'కార్మేని సెల్వమ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

సముద్రఖని ఒక వైపున తెలుగు .. తమిళ భాషల్లో కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున కథానాయకుడిగా ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన తమిళ సినిమానే 'కార్మేని సెల్వమ్'. అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ సినిమాకి, రామ్ చక్రి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 3వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు (జూన్ 3వ తేదీ) నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.

చెన్నై సముద్రతీరంలోని ఒక స్లమ్ ఏరియాలో, సెల్వమ్ (సముద్రఖని) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. భార్య శాంతి (లక్ష్మీ ప్రియ) ఇడ్లీ బండీ నడుపుతూ ఉంటుంది, వారి ఏడేళ్ల కొడుకే బాలు. తన భర్త సొంత కారు కొనుక్కుని టాక్సీ నడుపుకోవాలనీ, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనేది శాంతి ఆశ .. ఆలోచన. సిటీలో ఉండే సంపత్ (గౌతమ్ మీనన్) ఆయన భార్య దేవి (అభినయ)కి సెల్వమ్ కారు డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు.

సొంతకారు .. సొంత ఇల్లు తీసుకోవడం కోసం శాంతి డబ్బు కూడబెడుతూ ఉంటుంది. అయితే ఆ డబ్బు సెల్వమ్ మేనకోడలికి 'సారె' క్రింద ఇచ్చేస్తుంది. అందుకోసం తన 'తాళి'ని కూడా తాకట్టు పెడుతుంది. సొంత కారు - సొంత ఇల్లు తీసుకుని భార్య ముచ్చట తీర్చాలనేది సెల్వమ్ కోరిక. అందుకోసం ఏం చేయాలనే దిశగా అతను ఆలోచన చేస్తుండగా, సంపత్ తన ఫ్యామిలీతో ఫారిన్ వెళతాడు. ఆ సమయంలో ఆయన కారును సెల్వమ్ ట్యాక్సి సర్వీస్ లో పెడతాడు.

ధనవంతులు కావాలంటే ముందుగా ధనవంతులుగా బ్రతకడం నేర్చుకోవాలనే మాట పట్టుకుని,సెల్వమ్ అప్పులు చేయడం మొదలు పెడతాడు. స్థలం కొనుగోలు చేయడమే కాకుండా, ప్రతి చిన్న అవసరానికి క్రెడిట్ కార్డును వాడుతూ ఉంటాడు. భార్య ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా పెద్ద మొత్తంలో అప్పులు చేస్తాడు. ఆ అప్పులను తీర్చడం కోసం సెల్వమ్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. ఉన్నదానికంటే కాస్త బాగా బ్రతకాలనే కోరిక ఉంటుంది. అయితే అందుకు అప్పు చేయడకూడదనేది శాంతి అభిప్రాయం. అప్పు అనేది చేయకపోతే కొన్ని ఆనందాలను ఎప్పటికీ పొందలేమనేది ఆమె భర్త ఆలోచన. అందునా భార్య ముచ్చట తీర్చడం కోసం అప్పు చేసినా తప్పులేదనేది ఆయన ఉద్దేశం. అలాంటి ఆ దంపతుల చుట్టూ అల్లుకున్న కథ ఇది.

జీవితమనే ప్రయాణంలో ఎవరి స్థాయిలో వారికి కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరికలను నిదానంగా నెరవేర్చుకుందామని భావించేవారు కొందరైతే, సాధ్యమైనంత త్వరగా తీర్చేసుకుందామని అనుకునేవారు కొందరు. అలాంటి వర్గాలకి ప్రతినిధులుగా ఇద్దరు  భార్యాభర్తలను చూపిస్తూ, ఎవరి ఆలోచన సరైనది? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమా నడుస్తుంది.

కథలో ప్రధానమైన భాగమంతా భార్యాభర్తల నేపథ్యంలోనే నడుస్తుంది. 'కష్టపడితే వచ్చిన డబ్బును కాదనకు .. కష్టపడకుండా డబ్బు వస్తుందంటే నమ్మకు' అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతుంది. భార్యాభర్తల పాత్రలను దర్శకుడు డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. వాళ్ల పాత్రల వైపు నుంచి ఉన్న ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. గౌతమ్ మీనన్ - అభినయ ట్రాక్ కూడా మనసులను సున్నితంగా తాకుతుంది. సంపాదన అనే పరుగులో మనిషి తనని తాను మరిచిపోతున్నాడనే విషయాన్ని చెబుతుంది.

ఈ సినిమాను మనం ఫస్టాఫ్ - సెకండాఫ్ గా చూడలేము. మొత్తం ఒక ఎమోషన్ గా మనముందు నిలిచే కంటెంట్ ఇది. నాలుగైదు ప్రధానమైన పాత్రలతో .. ఒక సింపుల్ లైన్ ను బలంగా చెప్పడం దర్శకుడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. యువరాజ్ దక్షన్ ఫొటోగ్రఫీ .. జగన్ ఎడిటింగ్ .. నేపథ్య సంగీతం ఈ కంటెంట్ ను మరింత బలంగా కనెక్ట్ చేస్తాయి.

స్మార్టు ఫోన్లు .. యాప్ లు .. ఆఫర్లు .. ఆకర్షణలు, ఆన్ లైన్లో అవి విసిరే వలల గురించి దర్శకుడు టచ్ చేసిన తీరు బాగుంది. తెలిసీ తెలియక వీటి బారినపడి ఎంతమంది అప్పుల పాలవుతున్నారనేది వివరించిన విధానం మెప్పిస్తుంది. బలంగా మారడమంటే .. బలహీనలతలను వదులుకోవడమే అనే నిజాన్ని అందంగా .. సున్నితంగా ఆవిష్కరించిన సినిమా ఇది.   

ఈ సినిమా మొత్తంలో అనవసరమైన సన్నివేశం ఎక్కడా కనిపించదు. ప్రేక్షకులకు అవసరమైన వినోదాన్ని అందిస్తూనే, వాళ్లను ఆలోచింపజేసే సందేశం ఉంది. 'అనవసరమైనవి కొంటూపోతే, అవసరమైనవి కోల్పోతాం' అనే డైలాగ్, ఈ సినిమా మొత్తాన్ని కలిపి చెబుతుంది. ఆదాయానికి మించి .. అవసరాలకు మించి ఖర్చు చేయకూడదు. ఆశల వెంట తీసే పరుగు, కుటుంబానికి దూరం చేస్తుంది. భార్యాబిడ్డలతో కలిసి ఉండటంలోనే అసలైన ఆనందం ఉంది .. సర్దుకుపోవడంలోనే సంతోషం ఉందని చాటిన సినిమా ఇది.

Movie Details

Movie Name: Carmeni Selvam

Release Date:

Cast: Samuthirakani, Gautham Vasudev Menon, Lakshmi Priya, Chandramouli Abhinaya

Director: Ram Chakri

Producer: Arun Rangarajulu

Music: Musicloud Studio

Banner: Pathway Productions

Carmeni Selvam Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews