మొదటి నుంచి కూడా ఓటీటీ సెంటర్లలో థ్రిల్లర్ జోనర్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఈ వరుసలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో రూపొందిన ఆ సిరీస్ పేరే 'ప్రీతమ్ అండ్ పెడ్రో'. వీర్ హిరానీ .. అర్షద్ వార్సీ .. విక్రాంత్ మస్సే ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ సిరీస్ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రీతమ్ (వీర్ హిరానీ) 'గోవా'లో తన తాతయ్యతో కలిసి నివసిస్తుంటాడు. వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్ మేన్ గా పనిచేస్తుంటాడు. తన తాతయ్య ఎంతో ప్రేమగా చూసుకునే పాత టేప్ రికార్డర్ .. అందులో తన నాయనమ్మ పాడిన పాట కేసెట్ ను ఎవరో కాజేస్తారు. ఆ విషయమై పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వెళతాడు ప్రీతమ్. ఆ సమయంలో ఒక ATM దొంగతనం కేసులో పోలీస్ ఆఫీసర్ పెడ్రో (అర్షద్ వార్సీ) బిజీగా ఉంటాడు. టెక్ జీనియస్ అయిన ప్రీతమ్, ఆ కేసు విషయంలో అతనికి సహకారించి దొంగలను పట్టిస్తాడు.
అప్పటి నుంచి ప్రీతమ్ పట్ల పెడ్రో స్నేహ భావంతో ఉంటాడు. అదే సమయంలో ఒక కేసు విషయంలో స్పోర్ట్స్ మినిష్టర్ కి కోపాన్ని తెప్పించినందుకు ఫలితంగా, 'పెడ్రో'ను క్రైమ్ డిపార్టుమెంట్ నుంచి సైబర్ సెల్ కి బదిలీ చేస్తారు. ఏ మాత్రం అనుభవం లేని పెడ్రో, ఈ విషయంలో తనకి సహకరించమని ప్రీతమ్ ను కోరతాడు. అలా చేస్తే అతని తాతయ్య టేప్ రికార్డర్ ను తాను కనిపెడతానని మాట ఇస్తాడు. అందుకు ప్రీతమ్ అంగీకరిస్తాడు.
స్పోర్ట్స్ మినిష్టర్ పదేళ్ల కొడుకు వినీత్ కిడ్నాప్ కి గురవుతాడు. తనకి 5 కోట్ల రూపాయలు ఇస్తే, వినీత్ ను వదిలేస్తానని కిడ్నాపర్ హెచ్చరిస్తాడు. ఈ కేసును ఛేదించి మినిష్టర్ దగ్గర మార్కులు కొట్టేసి, మళ్లీ క్రైమ్ డిపార్మెంట్ కి వెళ్లిపోవాలనే ఆలోచనలో పెడ్రో ఉంటాడు. అతనికి సహకరించడానికి ప్రీతమ్ కూడా రంగంలోకి దిగుతాడు. కిడ్నాపర్ వెనుక ఒక జీనియస్ హ్యాకర్ ఉన్నాడనే విషయం ప్రీతమ్ కి అర్థమవుతుంది. అదే సమయంలో ప్రీతమ్ వైవు నుంచి తనకి తెలియని ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉందనే సంగతిని పెడ్రో కనిపెడతాడు.
అయితే పెడ్రో జీవితంలోను ఒక విషాదకరమైన సంఘటన జరుగుతుంది. ఆ సంఘటనను మరిచిపోవడానికి ప్రయత్నిస్తూనే అతను తన డ్యూటీ చేసుకు వెళుతుంటాడు. అతణ్ణి అంతగా కలిచివేస్తున్న ఆ సంఘటన ఏమిటి? వినీత్ ను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్ వెనకున్న హ్యాకర్ ఎవరు? ఆ హ్యాకర్ కీ .. ప్రీతమ్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? టెక్ జీనియస్ అయిన ప్రీతమ్, చిన్నపాటి జాబ్ ఎందుకు చేస్తున్నట్టు? ప్రీతమ్ ఫ్లాష్ బ్యాక్ కీ .. వినీత్ కిడ్నాప్ కి ఉన్న సంబంధం ఎలాంటిది? అనేది మిగతా కథ.
ఒక మినిష్టర్ కొడుకు కిడ్నాప్ అవుతాడు. సైబర్ సెల్ కి సంబంధించి ఆ కేసును పరిష్కరించడానికి పెడ్రో రంగంలోకి దిగుతాడు. ఆ కుర్రాడిని కాపాడటానికి పెడ్రోకి సహకరిస్తుంటాడు ప్రీతమ్. ఆ కుర్రాడు ఒక హ్యాకర్ చేతిలో బందీగా ఉంటాడు. ప్రీతమ్ పై ఆ హ్యాకర్ ప్రతీకారంతో ఉంటాడు. అందుకు గల కారణాలు ఏమై ఉంటాయనే సందేహాలను ఆడియన్స్ లో రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంటుంది.
ప్రతీకారంతో ఒక హ్యాకర్ .. పశ్చాత్తాపంతో మరో హ్యాకర్ ఉంటాడు. వారి గతం గురించి ఏ మాత్రం తెలియని పోలీస్ ఆఫీసర్ పెడ్రో, ఇద్దరి మధ్యా ఉంటాడు. ఈ మూడు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న కథతో పాటు, సందర్భాన్ని బట్టి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా ఆసక్తికరంగా నడుస్తాయి. సీరియస్ నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా చూసుకుంటూనే కామెడీ టచ్ ఇచ్చిన విధానం బాగుంది.
తొందరపాటు తనంతో చేసే కొన్ని పనులు, అవతలివారికి ఒక జీవితకాలానికి సరిపడా నష్టాన్ని కలిగిస్తాయి. బాధితులలో నుంచి ఒక శత్రువు పుట్టుకొస్తే .. ఆ శత్రువు నీడలా వెంటాడం మొదలు పెడితే .. అతనికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉంటే ఏం జరుగుతుంది? అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. కాగితంపై తాను రాసుకున్న సన్నివేశాలను అంతే గొప్పగా తెరపై ఆవిష్కరించగలిగాడు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం .. దానిని ఒళ్లంతా నింపుకున్న స్మార్ట్ ఫోన్ మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఎంతో ఉపయోగకరమైనదైన స్మార్ట్ ఫోన్, అంతే ప్రమాదకారిగాను మారిపోయింది. స్మార్ట్ ఫోన్ ఆధారంగా సాధించలేనిది లేదు అన్నట్టుగా నేరగాళ్లు వాటిని తమ ఆయుధాలుగా మార్చుకుని, చిన్న పిల్లల మొదలు పెద్దల వరకూ ఎలా ప్రమాదాలలోకి నెడుతున్నాయనేది చూపించిన తీరు బాగుంది.
ఒక ఎపిసోడ్ కి మించి మరొక ఎపిసోడ్ ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఎక్కడా లూజ్ సీన్స్ అనేవి కనిపించవు. స్క్రీన్ ప్లే చాలా బలంగా కనిపిస్తుంది. కథలో ఏ సన్నివేశం చూస్తున్నా .. ఏ పాత్రను పరిశీలించినా సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయంగా అనిపిస్తుంది. మన కళ్లముందు నిజమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న భావన కలుగుతుంది. ప్రతి ఆర్టిస్ట్ నటన ఆకట్టుకుంటుంది.
అవినాశ్ అరుణ్ కెమెరా పనితనం చాలా బాగుంది. సంజయ్ వాండ్రేకర్ నేపథ్య సంగీతం అలరిస్తుంది. రాజ్ కుమార్ హిరానీ ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. కంటెంట్ లో ఎక్కడ వేస్టేజ్ అనేది కనిపించదు. అంత పట్టుగా ఆవిష్కరించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.
స్నార్టు ఫోన్ .. దానిని ఆశ్రయించి ఉండే యాప్ లు .. గేమ్ లు ఎంతటి ప్రమాదానికి దారి తీయగలవు? పిల్లల సరదాలు .. పెద్దల బలహీనతలు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అలాంటివాటి విషయంలో ఎంత జాగ్రతగా ఉండాలనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది .. స్మార్ట్ ఫోన్ వాడే విషయంలో ఆలోచింపజేస్తుంది.
'ప్రీతమ్ అండ్ పెడ్రో' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Pritam and Pedro Review
Movie Details
Movie Name: Pritam and Pedro
Release Date: 2026-07-03
Cast: Arshad Warsi, Vir Hirani,Vikrant Massey,Satyadeep Mishra,Shruti Marathe
Director: Rajkumar Hirani
Music: Sanjay Wandrekar
Banner: Rajkumar Hirani Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer