'మట్కా కింగ్' (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ!

విజయ్ వర్మ ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'మట్కా కింగ్'. నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 17వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1 క్రింద 8 ఎపిసోడ్స్ ను వదిలారు. ఒక్కో ఎపిసోడ్ 50 - 60 నిమిషాల వరకూ ఉంటుంది. ముంబై నేపథ్యంలో సాగే కథ ఇది. భారీ తారాగణంతో నిర్మించిన ఈ సిరీస్ కథేమిటనేది చూద్దాం.

అది 1962 ప్రాంతం. బొంబాయి నగరంలో 'లాల్ జీ భాయ్' (గుల్షన్ గ్రోవర్) పేరు విననివారంటూ ఉండరు. నగరంలోని కీలకమైన ప్రదేశాలలో ఆయన కాటన్ మిల్స్ రన్ అవుతూ ఉంటాయి. కాటన్ మిల్స్ తెరవెనుక అతను 'మట్కా'ను నిర్వహిస్తూ ఉంటాడు. రాజకీయనాయకులు .. పోలీస్ అధికారులు ఆయన చేతిలో ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న లాల్ జీ భాయ్ అంటే అందరికీ భయమే. అలాంటి అతని దగ్గర బ్రిజ్ భట్టి ( విజయ్ వర్మ) పనిచేస్తూ ఉంటాడు.

ఒకసారి బ్రిజ్ భట్టికి డబ్బు అత్యవసరమవుతుంది. ఆ డబ్బు అడిగిన బ్రిజ్ భట్టిని నలుగురిలో లాల్ జీ భాయ్ అవమానపరుస్తాడు. దాంతో అతని దగ్గర పని మానేసిన బ్రిజ్ భట్టి, తాను సొంతంగా 'మట్కా' సెంటర్ ను నిర్వహించాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్రయత్నానికి తమ్ముడు లక్ష్మణ్ .. స్నేహితుడు దగ్ డూ అండగా నిలబడతారు. సాధారణంగా 'మట్కా' అనేది అన్యాయం జరగడానికి పూర్తిస్థాయిలో అవకాశం ఉన్న ఒక జూదం. దానిని న్యాయంగా నిర్వహించాలనే ఉద్దేశంతో బ్రిజ్ భట్టి ముందుకు వెళతాడు.

అలా ఒక జూదానికి కూడా న్యాయాన్ని జోడించడం వలన, బ్రిజ్ భట్టి ఎదగడానికి పెద్దగా సమయం పట్టదు. 'మట్కా' ఆటలో అనేక కొత్త ప్రక్రియలు ప్రవేశపెడుతూ వెళ్లడం వలన మరింత మందిని అతను ఆకర్షించగలుగుతాడు. అలా బ్రిజ్ భట్టి 'మట్కా కింగ్' గా ఎదుగుతాడు. కోట్లాది రూపాయలను సంపాదిస్తాడు. అయితే ఆ సంపదను ఒక రహస్య ప్రదేశంలో దాచేస్తాడు. ఈ క్రమంలోనే అతను భార్య బిడ్డలు ఉన్నప్పటికీ, గుల్రుక్ (కృతిక కమ్రా) ప్రేమలో పడతాడు.

బ్రిజ్ భట్టిని దెబ్బతీయాలనే నిర్ణయానికి లాల్ జీ భాయ్ వస్తాడు. తన కూతురు వసుధను 'ఎర'గా ఉపయోగించి, బ్రిజ్ భట్టి తమ్ముడు లక్ష్మణ్ ను తనవైపుకు తిప్పుకోవాలని అనుకుంటాడు. అందువలన బ్రిజ్ భట్టి సంపద ఎక్కడ దాచింది తెలుసుకోవచ్చని భావిస్తాడు. ఈ విషయంలో అతనికి సహకరించడానికి మంత్రి ప్రతాపరావు అంగీకరిస్తాడు. ఫలితంగా బ్రిజ్ భట్టికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? ఆ సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటాడు? అనేది కథ.

1960 ప్రాంతంలో ముంబైలో ధనికుల విలాసవంతమైన వినోదంగా గుర్రపు పందాలు జరుగుతూ ఉండేవి. గుర్రపు పందాలు ఆడటం శ్రీమంతుల హాబీగా కనిపించేది. అలాంటి పరిస్థితులలో పేదవారి ఆటగా 'మట్కా' వారికి చేరువవుతూ వచ్చింది. 'మట్కా' ఆడకుండా ఉండలేని స్థితికి చాలామంది వచ్చేశారు. ఒకానొక సందర్భంలో 'మట్కా' అనేది ముంబై ఆర్ధిక పరిస్థితిని ప్రభావితం చేసే స్థాయికి వెళుతుంది. ఈ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.

ఆత్మాభిమానానికీ .. అహంభావానికి మధ్య సన్నని గీతను గుర్తించడం కష్టం. అహంభావం తాను మాత్రమే గొప్పవాడినని అనుకునేలా చేస్తుంది. ఆత్మాభిమానం గొప్ప స్థాయికి చేరుకోవడానికి కారణమవుతుంది. అలా ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న హీరోకి జరిగిన అవమానంలో నుంచి ఆశయం ఏర్పడుతుంది. ఆ ఆశయసాధనలో అతను ముందుకు వెళ్లే తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ కథలో ప్రధానమైన అంశంగా కనిపించేది ఇదే. 

సాధారణంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు అతని చుట్టూ శత్రువుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంటుంది. ఇక ఆ ఎదగడం వెనుక 'జూదం' ఉన్నప్పుడు పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతూ ఉంటాయి. ఆ వ్యక్తిని పడగొట్టడానికి అన్ని వైపుల నుంచి వ్యూహాలు .. ప్రతి వ్యూహాలు ఆచారంలో పెడుతూ ఉంటారు. స్వార్థ రాజకీయాలు .. రౌడీయిజం .. అవినీతి అధికారులు .. ఇంటిదొంగలు ఇలా ఎన్నింటినో దాటుకుంటూ వెళ్లవలసి వస్తుంది. అలాంటి వాటిని ఆవిష్కరించిన విధానంగా బాగుంది. 

కష్టాలు కలిసి ఉండేలా చేస్తాయి .. సుఖాలు విడిపోయేలా చేస్తాయి. చాలామంది అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఇదే. కష్టాలు కలిసి పనిచేసేలా చేస్తే, సుఖాలు ఎవరి వ్యామోహాల దిశగా వాళ్లను నడిపిస్తాయి. ఎవరి ఆకర్షణలలో వారు కూరుకుపోయేలా చేస్తాయి. అలాంటి పరిణామాలే ఈ కథలో మలుపులుగా కనిపిస్తాయి. ఎంతకష్టపడి నిర్మించిన సామ్రాజ్యాల పతనమైనా ఎలా కూలిపోవడం మొదలవుతుందనేది చూపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది.

ముంబైలో 1960 కాలం నాటి వాతావరణం .. అక్కడ 'మట్కా' ఆట చూపించిన ప్రభావం తాలూకు పరిస్థితులను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆయా పాత్రలను డిజైన్ చేసిన పద్ధతి .. వాటిని నడిపించిన పద్ధతి కూడా వాస్తవానికి చేరువగా అనిపిస్తాయి. అయితే కథనం చాలా నిదానంగా సాగడం .. అందువలన నిడివి పెరగడం కాస్త అసహనానికి గురిచేస్తుంది. ఇక కథను ఫ్లాట్ గా చెప్పేయడం .. అది కూడా ఆడియన్స్ గెస్ చేసినట్టుగా సాగడం ఆసక్తి తగ్గడానికి కారణమవుతుంది.   

విజయ్ వర్మ నటన ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. 1960ల నాటి లుక్ తో కనిపిస్తూ, తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా జీవించాడు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రలను బలంగా ఆవిష్కరించారు. సుధాకరరెడ్డి కెమెరా పనితనం ప్రశంసలను అందుకుంటుంది. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కనిపిస్తాయి. అక్కడక్కడా కాస్త అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి.

1960 -70ల నాటి కాలాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం .. ముంబై నగరంపై 'మట్కా' చూపించిన ప్రభావం తాలూకు డ్రామా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడా కూడా ఎమోషన్స్ కనెక్ట్ కావు. సాగతీతతో కూడిన సన్నివేశాలు ఇబ్బందిని కలిగిస్తాయి.     

Movie Details

Movie Name: Matka King

Release Date:

Cast: Vijay Varma,Sai Tamhankar,Bhupendra Jadawat,Kritika Kamra,Gulshan Grover,Siddharth Jadhav

Director: Nagraj Manjule

Producer: Siddharth Roy Kapur

Music: -

Banner: A Roy Kapoor Films

Matka King Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews