'దృశ్యం 3' - మూవీ రివ్యూ!

మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్లో గతంలో మలయాళంలో వచ్చిన 'దృశ్యం' .. 'దృశ్యం 2' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.  కథాకథనాల పరంగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలోని కథకు కొనసాగింపుగా 'దృశ్యం 3' నిర్మితమైంది. అయితే ఈ సారి రీమేక్ గా కాకుండా, మోహన్ లాల్ నటించిన సినిమానే తెలుగు అనువాదంతో వదిలారు. ఈ రోజు (మే 21వ తేదీ)న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు.

జార్జ్ (మోహన్ లాల్) ఆయన భార్య రాణి (మీనా) పిల్లలు అంజూ - అనూ అందరూ కూడా గతం చేసిన గాయం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా అంజూ వివాహం చేయాలని జార్జ్ దంపతులు నిర్ణయించుకుంటారు. భవిష్యత్తులో తన కూతుళ్లు ప్రమాదంలో పడకూడదనే ఉద్దేశంతో, అంజూకి ఫారిన్ సంబంధాలు చూడటం మొదలు పెడతాడు జార్జ్. అలాగే పైచదువుల కోసం అనూని విదేశాలకు పంపించాలని భావిస్తాడు. 

అయితే అంజూ మానసిక స్థితి సరిగ్గా లేదనే ప్రచారం కారణంగా సంబంధాలు వెనక్కిపోతుంటాయి. ఒక చిత్రమైన మానసిక సమస్య కారణంగానే,వరుణ్ అనే కుర్రాడిని అంజూ చంపేసిందనే ఒక వార్త షికారు చేస్తూ ఉంటుంది. అలా ప్రచారం చేస్తున్నది ఎవరో తెలియక జార్జ్ దంపతులు అయోమయంలో పడతారు .. ఆందోళన చెందుతూ ఉంటారు. ఈ పరిస్థితి నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలనే ఉద్దేశంతో ఉంటారు. 

ఇక వరుణ్ మర్డర్ కేసులో జార్జ్ ను పట్టించడానికి ప్రయత్నించి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న సహదేవ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. వరుణ్ శవాన్ని జార్జ్ ఎక్కడ దాచాడనేది తెలుసుకుని, అతని కుటుంబానికి శిక్షపడేలా చేయాలనే కసితో ఉంటాడు. అందుకు తగిన ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇక జార్జ్ కారణంగా జాబ్ పోగొట్టుకున్న పోలీస్ ఆఫీసర్ రాజన్ ఫ్యామిలీ కూడా జార్జ్ ను శిక్షించాలనే పట్టుదలతో ఉంటుంది. 

వరుణ్ ను కోల్పోయిన గీత - ప్రభాకర్ దంపతులు తేరుకోలేకపోతుంటారు. కొడుకును కోల్పోయి తాము బాధపడుతూ ఉంటే, కూతురుకి పెళ్లి చేయడానికి జార్జ్ ప్రయత్నిస్తూ ఉండటం వాళ్లకి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. వరుణ్ హత్య కేసు విషయంలో ఆధారాలు సంపాదించాలనీ, జార్జ్ కూతురు పెళ్లి ఆగిపోయేలా చేయాలని ప్రభాకర్ భావిస్తాడు. ఇలా అంతా కలిసి ప్రతీకారంతో విసిరే వలలో జార్జ్ చిక్కుతాడా లేదా? అనేది మిగతా కథ. 
             
ఆర్థికపరమైన సమస్యలు .. ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ, అలాంటి వాటిని తట్టుకుని ఒక ఆడపిల్లకి తండ్రి పెళ్లి చేయగలడు. కానీ ఆడపిల్లల గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ల బారి నుంచి తప్పించుకుని, ఆ ఆడపిల్లను అత్తవారింటికి పంపించడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ సినిమాలో కథానాయకుడు అలాంటి ఒక సమస్యను ఎలా అధిగమిస్తాడు? అందుకోసం అతను ఏం చేస్తాడు? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

తన కూతురును .. కుటుంబ పరువు ప్రతిష్ఠలను కాపాడుకోవడం కోసం, ఒక మధ్యతరగతి తండ్రి చేసే పోరాటంగా గతంలో వచ్చిన కంటెంట్ కనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆ ఆడపిల్లకు పెళ్లి చేయడానికి చేసే ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. హత్యా నేరం కారణంగా అల్లరి పాలైన కథానాయకుడి కుటుంబం.. ఆడపిల్లకు పెళ్లి చేయాలనే ఆ దంపతుల తాపత్రయం చుట్టూ ఈ కథ పరిగెడుతుంది. 

జార్జ్ తన పెద్ద కూతురికి పెళ్లి చేయడం కోసం చేసే ప్రయత్నాలు, ఆ విషయంలో ఆ కుటుంబానికి ఎదురవుతున్న ఆటంకాలను టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది. తన చుట్టూ ఏదో జరుగుతోంది .. గతాన్ని తవ్వడానికి ఎవరో పావులు కదుపుతున్నారనే సందేహం కథానాయకుడికి రావడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఇక శత్రువులంతా ఏకమై ఉచ్చు బిగించాలని అనుకున్నప్పుడు, తప్పించుకోవడానికి హీరో పడే పాట్లతో సెకండాఫ్ కొనసాగుతుంది.

దృశ్యం .. దృశ్యం 2 సినిమాల మాదిరిగానే, హత్యా నేరం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అయితే గతంలో వచ్చిన రెండు సినిమాలు మొదటి నుంచి చివరివరకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. కానీ ఈ సినిమాకి అలా కుదరలేదు. ఫస్టాఫ్ చాలా నిదానంగా .. నింపాదిగా ఎలాంటి విషయం లేకుండానే సాగిపోతుంది. అసలైన కథ ఇంటర్వెల్ బ్యాంగ్ తరువాత నుంచే దర్శకుడు మొదలుపెట్టాడు. 

ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుందని చెప్పగలం గానీ, గతంలో వచ్చిన రెండు సినిమాల స్థాయిలో ఉందని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆ స్థాయిలో కథలో ట్విస్టులు మనకి ఇందులో కనిపించవు. ఈ సినిమాలో ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ .. ఆ సమయంలో వచ్చే ట్విస్టులు కొంతవరకూ ఊరట కలిగిస్తాయి. అయినా మొదటి రెండు సినిమాల స్థాయిలో ఈ కంటెంట్ కనిపించదు. ఫస్టాఫ్ లో చాలా సమయాన్ని దర్శకుడు వృథా చేయడం సినిమాపై గట్టిగానే ప్రభావాన్ని చూపించిందని చెప్పాలి. 

సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ మంచి మార్కులు కొట్టేస్తుంది. కొన్ని షాట్స్ గొప్పగా అనిపిస్తాయి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం దృశ్యాలకు తగిన బలాన్ని ఇచ్చింది. వినాయక్ ఎడిటింగ్ ఫరవాలేదు. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. ఫస్టాఫ్ పలచగా ఉండటం .. సంభాషణలు పేలవంగా ఉండటం .. డబ్బింగ్ సంతృప్తికరంగా లేకపోవడం ఇతర లోపాలుగా కనిపిస్తాయి. మొదటి రెండు సినిమాల స్థాయిలో 'దృశ్యం 3' లేదనే చెప్పాలి. 


Movie Details

Movie Name: Drishyam 3

Release Date:

Cast: Mohanlal,Meena,Ansiba Hassan,Esther Anil,Asha Sharath, Siddique

Director: Jeethu Joseph

Producer: Antony Perumbavoor

Music: Anil Johnson

Banner: Aashirvad Cinemas

Drishyam 3 Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews