'ఆడు 3' (జీ 5) మూవీ రివ్యూ!

మలయాళంలో 'ఆడు' సిరీస్ నుంచి వచ్చిన 3వ సినిమానే 'ఆడు 3'. 2017లో  వచ్చిన రెండవ భాగానికి సీక్వెల్ గానే ఈ కథ నడుస్తుంది. మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. 50 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నెల 1వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు, ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.

కేరళ ప్రాంతంలోని ఒక విలేజ్ లో షాజీ పాపన్ (జయసూర్య) నివసిస్తూ ఉంటాడు. క్లీటస్ తో పాటు ఇతర స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. తాను ఒక రాజుగా కత్తిపట్టడం .. రాజ్యం .. యుద్ధం తాలూకు దృశ్యాలు అప్పుడప్పుడు అతని కళ్లముందు కదలాడుతూ ఉంటాయి. అందుకు కారణం ఏమిటనేది అతనికి అర్థం కాదు. స్నేహితుల కారణంగా, స్క్రాప్ బిజినెస్ చేయాలనే ఆలోచన అతనికి వస్తుంది. ఆ సమయంలోనే పాతకాలం నాటి ఒక వంతెన కూల్చివేత .. దాని స్క్రాప్ కి సంబంధించిన టెండర్ అతని కంట పడుతుంది. 

ఈ టెండర్ కి సంబంధించిన పనులపై పాపన్ తిరుగుతూ ఉంటాడు. దానిని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ టెండర్ కోసం సాతన్ సేవియర్ (సన్నీవేన్) ట్రై చేస్తూ ఉంటాడు. వంతెన స్క్రాప్ కి సంబంధించిన టెండర్ ను వదులుకోమని పాపన్ తో సేవియర్ అంటాడు. అక్కడ తన తాత వాల్టర్ జోసెఫ్ అస్థికలు ఉన్నాయనీ .. వాటిని జాగ్రత్తగా వెలికి తీయవల్సిన బాధ్యత తనకి ఉందని చెబుతాడు. అలా చేస్తే 25 లక్షలు  ఇస్తానని అంటాడు.

సేవియర్ అంత డబ్బు ఇస్తానని అనడంతో పాపన్ కి సందేహం కలుగుతుంది. వంతెనలో విలువైన వస్తువేదో దాచబడి ఉందనీ, దానిని కాజేయడం కోసమే సేవియర్ ప్లాన్ చేస్తున్నాడని పాపన్ పసిగడతాడు. అందువలన అతను సేవియర్ ఆఫర్ ను తిరస్కరిస్తాడు. అదే సమయంలో .. అదే విషయంలో సులేమాన్ (వినాయకన్) ఎంట్రీ ఇస్తాడు. సులేమాన్ ఎవరు? ఆ వంతెన నిర్మాణంలో దాచబడిన వస్తువు ఏమిటి? దానితో వాళ్లకి గల సంబంధం ఏమిటి? చివరికి అది ఎవరి చేతికి చిక్కుతుంది? అనేది మిగతా కథ.

ఈ కథ .. 17వ శతాబ్దంలోను .. 2025లోను .. 2370లోను నడుస్తుంది. 2370లో 'స్టార్ డస్ట్' అనే ఒక శక్తిమంతమైన వస్తువును చేజిక్కుంచుకునే ప్రయత్నంతో ఈ కథ మొదలవుతుంది. ఎక్కువ భాగం 17వ శతాబ్దం - 2025లలో నడుస్తుంది. 17వ శతాబ్దంలో కథ ఏ అంశం చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది. 2370వ సంవత్సరంలోను అదే అంశం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ మూడు కాలాలలోను దర్శకుడు సెట్ చేసిన లింకులు కరెక్టుగానే కనిపిస్తాయి. 

17వ శతాబ్దంలో నడిచే కథలో ఏవైతే ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయో, 2025లో నడిచే కథలోని ప్రధానమైన పాత్రలలోను అదే ఆర్టిస్టులు కనిపిస్తారు. అంటే ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా ద్విపాత్రాభినయం చేశారన్న మాట. ఆంగ్లేయుల కాలంలో రాజా పద్మనాభన్ గా .. ప్రస్తుత కాలంలో పాపన్ గా జయసూర్య, ఆజంఖాన్ గా .. సులేమాన్ గా వినాయకన్, వాల్టర్ జోసెఫ్ గా - సేవియర్ గా సన్నీ వేన్.. ఇలా అందరూ ఈ రెండు కాలాల్లో .. రెండేసి పాత్రల్లో కనిపిస్తారు.

రెండు కాలాలకు సంబంధించిన కథ తెరపై కలిసి కదులుతూ ఉంటుంది. 2370నాటి కాలానికి సంబంధించిన కథ మాత్రం అప్పుడప్పుడు తొంగిచూస్తూ ఉంటుంది. వేరు వేరు కాలాల్లో కథ ఒకే వస్తువు చుట్టూ, ఒక్కో ఆర్టిస్ట్ పోషించిన రెండు పాత్రల చుట్టూ తిరగడం కొత్తగా అనిపిస్తుంది. ఒక రకంగా ఇది ప్రయోగంగానే చెప్పుకోవాలి. కాకపోతే సామాన్య ప్రేక్షకులను అయోమయానికి గురిచేసే అంశం కూడా ఇదేనని చెప్పుకోవాలి.

దర్శకుడు ఈ కథను పూర్తిస్థాయి కామెడీతో చెప్పాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. అయితే కామెడీకి తగిన సమయం .. సందర్భం వచ్చేవరకూ వెయిట్ చేయలేదు. ప్రతి సన్నివేశంలో .. ప్రతి పాత్రతో .. ప్రతి సందర్భంలో కామెడీని పరిగెత్తించడానికి ప్రయత్నించాడు. కాకపోతే అది చాలా తక్కువసార్లు మాత్రమే వర్కౌట్ అయింది. మహారాజు మొదలు సామాన్య సేవకుడు వరకూ అందరూ కామెడీగానే తప్ప, మామూలుగా మాట్లాడరు. 

మూడు కాలాలలో నడిచే ఈ కథ ఏ వస్తువు చుట్టూ అయితే తిరుగుతుందో, ఆ వస్తువు యొక్క  ప్రాధాన్యత ఏమిటి? ప్రయోజనం ఏమిటి? అనేది మాత్రం కాస్త వివరంగా చెబితే బాగుండేదని అనిపిస్తుంది. అయితే మూడు కాలాలలోని వాతావరణాలను తెరపైకి తీసుకొచ్చే విషయంలో దర్శకుడు గట్టిగానే కష్టపడ్డాడని చెప్పాలి. ఆయా కాలాలకు తగినట్టుగా గుర్రాలు .. స్పీడ్ బొట్లు .. హెలికాఫ్టర్లు .. ఛేజింగులు ఆకట్టుకుంటాయి. 

ఇక నిర్మాణ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకపోవడం కనిపిస్తుంది. ఆయా కాలాలకు తగిన కాస్ట్యూమ్స్ .. సెట్లు డిజైన్ చేయించిన విధానం ఆకట్టుకుంటుంది. జరిగిన కథను పక్కపక్కనే పరిగెత్తించడమనేది కొంతమంది ప్రేక్షకులకు అర్థమవుతుంది. కానీ ఎక్కువమంది ప్రేక్షకులను గందరగోళంలోకి నెడుతుంది. ఇక కామెడీ ఎక్కువైపోయి, కథను సీరియస్ గా ఫాలో కాకుండా చేస్తుంది. 

డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలలో ఆర్టిస్టులంతా బాగా చేశారు. 17వ శతాబ్దానికి చెందిన కంటెంట్ ను చూపించడానికి ఎంచుకున్న లొకేషన్స్ బాగున్నాయి. ఫొటోగ్రఫీ  .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. లవ్ .. రొమాన్స్ ను అసలు పట్టించుకోకపోవడం, యాక్షన్ పై దృష్టిపెట్టకపోవడం .. ఎక్కడా ఎమోషన్ కి అవకాశం లేకపోవడం .. కామెడీలో కనిపించే 'అతి' .. ఈ కథను చప్పగా మార్చేశాయని అనిపిస్తుంది. విజువల్స్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేసే సినిమా ఇది.             

Movie Details

Movie Name: Aadu 3 Movie

Release Date:

Cast: Jayasurya,Vinayakan,Sunny Wayne, Saiju Kurup ,Vijay Babu,Dharmajan Bolgatty

Director: Midhun Manuel Thomas

Producer: Vijay Babu

Music: Shaan Rahman

Banner: Friday Film House

Aadu 3 Movie Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews