ఇంటివద్దే ఆరోగ్య సేవలు...‘కేర్ ఎట్ మై హోం’ లక్ష్యం!

ఇంటి పెద్దాయనకు పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ఇంటికి తీసుకొచ్చారు. మందులెలా వాడాలో డాక్టర్లు చెప్పారు. అనారోగ్యం నుంచి కోలుకునే క్రమంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సవివరంగానే సూచించారు. అయితే నేటి రోజుల్లో ఇంటిలో ఆ పెద్దాయనను కనిపెట్టుకుని కూర్చోవడం ఇంటి యజమానికి అంత సులువైన విషయమేమీ కాదు. ఇంట్లో కూర్చుంటే ఉద్యోగం కాస్తా ఊడటం ఖాయం. చేస్తున్నది వ్యాపారమైతే రోజుకో సమస్య వచ్చిపడటం ఖాయం.

అంతేకాదు, మందుల వాడకం గురించి డాక్టర్లు ఒకసారి చెబుతారు. మన బుర్రలో అది ముద్రపడకపోవచ్చు. మళ్లీ డాక్టర్ల వద్దకు పరుగులు తీయాలి. ఈలోగా మందుల వాడకంలో చిన్నపాటి తేడా. మళ్లీ పెద్దాయనను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. ఈ చిక్కులన్నింటికీ చెక్ పెడుతోంది 'కేర్ ఎట్ మై హోం’! ఎందుకంటే, సీఏఎంహెచ్ సిబ్బంది మన ఇంటివద్దకే వచ్చి మన పెద్దాయనను కంటికి రెప్పలా చూసుకుంటారు. త్వరగా కోలుకునేలానూ చూస్తారు. 

ఇది కొత్తదేం కాదు కదా అంటారా..?

కొత్తదైతే కాకపోవచ్చు. నిన్నటిదాకా బిలియనీర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు సీఏఎంహెచ్ తో మధ్యతరగతి ప్రజలకూ అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, కేవలం ఈ తరహా సేవలందించేందుకు ఏర్పడ్డదే సీఏఎంహెచ్. అంటే, ఇకపై ఈ సేవలందించనున్న వారు మనం చికిత్స తీసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఎంతమాత్రం కాదు. మనం ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగానే మన ముందు వాలే నయా సేవకులు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన సీఏఎంహెచ్ సేవలు రానున్న రోజుల్లో దేశవ్యాప్తం కానున్నాయి. చిన్న నగరాలకూ విస్తరించనున్నాయి. అత్యంత పకడ్బందీగా జరుగుతున్న శిక్షణలో సుశిక్షితులైన సిబ్బంది మన ఇంటి ముంగిట వాలేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కాస్త ఎక్కువగానే ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఈ సేవలు చౌక ధరలకే లభ్యం కానున్నాయి. సో, మేజర్ వైద్య చికిత్సల తర్వాత ఇకపై రోజుల తరబడి ఆస్పత్రుల్లో చిక్కుబడిపోవాల్సిన అవసరం లేదన్నమాట.

ఎవరీ కొత్త సేవకులు?

ముంబైకి చెందిన ఫిజియోథెరఫిస్ట్ యువరాజ్ సింగ్, ప్రతి విషయాన్ని సునిశిత దృష్టితో చూసే లక్షణమున్న ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ ప్రవీణ్ షిర్కేలు ఈ కొత్త సేవలకు నాందీ పలికారు. సీఏఎంహెచ్ పేరిట కొత్త కంపెనీని తెరిచిన ఈ యువకులు, తమ జట్టులో ఫిజియోథెరఫిస్ట్ లతో పాటు స్పీచ్ థెరపిస్ట్ లు, కేర్ మేనేజర్లను కలుపుకున్నారు. ఇక ఈ సేవల్లో కీలక భూమిక పోషించే ఆరోగ్య కార్యకర్త (నర్సు)లను తొలుత కొంతమందిని తీసుకున్నా, ఆ తర్వాత సొంతంగా శిక్షణ ఇచ్చి సుశిక్షితులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు సింగ్, షిర్కేలు నాందీ పలికారు. ఈ తరహా శిక్షణలకు తెరతీసిన తొలితరం కార్యసాధకులు సింగ్, షిర్కేలే. ఆస్పత్రుల్లో సేవలందించడం ఒక ఎత్తైతే, రోగులను వారి ఇళ్లలోనే కంటికి రెప్పలా చూసుకోవడం సాహసంతో కూడుకున్నదే కాక కొద్దిమేర సంక్లిష్టమైనదేనని చెప్పాలి. అందుకే వీరు తమ సిబ్బందికి తామే శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అసలు ఈ రంగంలో అవకాశాలున్నాయా..?

ప్రస్తుతం ఈ రంగంలో ఏటా 2 నుంచి 4 బిలియన్ డాలర్ల మేర వ్యాపారం జరుగుతోంది. ఏటా 25 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2025 నాటికి దేశ జనాభాలో 20 శాతం వయోవృద్ధులే. వీరిలో 70 శాతం మంది 65 ఏళ్లకు పైబడ్డవారుగానే ఉండనున్నారు. వీరికి వారి మలి జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో దీర్ఘకాలిక సేవలందుకునే అవసరం ఏర్పడుతుందన్నది సింగ్, షిర్కేల భావన. ఈ రంగానికి మున్ముందు బంగారు భవిష్యత్తు ఉందన్న విషయాన్ని గుర్తించిన తర్వాతే ఈ ఇద్దరు యువకులు ఈ దిశగా అడుగేశారని ఇట్టే అర్థం అవుతుంది. సరిగ్గా ఏడాది కిందట కార్యరంగంలోకి దిగిన సీఏఎంహెచ్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో రోగులకు వారి ఇళ్ల వద్దే చికిత్సలో భాగమైన మలి సేవలందించడమే కాక సదరు రోగులు తిరిగి ఆస్పత్రి బాట పట్టకుండా చేశారు. దీంతో వీరి సేవలందుకున్న రోగులు కూడా సీఏఎంహెచ్ సేవల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కాలం గడుస్తున్న కొద్దీ సీఏఎంహెచ్ సేవలు అందుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

అడుగేసే ముందు సుదీర్ఘ అధ్యయనం

ఈ దిశగా అడుగేసే ముందు సింగ్ తో పాటు షిర్కే కూడా సుదీర్ఘకాలం పాటు ఆరోగ్య సేవలపై పూర్తి స్థాయి అధ్యయనం చేశారు. అంటే, తరగతి గదిలో లేరన్నమాటే గాని, వీరు పూర్తి స్థాయి పాఠాన్ని కేవలం ఆరు నెలల్లో వారి బుర్రలకెక్కించారు. ఈ అధ్యయనంలో భాగంగా ఆస్పత్రుల్లో ఏ తరహా చికిత్సలు పొందిన వారికి, వారి ఇళ్ల వద్ద మలి చికిత్సా సేవలు అవసరమన్న విషయంపై కూలంకషంగా ఆరా తీశారు. అంతేకాక ఆస్పత్రుల్లో ప్రధాన చికిత్స తీసుకున్న రోగులు, ఏఏ కారణాలతో తిరిగి ఆస్పత్రుల భాట పడుతున్నారు, ఇళ్ల వద్ద వారు ఏ తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్న అంశాలపై అటు రోగులతో పాటు ఇటు వైద్య వర్గాలతోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ అధ్యయనంలో ఫిజియోథెరఫిస్ట్ గా సింగ్ కు పెద్ద ఇబ్బందేమీ కలుగలేదు కాని, ఇంజనీరింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన షిర్కే మాత్రం కొంతమేర కష్టపడాల్సి వచ్చింది.

స్నేహితుడి తండ్రి మరణం...సింగ్ ను ఈ దిశగా నెట్టేసింది

అసలు ఈ తరహా యోచన సింగ్ కు ఎలా వచ్చింది అంటే, స్నేహితుడి తండ్రి మరణం సింగ్ ను ఈ దిశగా పయనించేలా చేసింది. నాసో గ్యాస్ట్రిక్ ఫీడింగ్ ఆధారంగా మంచానికే పరిమితమైన స్నేహితుడి తండ్రికి ఆహారం అందించేటప్పుడు మంచంపై 45 డిగ్రీల కోణంలో పడుకోబెట్టాలన్న విషయాన్ని ఆస్పత్రి వైద్యులు అసలు చెప్పనేలేదట. దీంతో పడుకోబెట్టిన స్థితిలోనే స్నేహితుడి తండ్రికి ఆహారం ఇస్తుండగా, ఆహారాన్ని మింగే క్రమంలో ఆయన భారీ కుదుపుకు గురయ్యారు. వెనువెంటనే కన్నుమూశారు.

పరిస్థితిని సాంతం అర్థం చేసుకున్న సింగ్, అసలు డిశ్చార్జీ చేసేటప్పుడు ఇంటి వద్ద రోగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పకుండా ఎలా పంపించారని వైద్యులపై ఆక్రోశం వెళ్లగక్కాడు. ఆ ఆక్రోశంలో నుంచే సీఏఎంహెచ్ యోచన ఆవిర్భవించింది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సందర్భంగా మెరుగైన ఆరోగ్యంతో ఉండే రోగులు ఇళ్లకు చేరగానే ఒక్కసారిగా తిరిగి అనారోగ్యం బారిన పడటం షిర్కేను సింగ్ ఆలోచనలతో కలిపింది. అంతే, సీఏఎంహెచ్ మొగ్గతొడిగింది.

తొలి అడుగేసేందుకు అడ్డంకులెన్నో!

అనుకున్నదే తడవు, అన్నీ సమకూరవు కదా. సింగ్ విషయంలోనూ అదే జరిగింది. అప్పటికే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఉద్యోగాన్ని వదిలి రావడమంటే దుస్సాహసం చేసినట్లే, అంతేకాక త్వరలో తన భార్య తొలి బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు కంపెనీని నెలకొల్పాలంటే మిగతా ఖర్చుల విషయాన్ని పక్కనబెట్టినా, ఉద్యోగుల జీతభత్యాల మాటేంటి... ఇవే ఆలోచనలు సింగ్ మదిలో మెదిలాయి. పోనీ ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్ వ్యాపకంగా పని మొదలుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు షిర్కే బ్రేకులేశాడు. కొత్త రంగంలో ప్రవేశిస్తున్న తరుణంలో పార్ట్ టైమ్ గా పనిచేయడం మొదటికే మోసం తెచ్చే పనేనని సింగ్ కు తేల్చిచెప్పేశాడు. ఈ నేపథ్యంలో మంచి వేతనాన్ని ఇస్తున్న ఉద్యోగాన్ని వదులుకోవాలంటే మనసొప్పలేదు. అయినా మొండి ధైర్యంతో ముందడుగు వేసేందుకే సింగ్ తీర్మానించుకున్నాడు. షిర్కే కూడా తోడవడంతో ఇబ్బంది లేకుండానే సీఏఎంహెచ్ సేవలు ప్రారంభమయ్యాయి.

సేవల్లో రాజీలేని ధోరణి

సీఏఎంహెచ్ ప్రారంభించిన సింగ్, షిర్కేలు... రోగులకు అందించాల్సిన సేవల విషయంలో ఏమాత్రం రాజీ ధోరణి అవలంబించలేదు. ఈ కారణంగానే వీరి సేవలందుకున్న వినియోగదారులందరూ అతి స్వల్ప కాలంలోనే రోగం బారి నుంచి పూర్తిగా కోలుకోగలిగారు. రాజీలేని ధోరణిలో భాగంగా తమ సేవల్లో కీలక భూమిక పోషించే నర్సులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇప్పటికే నాలుగు బ్యాచ్ లకు శిక్షణ పూర్తి చేసిన సీఏఎంహెచ్, ఐదో బ్యాచ్ నర్సులకు శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. నాలుగు బ్యాచ్ లలో శిక్షణ పొందిన నర్సులు అందించిన సేవలు అద్భుత ఫలితాలివ్వడంతో ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదని సింగ్, షిర్కేలు ఓ అంచనాకు వచ్చారు. దీంతో మరింత దూకుడుగా తమ కార్యకలాపాలను ఇతర నగరాలకు విస్తరించే పనిలో పడ్డారు. సమీప భవిష్యత్తులో దేశంలోని చిన్న నగరాలకు కూడా తమ సేవలను అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెబుతున్న సింగ్, షిర్కేల యత్నం రోగుల పాలిట దివ్య ఔషధంలా పనిచేయాలని మనమూ కోరుకుందాం.


More Articles