విభిన్నమైన కథలతో, కొత్త తరహా చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అడవి శేష్. తాజాగా ఆయన నటించిన చిత్రం 'డెకాయిట్' మృణాల్ ఠాకూర్ నాయికగా నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంటున్న 'డెకాయిట్' చిత్ర కథ ఏమిటి? అడవి శేష్ ఈ సారి కూడా కొత్త తరహా కథను కథను ఎంపిక చేసుకున్నాడా? లేదా? 'డెకాయిట్'లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది? తదితర విషయాలు రివ్యూలో తెలుసుకుందాం..
కథ: హరిదాస్ (అడవి శేష్) తనపై మోపిన ఓ హత్య కేసు కారణంగా జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. తనకు జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకుంటానికి జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇందుకోసం ఇషాద్ బాయ్ (అతుల్ కులకర్ణి) అతనికి హెల్ప్ చేస్తాడు. జైలు నుంచి రాగానే హరిదాస్ దుబాయ్‌కి వెళ్లాలనుకుంటాడు. అందుకు తగ్గ ఏర్పాటు కూడా జరిగిపోతాయి. అయితే ఇందుకోసం కొంత డబ్బు అవసరం పడుతుంది. అయితే దుబాయ్ వెళ్లేలోపు తన ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు తనకు అవసరమైన డబ్బును కూడ సంపాందించాలని ప్లాన్ చేసుకుంటాడు.
తను పగ తీర్చుకోవాలని అనుకున్న తన ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్)ను కలవగానే ఆమె ఓ పాపతో కనిపిస్తుంది. సరస్వతి భర్త భాస్కర్ (వైభవ్) అనారోగ్యంతో ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో ఉంటాడు. ఈ పరిస్థితిలో సరస్వతికి కోటి రూపాయాలు అవసరం పడుతుంది. దీంతో ఆమె బలహీనతను అడ్డం పెట్టుకుని హరిదాస్ ఆమెపై పగ తీర్చుకోవాలనుకుంటాడు? అయితే తరువాత జరిగిందేమిటి? ప్రేయసిపై హరి ఎందుకు పగబడతాడు? ఆమె చేసిన అన్యాయం ఏమిటి? హరిని సరస్వతి మర్డర్ కేసులో ఇరికించడానికి కారణమేమిటి? ఇందుకు భాస్కర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో సీఐ రాంబాబు (అనురాగ్ కశ్యప్) పాత్ర ఏమిటి? కరుణ హస్పిటల్స్ ఎం.డి ప్రకాష్ రాజ్, మల్లి (కామాక్షి భాస్కర్ల)లకు ఈ కథకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
అడవి శేష్ గత సినిమాలతో ప్రేక్షకుల్లో బలమైన నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఆయన సినిమాలంటే ఖచ్చితంగా కొత్తదనంతో ఉంటాయనే గ్యారెంటి ప్రేక్షకుల్లో ముద్రపడే విధంగా ఆయన సినిమాలను ఎంచుకున్నాడు. ఈ సారి 'డెకాయిట్' సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అడవి శేష్ స్వయంగా అందించడంతో సినిమాపై, సినిమాలో ఉండే వైవిధ్యతపై నమ్మకం ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. అయితే డెకాయిట్ సినిమా కథ, కథనాల్లో పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించలేదు. అయితే సినిమా స్టయిలిష్ మేకింగ్, టెక్నికల్ వాల్యూస్, కొన్ని థ్రిల్లింగ్ అంశాలతో శేష్‌పై పెట్టుకున్ననమ్మకానికి కొంత వరకు న్యాయం చేశాడనిపించింది.
సినిమా ప్రారంభంలో ఓ కులాంతర ప్రేమకథతో మొదలై ఆ తరువాత ట్విస్ట్, మాస్, యాక్షన్ అంశాలు జోడించి సినిమాను స్టయిలిష్‌గా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం కనిపించింది. అయితే సినిమా ప్రారంభంలోనే వచ్చే ప్రేమ సన్నివేశాలు బోరింగ్‌గా స్టార్ట్ కావడం, అంతగా ఆసక్తి లేని జైలు సన్నివేశాలతో ఆరంభంలో ఇంప్రెషన్‌ను కలిగించలేకపోయింది. అయితే హీరోయిన్‌తో, హీరో విడిపోవడానికి కారణం, అతను జైలు వెళ్లడానికి చెప్పే రీజన్ కొంత పర్వాలేదనిపిస్తుంది. ఈ సన్నివేశాల నుంచి కథలో వేగం పెరిగినట్లు అనిపించినా... కథనం ఊపందుకోదు. అవే సన్నివేశాలు రీపీట్ అవుతున్న ఫీల్ కలుగుతుంది. హీరో జైలు నుంచి తప్పించుకున్న తరువాత కథలో మరింత స్పీడ్ పెరుగుతుంది. ఈక్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఛేజ్‌లు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.
సెకండాఫ్‌లో కథలో అసలు ఎమోషన్ ప్రారంభం కావడం, హీరోయిన్ గురించి అసలు నిజం తెలుసుకోవడంతో సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అయితే ఆస్పత్రిలో వీళ్లు దొంగతనం చేయడానికి చేసిన ఏపిసోడ్ మరింత పేలవంగా, బలహీనంగా ఉంటుంది. ఈ సన్నివేశాల్లో ఏ మాత్రం లాజిక్‌ను పట్టించుకోలేదు. హీరో, హీరోయిన్ను పట్టుకునేందుకు సీఐ స్వామి వేసే ఎత్తులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఆ సన్నివేశాలు చిత్రీకరణ కూడా బాగుంది. అయితే కరోనా సమయంలో జరిగిన కథలా చిత్రీకరించిన ఈ సినిమాలో ఆ సమయంలో ఉన్న పరిస్థితులను సరిగ్గా పట్టించుకలేదు.
హీరోయిన్ పాత్రను డిజైన్ చేసిన విధానంలో కూడా వాళ్ల కన్వినెంట్ రైటింగ్‌కు అనుగుణంగా సన్నివేశాలు అల్లుకున్నారు. ఏ మాత్రం లాజిక్‌లు పట్టించుకోలేదు. పతాక సన్నివేశాలు కన్వీన్సింగ్ అనిపించినా, కొన్ని పాత సినిమాలు మాత్రం గుర్తు చేశాయి. అయితే ఈ పతాక సన్నివేశాల గురించే ఈ కథను రాసుకున్నారేమో అనిపిస్తుంది. ఇక హీరో అడివి శేషే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ఇవ్వడంతో మాస్ హీరోగా ఎలివేట్ కావడానికి కొన్ని సన్నివేశాలను బలవంతంగా యాడ్ చేసినట్లు అనిపించింది. ఓవరాల్‌గా అడవి శేష్ గత సినిమాల తరహాలో ఈ సినిమా పూర్తిస్థాయి సంతృప్తిని మాత్రం కలిగించదు.
హరిదాస్ పాత్రలో అడవి శేష్ కొత్తగా కనిపించాడు. మాస్ లుక్స్ కోసం ప్రయత్నించాడు. ఆరంభంలో రాయలసీమ యాస్‌ను మాట్లాడటానికి ఇబ్బంది పడిన శేష్, కొంత సమయం తరువాత కుదురుకున్నాడు. డైలాగ్ డెలివరి ఇంకా బాగుంటే సినిమాకు ప్లస్ అయ్యేది. యాక్షన్, ఎమోషన్స్ సన్నివేశాల్లో మాత్రం నటనలో మంచి మార్కులు సంపాందించుకున్నాడు. సరస్వతిగా మృణాల్ ఠాకూర్ అభినయానికి ఆస్కారమున్న పాత్రలో తన పాత్రకు న్యాయం చేసింది. ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంది. సిఐగా అనురాగ్ కాశ్యప్ మెప్పించాడు. ప్రకాష్ రాజ్, కామాక్షి, అతుల్ కులకర్ణి పాత్రలకు నటన పరంగా పెద్దగా స్కోప్ ఏమీ లేదు. వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించారు. నేపథ్య సంగీతం బలహీన సన్నివేశాల్లోనూ బలం నింపింది. ఫోటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. మేకింగ్ స్టాండర్స్ ఉన్నతంగా ఉన్నాయి.
కొత్తదనం లేని కథతో స్టయిలిష్ యాక్షన్ సన్నివేశాలతో, ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌లతో తెరకెక్కిన ఈ 'డెకాయిట్' ప్రేక్షకులను అక్కడక్కడా మెప్పిస్తుంది.
'డెకాయిట్' మూవీ రివ్యూ
Dacoit Review
Movie Details
Movie Name: Dacoit
Release Date: 2026-04-10
Cast: Adivi Sesh, Mrunal Thakur, Anurag kashyap, prakash raj
Director: Shaniel Deo
Music: Bheems Ceciroleo, Gyaani
Banner: Annapurna Studios
Review By: Maduri Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer