'సతీ లీలావతి' ( జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!


లావణ్య త్రిపాఠి ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా 'సతీ లీలావతి'. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించాడు. 'శాకుంతలం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన దేవ్ మోహన్, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠికి జోడీగా నటించాడు. ఈ నెల 8వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నెల తిరక్కుండానే ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు (మే 20వ తేదీ) నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ సినిమా డైరెక్టర్. ఆమెతో ఓ సినిమా చేయాలని చాలామంది నిర్మాతలు వెయిట్ చేస్తుంటారు. ఆమె భర్త సేతుపతి ( దేవ్ మోహన్) ఓ సైకాలజిస్ట్. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ( నరేశ్ - పవిత్ర) పోట్లాటలు చూస్తూ పెరిగిన కారణంగా ఆమె మానసికంగా దెబ్బతింటుంది. ఆ సమస్య  నుంచి బయటపడటానికి సాయం చేసిన సేతుపతినే వివాహం చేసుకుంటుంది. అయితే పూర్తిగా కెరియర్ పై ఫోకస్ చేసిన ఆమె, సేతుపతిని నిర్లక్ష్యం చేస్తుంది.

లీలావతి ప్రవర్తనకి తాను విసిగిపోయినట్టుగా ఆమెతో సేతుపతి చెబుతాడు. తాను నికోలా సెబాస్టియన్ (మడోన్నా సెబాస్టియన్) అనే యువతిని ప్రేమించినట్టుగా చెబుతాడు. ఇకపై ఆమెతోనే జీవించాలనే నిర్ణయానికి వచ్చానని అంటాడు. తనకి విడాకులు ఇవ్వమని కోరుతూ లాయర్ ను కూడా ఇంటికి పిలిపిస్తాడు. అందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయమని అంటాడు.

తనని సేతుపతి ప్రేమించి పెళ్లి చేసుకోలేదనీ, తన తండ్రి అతనిని ఒప్పించాడనే విషయం లీలావతికి అప్పుడే అర్థమవుతుంది. సేతుపతి నిర్ణయం పట్ల ఆగ్రహావేశాలకు లోనైన లీలావతి, అతనిని ఇంట్లోనే బంధిస్తుంది. లీలావతి తండ్రి .. లీలావతితో సినిమా తీయాలనుకుంటున్న మొట్ట రాజన్ .. సేతుపతి పిలిపించిన లాయర్ .. సేతుపతి ప్రేమించిన నికోలా అక్కడికి చేరుకుంటారు. అప్పుడు లీలావతి ఏం చేస్తుంది? పర్యవసానంగా చోటుచేసుకునే సన్నివేశాలు ఎలాంటివి? అనేది కథ.

'సతీ లీలావతి' అనే పేరు వినగానే, అందుకు పూర్తి రివర్స్ గేర్ లో కథ వెళుతుందని ప్రేక్షకులు ముందుగానే గ్రహిస్తారు. భార్య భర్తల కీచులాటలోని ఎంటర్టైన్ మెంట్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధపడతారు. వాళ్లంతా ఆశించినట్టుగానే, 'నాకు విడాకులు కావాలి' అని భార్యను భర్త ఒత్తిడి చేయడంతో అసలు కథ మొదలవుతుంది. అతను ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం మరో స్త్రీ అని లీలావతికి తెలిసేలా చేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.

అసలు ఈ ఇద్దరికీ ఎలా పరిచయమైంది .. ఆ పరిచయం పెళ్లి పీటల వరకూ ఎలా వచ్చింది? అనేది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భార్యాభర్తలలో ఎవరో ఒకరు దూరం పెడుతున్నారని అనిపించినప్పుడో .. దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినపుడో విడాకుల ప్రస్తావన వస్తుంది. విడాకుల ప్రస్తావన ఆ గొడవ మరింత ముదరడానికి కారణమవుతుందనేది ఈ జంట విషయంలోను చూపించారు. కాకపోతే కామెడీ టచ్ ఇచ్చారు. 

నాకు విడాకులు కావాలని భర్త అంటాడు. నేను ఇవ్వను పో అంటుంది భార్య. కథ మొత్తం ఈ లైన్ పైనే నడుస్తుంది. ఈ విషయంపై ఇంట్లోని నాలుగు గోడల మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వస్తుంటారు. ఇంట్లో నుంచి మాత్రం బయటికి రారు. ఇక ఆ రెండు పాత్రలతో సంబంధం ఉన్న మరో నాలుగైదు పాత్రలు బయట కాచుకుని ఉంటాయి. లోపల ఏం జరుగుతుందనేది వాళ్లకి కూడా తెలియదు.

సీనియర్ నరేశ్ .. మొట్ట రాజేంద్రన్ .. వీటీవీ గణేశ్ వలన కామెడీ వర్కౌట్ కాకపోవడంతో ఆడియన్స్ అసహనానికి లోనవుతారు. అదే సమయంలో సప్తగిరి ఎంట్రీ ఇస్తాడు. హమ్మయ్య కాసేపు నవ్వుకోవచ్చని ప్రేక్షకులు అనుకుంటే, అతను తనకి తోచినట్టుగా ఏకపాత్రాభినయం చేసి వెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఒక సందేహం మాత్రం కలగకుండా ఉండదు. అసలు ఈ సినిమాకి స్క్రిప్ట్ ఉందా లేదా? అని.

హారర్ కథల మాదిరిగా ఈ కథేమిటబ్బా గుమ్మం దాటి బయటికి రావడం లేదని ప్రేక్షకులకు చిరాకు పడుతూ ఉండగా, ప్రధానమైన పాత్రల మధ్య ఛేజింగ్ మొదలవుతుంది. కొండపై ఒక పెద్ద సెటప్ .. క్లైమాక్స్ అక్కడే కావడంతో అంతా అక్కడికి చేరుకుంటారు. ఈ ఎపిసోడ్ చూస్తుంటే, మనకు కార్టూన్ షో గానీ .. వీడియో గేమ్ గాని గుర్తుకు రాకుండా ఉండదు.

హీరోయిన్ ను చిన్నప్పటి నుంచి లవ్ చేసే మరుగుజ్జు, వాష్ రూమ్ కి వెళ్లాలంటూ చేసే హడావిడి, ఐస్ క్రీమ్ - గులాబీ జామ్ అంటూ హీరోయిన్ చెప్పే కథలు .. 'స్వాతిముత్యం'లో కమల్ హాసన్ కంటే అమాయకంగా కనిపించే సైకాలజిస్ట్ పాత్ర .. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. విషయం లేకుండా నవ్వించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో .. నవ్వురాక ఆడియన్స్ కూడా అంతే ఇబ్బంది పడతారని చెప్పాలి. 

కథాకథనాలు మాత్రమే కాదు, సన్నివేశాలు .. సంభాషణలు కూడా అంతే పేలవంగా అనిపిస్తాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరి కేటగిరీలోనే కనిపిస్తాయి. బలహీనమైన కథను బలమంతా ఉపయోగించిలాగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే విషయాన్ని మరోసారి నిరూపించిన కంటెంట్ ఇది.  

Movie Details

Movie Name: Sathi Leelavathi

Release Date:

Cast: lavanya Tripathi, Dev Mohan, Naresh, VTV Ganesh, Madonna Sebastian, Rajendran, Sapthagiri

Director: Tatineni Satya

Producer: Naga Mohana Babu

Music: Mickey J Meyer

Banner: Durga Devi Pictures

Sathi Leelavathi Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews