ఇలా చేస్తే దోమలు పరార్!

డెంగీ, చికున్ గున్యా, మలేరియా.. ఇలా దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్ లు చాలానే ఉన్నాయి. దోమ కాటు మనిషి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం అవదు. కనుక ఎటొచ్చీ ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే వీలైన మార్గం. ఇందుకు ఏం చేయాలో చూద్దాం...representation image

ఐస్ తో నైస్

దోమలు మనం విడిచిపెట్టే కార్బన్ డై ఆక్సైడ్ కు ఆకర్షితమవుతాయట. అందుకని వాటిని మరో రూపంలో వలవేసి పట్టాలంటున్నారు నిపుణులు. ఐస్ గడ్డలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ ను విడుదల చేస్తాయట. అందుకుని ఐస్ గడ్డలను ఓ కంటెయినర్ లో ఉంచి ఇంట్లో అక్కడక్కడ ఉంచాలి. దోమలు వీటి దగ్గరకు చేరతాయి. అప్పుడు దోమల ఎలక్ట్రిక్ బ్యాట్ తీసుకుంటే వాటి సంహారం పూర్తి చేయవచ్చు.

వేపనూనె

దోమల నివారణకు వేప నూనె చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్ నైట్లు, ఆల్ అవుట్లు, మార్టిన్లు ఇలా రకరకాల పేర్లతో మార్కెట్లో లభించే దోమల నివారణ మందులు దీర్ఘకాలంలో వాడడం వల్ల శ్వాసకోస వ్యాధులు, మానసిక వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే సహజ సిద్ధమైన మార్గాల్లో దోమలపై యుద్ధం చేయడమే మంచిది.

వేప నూనె, కొబ్బరి నూనె ఈ రెండింటినీ సమాన పాళ్లలో అంటే 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. కనీసం ఎనిమిది గంటల పాటు ఇది పనిచేస్తుంది. దోమలు కుట్టే సాహసం కూడా చేయవు. మీ సమీపానికి వచ్చినా వేప వాసన చూసి పారిపోతాయి. ఈ ఫార్ములాను జర్నల్ ఆఫ్ అమెరికన్ మస్క్విటో కంట్రోల్ అసోసియేషన్ తన సంచికలో ప్రచురించడం విశేషం. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ప్రోటోజోల్ గుణాలు వేపనూనెలో ఉన్నాయి. చర్మ సౌందర్య రక్షణకు కొబ్బరినూనె పనిచేస్తుంది. కాటన్ ను చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని వేపనూనెలో ముంచి ఇంటిలోపల ప్రతీ గదిలోనూ ఉంచాలి. దీనివల్ల కూడా దోమలు  కంట్రోల్ అవుతాయి.

representation image

కాఫీ గ్రౌండ్స్

ఇంటి సమీపంలో నీరు నిలిచిన చోట దోమలు గుడ్లు పెట్టి ఉంటాయి. కాఫీ డికాషన్ చల్లడం ద్వారా ఆ నీటిలోని దోమల గుడ్లు నీటిపైకి చేరతాయి. అవి ఆక్సిజన్ కు లోను కావడం వల్ల దోమలుగా మారకుండానే నిర్వీర్యమైపోతాయి. అంతే కాదు ఆ నీటిలో దోమలు గుడ్లు కూడా పెట్టవు.

యూకలిప్టస్, లెమన్ ఆయిల్

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దోమల నివారణకు గాను యూకలిప్టస్, లెమన్ ఆయిల్ ను సూచించింది. లెమన్ ఆయిల్ ను, యూకలిప్టస్ ఆయిల్ ను  సమాన పాళ్లలో కలిపి చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎటువంటి హానీ ఉండదు. వీటిలో ఉండే సినోల్ అనే రసాయనం యాంటీ సెప్టిక్, కీటక నివారిణిగా పనిచేస్తుంది. 

కర్పూరం

కర్పూరం ప్రతీ కిరాణా షాపులో లభించేదే. ఇది దోమల సంహారానికి చక్కగా పనిచేస్తుంది. సూర్యాస్తమయం అయి చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులన్నింటినీ మూసివేసి పెద్ద కర్పూరం వెలిగించండి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్లి తలుపు మూసేయండి. ఓ 20 నిమిషాల తర్వాత తలుపు తెరిచి చూడండి. ఒక్క దోమ కూడా కనిపించదు. అన్నీ చచ్చి పోయి ఉంటాయి. ఎక్కువ సమయం పాటు కీటక నివారిణిగా పనిచేస్తుంది ఇది. పెద్ద ఖరీదేమీ కాదు. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో నీరు పోసి ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్లలను బ్రేక్ చేసి అందులో వేసి గదిలో పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ నీరు రెండు రోజులకొకసారి మార్చుకోవాలి. 

representation image

తులసి (హోలీ బేసిల్)

పారాసైటాలజీ అనే పత్రిక దోమల నివారణలో తులసి ప్రాధాన్యం గురించి రాసింది. దోమల లార్వాను చంపేందుకు తులసి చక్కగా పనిచేస్తుందట. మన ఆయుర్వేదం కూడా ఇదే చెప్పింది. ప్రతీ ఇంట్లోనూ తులసి మొక్కలను ఉంచుకోవడం వల్ల చాలా వరకు దోమల సమస్య ఉండదట.

టీ ట్రీ ఆయిల్

మార్కెట్లో లభించే టీ ట్రీ ఆయిల్ కూడా దోమల నివారణకు ఓ చక్కని పరిష్కారం. దీన్ని వాడడం వల్ల దోమల నివారణే కాదు, చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు దోమలు కుట్టకుండా ఉపయోగపడతాయి. ఈ ఆయిల్ నుంచి వచ్చే సువాసన దోమలకు ఇబ్బందికరం. అందుకే అవి అక్కడ ఉండకుండా పరార్ అవుతాయి. టీ ట్రీ ఆయిల్ ను చర్మంపై రాసుకున్నా సరే. లేకుంటే నీటిలో కలిపి ఇంట్లో స్ప్రే చేసినా మంచి ఫలితం ఉంటుంది.

representation image

వెల్లుల్లి

దోమల నివారణకు ఉన్న సహజసిద్ధ మార్గాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి వెదజల్లే ఘాటు వాసన దోమలకు పడదు. అందుకే అవి దూరంగా వెళ్లిపోతాయి. వెల్లుల్లి రెబ్బలను మధ్యకు కట్ చేసి ఇంటి ద్వారాలు, విండోల వద్ద  ప్లేట్ లో ఉంచితే మంచి ఫలితం ఉంటుందట. అలాగే, కొన్ని వెల్లుల్లి రెబ్బలను చిదిమి నీళ్లలో వేసి కాచి ఆ నీటిని ఇంట్లో స్ప్రే చేసినా దోమలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఆ నీటిని చర్మంపై చల్లుకున్నా దోమలు కుట్టే సాహసం చేయవట.

లావెండర్

లావెండర్ మంచి పరిమళాన్ని వెదజల్లే మొక్క. ఇదే పరిమళం దోమలకు ఇబ్బందికరం. ఈ మొక్క నుంచి వెలువడే పరిమళం వల్ల దోమలు మనల్ని కుట్టవట. అందుకే లావెండర్ ఆయిల్ ను రూమ్ ఫ్రెషనర్ గా ఉపయోగించుకోవడం ద్వారా చక్కని సువాసనతోపాటు దోమలను కూడా నియంత్రించుకోవచ్చు. దీన్ని చర్మంపైనా రాసుకోవడం ద్వారా దోమల నుంచి రక్షణ పొందవచ్చు.

సిట్రోనెల్లా

సిట్రోనెల్లా అనే గడ్డిజాతి మొక్కల నుంచి నూనెను వెలికితీస్తారు. ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. దోమల నివారణకు ఇది కూడా మంచిగా పనిచేస్తుందట. దీన్ని చర్మంపై రాసుకుంటే దోమలు కుట్టవు. గదిలో ఆయిల్ బర్నర్ ను వాడడం ద్వారా దోమల్ని అక్కడి నుంచి పారదోలవచ్చు.

representation image

పుదీనా

పుదీనా, పుదీనా ఆయిల్ దోమల నివారణకు సమర్థంగా పనిచేస్తాయని జర్నల్ ఆఫ్ బయోరీసోర్స్ టెక్నాలజీ పేర్కొంది. పుదీనా ఆకులను నీళ్లలో కాచి ఇంట్లో స్ప్రే చేయడం, లేదా వేపరైజర్ గాను ఉపయోగించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. పుదీనా ఆయిల్ ను చర్మంపై రాసుకోవచ్చు. పుదీనా మొక్కలను కిటికీల వద్ద ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించుకోవచ్చట.

మొక్కలు సైతం

పిచ్చి మొక్కలు ఎక్కువ ఉంటే దోమల సంతాన ఉత్పత్తికి కేంద్రాలుగా ఉపయోగపడతాయంటారు. వీటికి బదులు ఇళ్లల్లో తులసి, పుదీనా, సిట్రోనెల్లా గ్రాస్, లెమన్ గ్రాస్ వంటి మొక్కలను కుండీల్లో పెంచుకోవడం వల్ల దోమలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి.

రెడ్ సెడార్

రెడ్ సెడార్ మొక్కలను పెంచుకోవడం వల్ల కూడా దోమలను నియంత్రివచ్చట. రెడ్ సెడార్ చిప్స్ అని కూడా ఉంటాయి. వీటిని నీళ్లలో బాయిల్ చేసి ఆ నీటిని ఇల్లు, ఇంటి ఆవరణలో స్ప్రే చేయడం వల్ల దోమలు అక్కడ లేకుండా పోతాయి. 

వట్టివేరు

వట్టివేరు నుంచి తీసిన నూనెలోనూ దోమల నివారణ గుణాలు ఉంటాయట. కనుక కొన్ని చుక్కల వట్టివేరు నూనెను నీటికి కలిపి స్ప్రే చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుందట.

సహజ రీపెల్లెంట్

ఆల్ అవుట్, గుడ్ నైట్ వంటివి వాడుతున్నారా? అయితే వెంటనే స్టాప్ చెప్పేయండి. రీఫిల్ లో ఉన్న కెమికల్ ను ఇంటి సమీపంలోని నీటి గుంతల్లో పారబోయండి. ఖాళీ రీఫిల్ ను మాత్రం పారేయకుండా ఇంటికి తీసుకురండి. మూడు నాలుగు కర్పూరం బిళ్లలు తీసుకుని పొడి చేయండి. ఒక కప్పు వేపనూనెలో ఈ పొడి కలిపి ఆ నూనెను ఖాళీ రీఫిల్ లో పోసి దాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఆరోగ్యానికి హానీ ఉండదు. దోమలు పారిపోతాయి.

సిట్రోనెల్లా, కర్పూరం, సెడార్ ఆయిల్ ను కలిపి కొన్ని చుక్కలు టవల్ పై వేసి ఆ టవల్ ను బెడ్ దగ్గర ఉంచుకుంటే దాన్నుంచి వెలువడే పరిమళంతో దోమలు అక్కడి నుంచి పారిపోతాయి.

representation image

ఇది చాలా నయం

చాలా మంది దోమల వలలు (నెట్) వాడడాన్ని మర్చిపోయారు. కానీ, ఏ విధమైన ఖర్చు లేని, శ్రమలేని, సమర్థవంతమైన దోమల నివారణ పరికరం ఇది. బెడ్ కు అమర్చుకోవడం వల్ల ఒక్క దోమ కూడా ఆ నెట్ ను దాటుకుని లోపలికి రాలేదు. దాంతో వాటి నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. చిన్నారులు ఉన్న ఇళ్లల్లో వీటి వాడకం పూర్తి రక్షణ, సురక్షితం.

కొన్ని సూచనలు

- ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత ఇంటి తలుపులు తెరవరాదు. ఆ సమయంలో దోమలు ఎక్కువగా చురుగ్గా ఉంటాయి. అప్పుడే ఎక్కువ శాతం దోమలు ఇంట్లోకి చొరబడతాయి.

- ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇంటిలోపట, ఇంటిపైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు మూతలు బిగించి ఉండాలి.

- ఆరోమా ఆయిల్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటిలో సిట్రొనెల్లా, లెమన్ గ్రాస్ ఆయిల్ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వీటిని ఆయిల్ బర్నర్ లో వేయడం ద్వారానూ ఇంటి నుంచి దోమలు పరారవుతాయి.

- దోమలు నీటికి కూడా ఆకర్షితమవుతాయి. అందుకే వెడల్పాటి పాత్రల్లో సబ్బు నీరు ఉంచి ఇంటి ద్వారాల వద్ద ఉంచాలి. అవి ఆ నీటిపై వాలడం వల్ల అందులోనే చిక్కుకుని చచ్చిపోతాయి. 

- దోమలు లైటింగ్ కు ఆకర్షితమవుతాయి. అందుకే ఎల్లో షేడ్ ఉండే ఎల్ఈడీ లైట్లను ఇంట్లో వాడడం వల్ల దోమలు అంతగా ఆకర్షితం కావని నిపుణులు చెబుతున్నారు. దోమల నివారణకు ఉపకరించే సోడియం ల్యాంప్స్ కూడా వాడుకోతగినవి.

- మార్కెట్లో మస్క్విటో ట్రాపింగ్ మెషిన్లు లభిస్తాయి. ఆ మెషిన్ తన దగ్గరకు వచ్చిన దోమలను ఇట్టే చంపేస్తుంది. 


More Articles