర్కొంటుంటారు. నిజానికి ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సమయంలో ఏదో ఒకటి మర్చిపోతుంటారు. ఇది సాధారణమే. అయితే, ఇది ఎంత తరచుగా అన్నదే ముఖ్యం. వయసు రీత్యా జ్ఞాపకశక్తి కొంత తగ్గడం సాధారణమే. కానీ, దాని వెనుక సమస్య ఏంటన్నది నిర్థారించుకోవాలి. ఎందుకంటే కొన్ని సమస్యలను వైద్య సాయంతో వదిలించుకోవచ్చు.

ఎన్నెన్నో కారణాలు...
మతిమరుపు పరిస్థితికి ఎన్నో కారణాలు ఉంటాయ్. గుర్తించే ప్రయత్నం చేయాలి. సరిదిద్దుకుని మెదడుకు కొత్త శక్తినివ్వాలి. లేదంటే మెదడు మొద్దుబారి పోయే ప్రమాదం ఉంటుంది. డిమెన్షియా, అల్జీమర్స్ సమస్యల్లో మర్చిపోయే పరిస్థితి ఎదురవుతుంది. వైద్యులను సంప్రదించినట్టయితే జ్ఞాపకశక్తి బలహీనపడడానికి గల సమస్యలను గుర్తించి సరిచేస్తారు. కొన్ని రకాల మందులు మతిమరుపునకు, అయోమయానికి కారణమవుతాయి. కిందపడడం లేదా ప్రమాదం కారణంగా మెదడుకు చిన్న గాయం అయినా జ్ఞాపకశక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి.

డిప్రెషన్, ఇతర మానసిక పరమైన సమస్యల్లోనూ ఇది తలెత్తుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ (వ్యాకులత) వంటి సమస్యల వల్ల మర్చిపోవడం, అయోమయం, దేనిపైనైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మద్యపానం ఎక్కువైనా మానసిక పరమైన సమస్యలు ఎదురవుతాయి. జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. విటమిన్ బీ12 లోపం ఉన్నా ఈ పరిస్థితి వస్తుంది. విటమిన్ బీ 12 అనేది నాడీ కణాలను, ఎర్ర రక్త కణాలను ఆరోగ్యంగా కాపాడడంలో కీలకమైనది. ముఖ్యంగా పెద్దవారిలో ఈ విటమిన్ లోపిస్తుంటుంది. అందుకే వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.

హైపో థైరాయిడిజం కూడా ఇందుకు కారణం కావచ్చు. హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తక్కువ కావడం. దీంతో మనం తీసుకున్న పోషకాలను శక్తి కణాలుగా (జీవక్రియ) మార్చే ప్రక్రియ నిదానిస్తుంది. దీనివల్ల మర్చిపోవడం, ఆలోచించలేని సమస్యలు ఎదురవుతాయి. మెదడులో కణతులు సైతం జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం కావచ్చు.

వైద్యులను ఎప్పుడు కలవాలిrepresentative image
తరచూ మర్చిపోవడం జరుగుతుంటే వైద్యులను ఓ సారి సంప్రదించడం మంచిది. కారణాలను గుర్తించి వారు చికిత్స చేస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడుతూ తమను సంప్రదించిన వారిని వైద్యులు ఎన్నో రకాలుగా ప్రశ్నించవచ్చు. అందుకే వైద్యుల వద్దకు వెళ్లేటప్పుడు వెంట కుటుంబ సభ్యుల్లో ఒకరిని తీసుకెళ్లాలి. వారు మీలో పరిశీలించిన అంశాలను వైద్యులకు చెబుతారు.

ఎంతకాలంగా జ్ఞాపకశక్తి సమస్యలను ఎదుర్కొంటున్నారు?, ఏవైనా మందులు వాడుతున్నారా..? వాటి వివరాలు, డోసేజీ, ఇటీవల ఏదైనా కొత్త ఔషధాన్ని వాడడం మొదలు పెట్టారా..?, ఎటువంటి పనుల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారు..? సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నించారా...? ఫలితాలు ఎలా ఉన్నాయ్..? మద్యం అలవాటు ఉందా... ఉంటే ఎంత మొత్తం, వారంలో ఎన్ని సార్లు? ఇటీవల ఏదైనా రోడ్డు ప్రమాదంలో తలకు గాయం అయిందా? ఇటీవల ఏదైనా అనారోగ్యం బారి పడ్డారా? ఇటీవల ఏదైనా తీవ్ర మనోవేదన, ఆందోళన, ఒత్తిడికి లోనయ్యారా? జీవితంలో ఏదైనా ముఖ్యమైనది కోల్పోవడం లేదా మార్పు జరిగిందా? రోజువారీ దినచర్య ఏంటి? ఈ విధమైన ప్రశ్నలను వైద్యులు అడగవచ్చు. ఇవన్నీ జ్ఞాపకశక్తి తగ్గుదలకు కారణమయ్యేవే.

వీటితోపాటు జ్ఞాపకశక్తిని పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అలాగే, కొన్ని రక్త పరీక్షలు, ఎంఆర్ఐ సూచించవచ్చు. వీటి ద్వారా సమస్యను గుర్తించే ప్రయత్నం చేస్తారు. డిమెన్షియా, మెమరీ సమస్యల చికిత్స కోసం న్యూరాలజిస్ట్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, జెరియాట్రీషియన్లను కలవడం ద్వారా తగిన చికిత్స పొందవచ్చు.  

వయసు ప్రభావం 
representative imageవయసురీత్యా జ్ఞాపకశక్తి తగ్గుదల సహజంగా జరిగేదే. గతంలో కలుసుకున్న ఓ వ్యక్తి పేరు గుర్తుండకపోవడం, కీ లేదా కళ్లద్దాలు ఎక్కడ పెట్టామో గుర్తు లేకపోవడం ఇటువంటివే. సాధారణంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ విధమైన పరిస్థితి ఎదురుకావచ్చు. ఈ విధమైన మతిమరుపు వ్యక్తి సామర్థ్యంపైన పడదు. నిజానికి పెద్ద వయసులో వచ్చే ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. చాలా సర్వేల్లో తేలిన విషయం ఏమిటంటే 50 ఏళ్లకు పైబడిన వారిలో సగం మందికి జ్ఞాపకశక్తి సమస్యలున్నాయని.

అయితే, మర్చిపోవడం నిత్య జీవితంలో ఓ భాగంగా మారితే మాత్రం అప్రమత్తం కావాల్సిందే. అల్జీమర్స్ వ్యాధిలో జ్ఞాపకశక్తి క్షీణించడం జరుగుతుంది. 60 ఏళ్ల వయసు వారిలో ఒక శాతం, 85 ఏళ్ల వయసులో 20 శాతం మందిలో, 90 ఏళ్ల వయసులో 30 శాతం మందిలో అల్జీమర్స్ సమస్య కనిపిస్తుంటుంది. పక్షవాతానికి గురైన వారిలోనూ జ్ఞాపకశక్తిని కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే, చికిత్స తీసుకోవడం వలన పరిస్థితి మెరుగుపడుతుంది.

మెమరీ లాస్ డిమెన్షియా
జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి, భాషా శక్తి, ఆలోచనా శక్తి, భాషా నైపుణ్యాలు బలహీన పడడం వంటి లక్షణాలను డిమెన్షియాగా పేర్కొంటారు. ఈ సమస్య కొందరిలో నిదానంగా ప్రారంభమై తర్వాత తీవ్రమవుతుంది. సామాజిక సంబంధాలు, అనుబంధాలపైనా ప్రభావం  చూపుతుంది. తరచుగా మరిచిపోతుండడం అనేది డిమెన్షియా సమస్యకు తొలి సంకేతాలుగా చెబుతారు. అడిగిన వాటినే మళ్లీ మళ్లీ అడగడం, మాటల్లో వాడే పదాలను మర్చిపోవడం, ఒక పదానికి బదులు మరో పదం ఉపయోగించడం, కుటుంబ పనులు పూర్తి చేసేందుకు చాలా సమయం తీసుకోవడం, వస్తువులను ఒక చోట బదులు మరో చోట పెట్టడం (అంటే హాల్లో ఉంచాల్సినది కిచెన్ గదిలో ఉంచడం వంటివి), నడుస్తూ, బైక్ నడుపుతూ దారి తప్పడం, కారణం లేకుండా ఒక్కసారిగా మూడ్ లేదా ప్రవర్తన మారిపోవడం, ఆదేశాలు లేదా సూచనలను పాటించడంలో వెనుకబడి ఉండడం.. ఇవన్నీ కూడా డిమెన్షియా సంకేతాలే. అల్జీమర్స్ వ్యాధి డిమెన్షియా (చిత్త వైకల్యం)కు ఎక్కువగా దారితీసే కారణం.  

మైల్డ్ కాగ్నిటివ్ ఇంపెయిర్ మెంట్
పాక్షిక జ్ఞాపకశక్తి బలహీనత ఇది. దీనివల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలో మార్పులు వస్తాయి. అంతేగానీ, రోజువారీ కార్యసాధనకు ఇది ఆటంకం కాదు. ఈ పరిస్థితి తర్వాత కాలంలో అల్జీమర్స్ కు దారి తీయవచ్చు. లేదా జ్ఞాపకశక్తి బలహీనతకు దారితీసే ఇతర వైకల్యాలకు దారితీయవచ్చు.

నిల్వ చేసుకోవడంలో సమస్యrepresentative image
కొంత మంది నేర్చుకునే దానిపై ఏకాగ్రత పెట్టరు. తెలుసుకున్న ప్రతీ సమాచారం మెమొరీ బ్యాంకులో స్టోర్ కాదు. అంటే దీర్ఘకాలిక జ్ఞాపకాల కిందకు మారదు. స్వల్ప కాలిక మెమొరీ కింద 30 సెకండ్లలో ఏడు విషయాలను మించి గుర్తుంచుకోవడం కష్టమే. కలతలు సమాచార నిల్వకు ఆటంకాలు. కొన్ని విషయాలను అవసరం లేదనే ఉద్దేశ్యంతో గుర్తుంచుకోరు.

ఏక కాలంలో ఒకటికి మించిన వాటిపై దృష్టి పెట్టడం, ఒకటికి మించి పనులు చేయడం కూడా గుర్తుండకపోవడానికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఒకే అంశానికి సంబంధించి పాత, కొత్త విషయాల మధ్య కొన్ని సార్లు క్లాష్ ఏర్పడవచ్చు. కొత్త విషయాల వల్ల పాత విషయాలు గుర్తుకురావడం కష్టం కావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో గతంలో అదే అంశానికి సంబంధించిన విషయాలు బలంగా గుర్తుండిపోతే కొత్త విషయాలు గుర్తురాకపోవచ్చు. ఉదాహరణకు ఒక మోటారు చిత్రాన్ని గీసి దానిలో ఉన్న భాగాల గురించి చెప్పడం ఒక మార్గం. ఏకంగా మోటారునే తీసుకొచ్చి దాన్ని భాగాలుగా విడదీసి, ఒక్కో భాగాన్ని కలుపుతూ చెప్పడం మరో మార్గం. ఈ రెండింటిలో రెండో విధానం వల్లే ఎక్కువగా గుర్తుండిపోతుంది.

తిరిగి పొందడంలో వైఫల్యం
నేర్చుకున్నది మెదడులోకి వెళుతుంది. కానీ, అవసరమైనప్పుడు దాన్ని తిరిగి పొందలేరు. స్టోర్ అయిన సమాచారాన్ని తిరిగి తరచుగా వాడకపోవడం వల్లే ఈ పరిస్థితి. గతంలో నేర్చుకున్న ప్రతీ విషయాన్ని మధ్య మధ్యలో రివైండ్ (ఓ సారి గుర్తు చేసుకోవడం) ద్వారానే అది తాజా సమాచారంగా మారి పది కాలాల పాటు గుర్తుంటుంది. లేకపోతే మన మెదడు దాన్ని లాక్ చేసి ఉంచుతుంది.

representative imageమెమొరీ ఎర్రర్స్ 
మెదడు మెమొరీ బ్యాంకులో దాచిన సమాచారాన్ని బయటకు తీసుకురాలేకపోవడం, సరిగ్గా పలకలేకపోవడం, అసలు జరగని వాటిని గుర్తుంచుకోవడం, జరిగిన దాని కంటే భిన్నంగా గుర్తుంచుకోవడం, గుర్తుంచుకున్న దానిని కూడా పూర్తిగా, సరిగ్గా బయటకు తీసుకురాలేకపోవడం ఇవన్నీ జ్ఞాపకశక్తికి సంబంధించిన లోపాలుగా పేర్కొంటారు. నేడు ఎక్కువ మందిలో కనిపిస్తున్నవి ఇవే. మానసికపరమైన భావోద్వేగాలు, ఉద్రేకాలు, అంచనాలు తల్లకిందులు కావడం, పర్యావరణ మార్పులు, వయసు మీద పడడం, మెదడు దెబ్బతినడం, స్క్రీజోఫీనియా, డిప్రెషన్ ఇలా ఎన్నో కారణాలు దీని వెనుక ఉంటాయి.

బ్లాకింగ్
‘ఈ విషయం నాకు తెలుసు’, ‘ఇతన్ని ఎక్కడో చూశాను పేరు గుర్తుకు రావడం లేదు’... ఇవి మెమొరీ బ్లాకింగ్ కారణంగా ఏర్పడినవే. అంటే తెలిసిన విషయాలను తిరిగి పొందడంలో లోపం. ఆ సమాచారం ఎన్ కోడ్ అయి మెదడులో నిక్షిప్తం కాగా, దాన్ని డీకోడ్ చేసి పొందలేకపోవడం. వ్యక్తుల పేర్లు, స్థలాల పేర్ల విషయంలో జ్ఞాపకశక్తి స్తంభన ఎక్కువగా జరుగుతుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ 60 ఏళ్ల  తర్వాత ఈ విధమైన సమస్య తరచుగా ఎదురవుతుంటుంది.

ఏకాగ్రత లోపం
మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెజెంట్ అన్న సామెత వినే ఉంటారు. విషయం పట్ల దృష్టి పెట్టకపోవడం వల్ల అది బలమైన జ్ఞాపకంగా మారదు. దీంతో తిరిగి దాన్ని పొందలేరు. దీర్ఘకాల జ్ఞాపకాలుగా సమాచారం నిక్షిప్తం కావాలంటే ఏకాగ్రత తప్పనిసరి. అందుకే చేస్తున్న పనిపై ఎంతో శ్రద్ధ పెట్టాలంటారు.  

తప్పుడు జ్ఞాపకాలు
ఓ అంశానికి సంబంధించి యథార్థం కానటువంటి వివరాలను పేర్కొనడం, అసలు జరగని విషయాన్నే జరిగినట్టుగా భావించడం వంటివి ఫాల్స్ మెమొరీ కిందకు వస్తాయి. ఒక్కోసారి ఎవరి దగ్గరైన ఏదైనా వస్తువో, లేదా నగదో తీసుకుని ఇవ్వడం మర్చిపోతుంటారు. తిరిగి ఇవ్వాలని అవతలి వైపు వారు కోరినప్పుడు అదేంటీ ఇచ్చేశానుగా? అని వాదించడం చూసే ఉంటారు. ఇలాంటి వాటినే ఫాల్స్ మెమొరీగా పేర్కొంటారు.

న్యూరోటాక్సిక్ కెమికల్స్
వెనుకటి రోజులతో పోలిస్తే నేడు లభిస్తున్న ధాన్యం, ఇతర ఆహార ఉత్పత్తులన్నీ విషమయంగా మారిపోయాయి. కిరాణా కొట్లో దొరికే చాలా వాటిల్లో రసాయనాలు ఉంటున్నాయి. అందుకే మన తాతల కాలంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో రసాయనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాడీవ్యవస్థపై ఇవి ఎంతో హానికారక ప్రభావాన్ని చూపిస్తాయి. మెదడులో కణాలు పూర్తి రూపం సంతరించుకోకముందే వాటిని చంపేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి, కాగ్నిషన్, ప్రవర్తన పరమైన సమస్యలు ఎదురవుతాయి.  

యాస్పర్టేమ్:
ఇది కృత్రిమ తీపికారకం. జన్యుపరంగా మార్పు చేసిన ఈ కొలి బ్యాక్టీరియా నుంచి దీన్ని రూపొందిస్తారు. మెదడుపై ఇది చాలా విషపూరిత ప్రభావం చూపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి క్షీణత, మైగ్రేయిన్ తలనొప్పి, ఇంద్రియ పరమైన సమస్యలు, వ్యక్తిత్వ పరమైన, ఆటో ఇమ్యూన్ సమస్యలు ఎదురవుతాయి. డైట్ సోడా, గమ్, ప్యాకేజ్డ్ పెరుగు, ప్రాసెస్డ్ స్నాక్స్ లో ఈ విషపదార్థం ఉంటుంది.

ఎంఎస్ జీ: మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్ జీ) అనేది రుచిని ఇచ్చే కృత్రిమ రసాయనం. ప్రాసెస్డ్ స్నాక్స్ లో ఇది కనిపిస్తుంది. ఇలాంటివి తన్న తర్వాత ఎంఎస్ జీ మెదడు కణాలను అతిగా ఉద్రేకపరుస్తుంది. దీంతో దీనికి బానిసగా మారే ప్రమాదం ఉంటుంది. ఇలా దీర్ఘకాలంలో మెదడు కణాలు ఉత్తేజితం అయ్యేందుకు ఈ పదార్థం తప్పనిసరి అవుతుంది. ఫలితంగా మెదడు కణాలు చనిపోయేందుకు దారితీస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి, తార్కిక శక్తి, కాగ్నిషన్ సామర్థ్యాలు దెబ్బతింటాయి.

ఆహార పదార్థాల్లో రంగులు: ఆహార పదార్థాలకు మంచి రంగునిచ్చేందుకు వీలుగా వాడే రెడ్ డై 40, యెల్లో 5 రకాలు మెదడుకు తీవ్ర హాని కలిగిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఎదిగే పిల్లల మెదడుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది. రెడ్ డై 40 కలిపిన ఆహారం తీసుకున్న పిల్లల మెదడుకు సీటీ స్కాన్ పరీక్ష చేసి చూడగా కుడి క్వాడ్రంట్ భాగంలో చుక్కలు కనిపించాయి. భావోద్వేగాలు మొదలయ్యేది మెదడులోని ఈ భాగంలోనే.

పురుగుమందులు:
కీటకాలను నాశనం చేసేందుకు వాడే మందులతో మనకూ ముప్పే. ఆహార పంటల సాగు సందర్భంగా వాటిని సంరక్షించుకునేందుకు విచ్చలవిడిగా కీటక నాశనులను చల్లడం నేడు సర్వసాధారణమైపోయింది. ఆయా ఆహార ఉత్పత్తుల ద్వారా అవే పురుగు మందులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, డిమెన్షియాకు దారి తీస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

సూక్రలోజ్: ఇదొక కృత్రిమ తీపి పదార్థం. పంచదారకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థపై హానికారక ప్రభావం చూపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి క్షీణించడం, తలొనొప్పి, డిప్రెషన్, ఏకాగ్రత లోపించడం, ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఆటో ఇమ్యూన్ వ్యాధులు
ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో మెమొరీ, కాగ్నిటివ్ సమస్యలు ఎదురవడం సాధారణంగా జరుగుతుంది. మల్టిపుల్ స్కెల్ రోసిస్, గ్రేవ్స్ వ్యాధి, లూపస్, ఎస్ జార్గన్ సిండ్రోమ్ ఇవన్నీ కూడా నాడీ సంబంధిత పనితీరు లోపంతో ముడిపడే ఉంటాయి.

క్రానిక్ క్యాండిడా ఇన్ ఫెక్షన్

ఇదో రకం ఈస్ట్ (అతి సూక్ష్మమైన శిలీంధ్రం). పేగులు, జననేంద్రియాల వద్ద పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచి చేసేదే. అయితే, అపరిమితంగా పెరిగిపోతే మాత్రం రక్త ప్రవాహంలోకి ప్రవేశించి ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, యాంటీ బయోటిక్స్ ను అపరిమితంగా తీసుకోవడం, పిల్లలు పుట్టుకుండా ఉండేందుకు పిల్స్ వాడడం, నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ (ఎన్ఎస్ఏఐడీ) నొప్పి నివారిణులు, మెర్క్యురీ, అతిగా మద్యపాన సేవనం, జీర్ణాశయ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఈస్ట్ శరీరంలో అతిగా పెరిగిపోతుంది. క్యాండిడా ఈస్ట్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలుగా... బ్రెయిన్ ఫాగ్, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యాలు లోపించడం, క్రానిక్ ఈస్ట్ ఇన్ ఫెక్షన్లు, తరచూ జలుబు చేయడం, పొత్తి కడుపులో అసౌకర్యంగా ఉండడం, కడుపుబ్బరంగా, అపానవాయువు సమస్య, తీవ్ర అలసట వంటివి.

నిద్రలేమిrepresentative imageదీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో సమాచారాన్ని మెదడులోకి పంపడం, దాన్ని నిల్వ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. ప్రతీ రాత్రి గంటన్నర తక్కువగా నిద్రించడం వల్ల పగటి పూట చురుకుదనం 32 శాతం తగ్గుతుందట. గాఢమైన, అంతరాయం లేని తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట సమస్యతోపాటు టీలు, ఎనర్జీ డ్రింక్స్ ను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతుంది.

ఆల్కహాల్
మద్యపానం సేవించే వారిలో శాశ్వత మతిమరుపు సమస్య ఏర్పడుతుందట. మెదడులోని హిప్పోక్యాంపస్ చర్యలు మద్యపానంతో అచేతనంగా మారతాయి. స్వీయచరిత్ర, స్పష్టమైన జ్ఞాపకశక్తికి దీని పనితీరు కీలకం.

ఎదుగుదల లోపాలు
ఆటిజం, ఏడీహెచ్డీ, యాస్పర్ జెర్స్ సిండ్రోమ్ తదితర వ్యాధుల్లో షార్ట్ టర్మ్ మెమొరీ, ఏకాగ్రత, చదవలేకపోవడం, రాయలేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి.

ఒత్తిడి తగ్గించుకోవాలి
మెమొరీ లాస్ నుంచి బయపడేందుకు ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఒత్తిడి వల్ల విడుదలయ్యే కార్టిసోల్ అనే రసాయనం వల్ల రెండు వారాల వ్యవధిలోనే మెదడు కణాల మధ్య సమాచార వ్యవస్థ బలహీనపడుతుందని వీరు అధ్యయనంలో గుర్తించారు. అందుకే ఒత్తిడిని నివారించడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనతకు చెక్ పెట్టవచ్చంటున్నారు.
 
ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం
పోషాకాహార లోపం వల్ల ఈ సమస్యలు వచ్చి ఉంటే తిరిగి సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పూర్వపు శక్తిని సొంతం చేసుకోవచ్చు. వయసు పైబడడం వల్ల వచ్చే మతిమరుపు సమస్యలను సైతం మంచి పోషాకాహారంతో నివారించుకోవచ్చు.

కెఫైన్, పంచదార
కెఫైన్ అనేది శక్తినిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. పంచదార మెదడులోని కణాలకు కావల్సిన శక్తినిస్తుంది. తీపి పదార్థాలు, కార్బొహైడ్రేట్ల నుంచి శరీరం ఉత్పత్తి చేసే గ్లూకోజ్ మనలో మెమొరీ పెంచేందుకు తోడ్పడుతుంది. కానీ ఇది అవసరమైనంతే. అధికంగా తీసుకుంటే మాత్రం మెమరీ తగ్గుతుంది కూడా.  

ఉదయం అల్పాహారం తప్పనిసరి
ప్రతీ ఒక్కరూ ఉదయం అల్పాహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో కీలకం. రోజూ అల్పాహారం తప్పకుండా తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందట. ఉదయం అల్పాహారం తీసుకోని వారి కంటే తీసుకునే విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ముడి ధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయిని కూడా వెల్లడైంది. వీటిని సైతం అల్పాహారంలో భాగ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అల్పాహారం అల్పంగానే ఉండాలి., ఎక్కువగా తీసుకుంటే ఏకాగ్రత తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ్యాటీ యాసిడ్స్
మన మెదడులో లక్షల సంఖ్యలో కణాలు ఉంటాయి. ఇవి ఫ్యాట్స్ లేదా లిపిడ్స్ తో తయారవుతాయి. అందుకే ఎస్సెన్షియల్లీ ఫ్యాటీ యాసిడ్స్ వీటికి తప్పనిసరిగా అందించాలి. అందుకే ఫ్లాక్స్ సీడ్, విత్తనాలు, కాయల నుంచి తీసిన వంటనూనెను వాడుకోవడం మంచిది. ట్రాన్స్ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్స్ కు మాత్రం దూరంగా ఉండాలి. ఒమేగా ఫ్యాటీ3, ఫ్యాటీ6 యాసిడ్స్ ను ఎస్సెన్షియల్లీ ఫ్యాటీ యాసిడ్స్ అని చెబుతారు. ఫ్లాక్స్ సీడ్, వాల్ నట్స్, సోయాబీన్, కనోలా, వీట్ జెర్మ్, చేపల్లో ఇవి లభిస్తాయి. ఓమేగా ఫ్యాటీ3 యాసిడ్స్ మంచిగా లభించే ఆహారాన్ని తీసుకునే వారిలో డిమెన్షియా, స్ట్రోక్, మెదడు శక్తి బలహీన పడడం వంటి సమస్యలు తగ్గుతాయని చాలా అధ్యయనాల్లో తెలిసిన విషయం. వారంలో రెండు సార్లు చేపలను ఆహారంగా తీసుకుంటే మెదడు, గుండె ఆరోగ్యంగా ఉంటాయి.

నట్స్, చాక్లెట్representative imageవాల్ నట్స్ లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. డార్క్ చాక్లెట్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. చాక్లెట్లలో కెఫైన్ కూడా ఉండడం వల్ల మెమరీ పవర్ మెరుగుపడుతుంది. రోజులో 28 గ్రాములకు సమానమైన వాల్ నట్స్, చాక్లెట్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట.

అవకాడో, హోల్ గ్రెయిన్స్ (తృణ ధాన్యాలు)
మన శరీరంలో ప్రతీ అవయవానికి తగినంత రక్త సరఫరా అవసరం. దీన్ని బట్టి అవయవాల పనితీరు కూడా ఉంటుంది. ముఖ్యంగా గుండె, మెదడుపై దీని ప్రభావం పూర్తిగా ఉంటుంది. అవకాడో వంటి పండ్లు, తృణ ధాన్యాలను తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతో మెదడుకు తగినంత రక్త సరఫరా, ఆక్సిజన్ అందుతుంది. దీని వల్ల మెదడు కణాలు చురుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తృణ ధాన్యాల్లో పాప్ కార్న్, హోల్ వీట్ ఇంకా మంచివి.

బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ మెదడు ఆరోగ్యానికి మంచి పండ్లు. ఫ్రీ రాడికల్స్ కారణంగా మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడే శక్తి వీటికి ఉంది. అలాగే, వయసు మళ్లిన తర్వాత వచ్చే అల్జీమర్స్, డిమెన్షియా సమస్యల ప్రభావాన్ని బ్లూబెర్రీ పండ్లు తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. అలాగే, బ్లాక్ బెర్రీస్, యాపిల్స్, పసుపు, కొబ్బరినూనె, బటర్ సైతం మెదుడుకు ఆరోగ్యానిచ్చే ఆహారాలు.  

పోషకాహారం... విటమిన్లు, మినరల్స్
తీసుకునే ఆహారం పోషకాలతో ఉండడం ఎంతో అవసరం. కనీస పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఆహారం చాలా తక్కువగా, ఎక్కువగా తీసుకున్నా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కొందరిలో పోషాకాహారం తీసుకున్నప్పటికీ పోషకాల లోపం ఉండవచ్చు. ఇందుకు జీర్ణాశయ సమస్యలు కారణం అవుతాయి.

విటమిన్ల లోపంrepresentative imageజ్ఞాపకశక్తి క్షీణించడానికి అన్నింటికంటే కీలకమైన పోషక లేమి విటమిన్ బి12. వయసు పెరుగుతున్న కొద్దీ బి12 గ్రహించే శక్తి తగ్గుతుంది. అందుకే వృద్ధులు ఈ విటమిన్ సప్లిమెంట్ తప్పకుండా తీసుకోవాలి. జంతు సంబంధిత ఉత్పత్తుల్లో ఈ విటమిన్ తగినంత లభిస్తుంది. కనుక శాఖాహారుల్లోనే ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే, మెమరీ బలహీనపడడానికి మెగ్నీషియం లోపం కూడా కీలకమైనది. దీని వల్ల కాగ్నిటివ్ పనితీరు బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.

విటమిన్ ఏ, బీ, సీ, ఈ, జింక్, మెగ్నీషియం లభించే ఆహారం రోజువారీ తీసుకోవాలి. లేదంటే వైద్యుల సలహాతో విటమిన్, మినరల్స్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు. సాధారణ జీవక్రియల వల్ల ఏర్పడే, పర్యావరణం నుంచి మన శరీరంలోకి వచ్చే హానికారక పదార్థాలు, ఫ్రీ ర్యాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసేందుకు యాంటీ ఆక్సిడెంట్లు చాలా అవసరం.

ఇవి కూడా...
శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి, రాత్రి నిద్ర సరిపడంత ఉండాలి. కనీసం 8 గంటలు అవసరం. రోజువారీ శారీరక వ్యాయామం తప్పనిసరి. మెడిటేషన్, యోగాతోనూ మంచి ఫలితాలు ఉంటాయి.

కొలెస్ట్రాల్, రక్తపోటు
కొలెస్ట్రాల్, రక్త పోటు పెరగడం ద్వారానూ మెమొరీపై ప్రభావం పడుతుంది. అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందడానికి కూడా ఇవి కారణమవుతాయట. మంచి సామజిక సంబంధాలు సైతం చక్కని మెమొరీకి ఉపకరిస్తాయ్.

మెదడును చురుగ్గా ఉంచాలిrepresentative imageచదవడం, రాయిడం, పజిల్స్ ఆడడం, కొత్త తరహా పనులు చేయడం ద్వారానూ మెమొరీ శక్తిని కాపాడుకోవచ్చు. ఈ చర్యలు మెదడు కణాలను చురుగ్గా చేస్తాయట.  

ఏం చేస్తే ఉపయోగం
- ఒకసారి ఒకే పనిపై దృష్టి పెట్టడం వల్ల గుర్తుంచుకునేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి.
- ఒక వస్తువు ఎక్కడ పెడుతున్నదీ గుర్తుంచుకోవడం కష్టమైతే ఆ ప్రాంతాన్ని, అక్కడున్న ఇతర వస్తువులను కూడా గుర్తుచేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. పైగా ఎప్పుడూ ఒక్కచోటే పెట్టడం వల్ల కూడా అయోమయం ఉండదు.
- ఎవరైనా ఏదైనా చెప్పినప్పడు తిరిగి దాన్ని ఒకసారి బయటకు పలకడం వల్ల గుర్తుండిపోతుంది. పైగా ఎదుటి వారికి మన అటెన్షన్ కూడా తెలిసిపోతుంది.
- వస్తువులను, విషయాలను చిత్రాలుగా గుర్తుంచుకోవడం మరో విధానం. దీనివల్ల విషయాలను తిరిగి గుర్తు చేసుకోవడం తేలిక అవుతుంది.  

చివరిగా...
జ్ఞాపకశక్తికి సంబంధించి పైన చెప్పుకున్న అనేక సమస్యల్లో దేనితోనైనా బాధపడుతుంటే కారణాలను గుర్తించండి. ఆహార పరంగా విషతుల్య పదార్థాలు తీసుకోకుండా, పోషకాహారం తీసుకుంటూ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి, మానసిక ఉద్రేకాలు, భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. సామాజిక సంబంధాలు పెంచుకుని ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. నిరంతర వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. దీనికి తోడు పోషకాల లేమి ఉంటే వైద్యులను సంప్రదించి తగిన సప్లిమెంట్లను తీసుకోవవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కాకుండా వయసు మళ్లీన రీత్యా, ప్రమాదాల్లో మెదడుకు గాయాలు కావడం, నాడీ వ్యవస్థలో ఏర్పడిన సమస్యల వల్ల జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చినట్టయితే అందుకు పత్యేకంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కనుక వైద్యులను సంప్రదించడం అవసరం.


More Articles