ధర్మ మహేశ్ హీరోగా రూపొందిన సినిమానే 'డ్రింకర్ సాయి'. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య నటించింది. 2024లో డిసెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, అంతగా ఆదరణ లభించలేదు. సరైన పబ్లిసిటీ లేకపోవడం అందుకు ఒక కారణంగా చెప్పుకున్నారు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'జీ 5' ఓటీటీలోకి వచ్చింది. మే 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
సాయి (ధర్మ మహేశ్) కలవారి అబ్బాయినే. అయితే తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన అతను, మద్యానికి బానిస అవుతాడు. అందువలన అందరూ అతనిని 'డ్రింకర్ సాయి' అనే పిలుస్తూ ఉంటారు. మందుకొడుతూ .. సిగరెట్లు తాగుతూ .. తన స్నేహితులైన వంశీ - రిషితో కలిసి తిరుగుతూ ఉంటాడు. తగవులకు .. గొడవలకు ముందుంటాడు. తాగడం మానేయమని సన్నిహతులు ఎంతగా చెబుతున్నా పెద్దగా పట్టించుకోడు.
ఒక రోజున 'భాగీ' (ఐశ్వర్య) అతని కంటపడుతుంది. ఆమె 'నేచురోపతి' ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం ఆమెకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ప్రకృతి ద్వారా ఆరోగ్యాన్ని పొందడం గురించి చెబుతూ ఉండే 'వంతెన సుబ్బారావు'కి ఆమె అభిమాని. ఆయన సలహాలను .. సూచనలను ఆమె తప్పకుండా పాటిస్తూ ఉంటుంది. తన తండ్రి కూడా పాటించేలా చేస్తూ ఉంటుంది. అలాంటి భాగీపై సాయి మనసు పారేసుకుంటాడు. తనని ప్రేమించమంటూ వెంటపడుతూ ఉంటాడు.
సాయి ప్రవర్తనకి భయపడిన భాగీ, అతణ్ణి ప్రేమిస్తున్నట్టు అబద్ధమాడుతుంది. తాను అలా చేయడం కరెక్టు కాదని గ్రహించడానికి ఆమెకి కొంత సమయం పడుతుంది. అతని పట్ల తనకి ఎలాంటి ప్రేమ లేదని తేల్చి చెబుతుంది. అప్పుడు సాయి ఏం చేస్తాడు? అతను తీసుకున్న ఆ నిర్ణయం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది? తాను ఇష్టపడిన భాగీ ప్రేమను అతను పొందగలుగుతాడా లేదా? అనేది మిగతా కథ.
ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరి పట్ల పుడుతుందనేది ఎవరూ చెప్పలేరు. అలా ఈ సినిమాలో హీరోయిన్ పట్ల హీరో మనసు పారేసుకుంటాడు. అయితే అతను మద్యానికి బానిస. చెడు అలవాట్లు ఉన్న వాళ్లంటే ఆమెకి అసహ్యం. 'నిన్ను ప్రేమిస్తున్నాను గనుక, నువ్వు తిరిగి ప్రేమించవలసిందే' అనేది అతని సిద్ధాంతం.ప్రేమకి కూడా అర్హత అవరమేననేది ఆమె ఉద్దేశం. అలాంటి వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాల సమాహారమే ఈ సినిమా కథ.
సాధారణంగా ఏ లవ్ స్టోరీలోనైనా కొంతసేపు అలకలు .. అల్లర్లు .. ఆ తరువాత ఇద్దరూ ఒక్కటైపోవడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో లవ్ యూ అంటూ హీరోయిన్ చుట్టూ హీరో తిరుగుతూనే ఉంటాడు. ఆమె అతణ్ణి తప్పించుకుని తిరుగుతూనే ఉంటుంది. తప్పకపోతే చీవాట్లు పెడుతూ ఉంటుంది. సినిమాలో మూడొంతులకుపైగా ఈ తతంగమే నడుస్తుంది. ఆ నేపథ్యంలోనే పాటలు వచ్చి వెళుతూ ఉంటాయి. హీరోయిన్ మనసు మారేదెప్పుడా అని హీరో కంటే ఎక్కువగా ఎదురుచూసి ప్రేక్షకులు అలసిపోతారు.
ఆరోగ్యానికి హీరోయిన్ ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువని చెప్పడం వరకూ బాగానే ఉంది. ప్రకృతి వైద్యం .. యోగాలు .. ఆసనాలు అంటూ హడావిడి చేయడం వరకూ కూడా ఓకే. కానీ 'వంతెన సుబ్బారావు' అంటూ ఒక పాత్రను డిజైన్ చేయడం .. ఆ పాత్రను ఇతర పాత్రలతో కామెంట్ చేయించడం సరిగ్గా అనిపించదు. దీని వలన కథ పక్కకి వెళ్లిపోవడమే కాకుండా, కామెడీ పరంగా కూడా ప్రభావితం చేయలేకపోయింది.
ఐ లవ్యూకీ .. ఐ హేట్ యూకి మధ్య నడుస్తూ వెళ్లిన కథ, క్లైమాక్స్ లో ఏదైనా ట్విస్ట్ ఇస్తుందేమోనని అంతా వెయిట్ చేస్తుంటారు. అనుకున్నట్టుగానే ఒక ట్విస్ట్ పడుతుంది. కాకపోతే అది పాతకాలం నాటి సినిమా క్లైమాక్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. రొటీన్ ట్రాక్ లోకి నెట్టేస్తుంది. కథ అంతా హీరో - హీరోయిన్ చుట్టూనే తిరగడం, మరే పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం అసహనాన్ని కలిగిస్తుంది. తెరపై హీరో తన చేతిలో మందుబాటిలో .. సిగరెట్టో లేకుండా కనిపించడు. టైటిల్ లోనే విషయం చెప్పారు గనుక, దానిని గురించి మాట్లాడుకోవడానికేం లేదు.
అయితే కథ చివరికి వచ్చేసరికి, మందు తాగినా మంచి మాటలే చెప్పాడే .. సిగరెట్లు తాగినా సత్యాలే సెలవిచ్చాడే .. వెకిలి వేషాలు వేసినా కనువిప్పు కలిగించాడే అనుకునే సన్నివేశాలు తెరపైకి వస్తాయి. అప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా 'అరెరే మనం ఇతన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నామే' అనుకుని నాలుక్కరచుకుంటారు.
ధర్మ మహేశ్ .. ఐశ్వర్య ఇద్దరూ బాగానే చేశారు. అంకిరెడ్డి ప్రశాంత్ ఫొటోగ్రఫీ .. శ్రీ వసంత్ సంగీతం ఫరవాలేదు. 'అర్థం చేసుకోవెందుకే .. ' అనే పాట ట్యూన్ పరంగా .. సాహిత్యం పరంగా కూడా బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది.
సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ దగ్గరికంటా వెళ్లేంతవరకూ కూడా హీరోతో మందు .. సిగరెట్లు తాగించారు. ఆ తరువాత .. "చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్లంతా చెడ్డవాళ్లు కాదు, మంచిగా కనిపిస్తున్న వాళ్లంతా మంచివాళ్లూ కాదు. వ్యసనాలు వదిలేస్తేనే అందమైన జీవితాన్ని అందుకునే అవకాశం ఉంటుంది" అనే సందేశం ఇచ్చారు. అక్కడక్కడా వినోదం వికటించినా, సందేశం బాగానే ఉంది గనుక సర్దుకుపోవడమే చేయాలేమో.
'డ్రింకర్ సాయి' (జీ 5) మూవీ రివ్యూ!
Drinker Sai Review
Movie Details
Movie Name: Drinker Sai
Release Date: 2026-05-27
Cast: Dharma, Aishwarya Sharma, Posani, Sameer, Bhadram
Director: Kiran Thirumala Shety
Music: Sri Vasanth
Banner: Everest Cinemas- Smart Screen
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer