పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ ఉండటంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మైత్రీ బ్యానర్ .. దేవిశ్రీ - తమన్ కలిసి పనిచేసిన ప్రాజెక్టుగా ఈ సినిమా మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్ తనకి ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్రను మరోసారి పోషించిన ఈ సినిమా, 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ రోజున థియేటర్లకు వచ్చింది.
నల్లమల ఫారెస్టు ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఒక విలేజ్ అది. ఆ విలేజ్ లో ఉత్తమ అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్, (కేఎస్ రవికుమార్) రాజకీయాలలోకి అడుగుపెడతాడు. ఆ గూడానికి చెందిన 'చిన్నయ్య' అనే కుర్రాడి చురుకుదనం చూసి చేరదీస్తాడు. ఆ కుర్రాడికి 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే పేరు పెడతాడు. తాను గార్డియన్ గా ఉండి చదివిస్తాడు. ఆ సమయంలో ఉస్తాద్ నుంచి ఒక మాట తీసుకుంటాడు. ఆ తరువాత రాజకీయాలలోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్, తన ఆదర్శవంతమైన వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి అవుతాడు.
చంద్రశేఖర్ ముఖ్యమంత్రి కావడం ఉస్తాద్ కి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే నల్ల నాగప్ప ( పార్తీబన్) మాత్రం తట్టుకోలేకపోతాడు. అతను రౌడీయిజం చేస్తూ అంచలంచెలుగా ఎదిగిన వ్యక్తి. చంద్రశేఖర్ ను షూట్ చేయించిన నాగప్ప, తాను ముఖ్యమంత్రి అవుతాడు. అతని కొడుకు 'విక్కీ' గంజాయి కోసం తన స్నేహతులతో కలిసి నల్లమల ఫారెస్టు ప్రాంతానికి వెళతాడు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోతాడు.
'విక్కీ' కనిపించకుండా పోవడంతో, అతని గురించి తెలుసుకునే బాధ్యతను 'మియా భాయ్'కి అప్పగిస్తాడు నాగప్ప. 'విక్కీ'ని ఉస్తాద్ బంధించాడనే విషయం అప్పుడు అతనికి తెలుస్తుంది. నల్లమల ప్రాంతంలో ఉస్తాద్ ఏం చేస్తున్నాడు? నాగప్పతో అతనికున్న గొడవేంటి? శ్లోక (రాశి ఖన్నా) లీల (శ్రీలీల)తో అతనికి ఎలా పరిచయం అవుతుంది? వాళ్లతో అతని ప్రయాణం ఎలా సాగుతుంది? చంద్రశేఖర్ కి ఇచ్చిన మాటను ఉస్తాద్ నిలబెట్టుకుంటాడా? అనేదే మిగతా కథ.
నగరానికీ .. నల్లమల అడవికి ముడిపెడుతూ హరీశ్ శంకర్ ఈ కథను తయారు చేసుకున్నాడు. రాజకీయ నాయకులు నగరాలను తమ స్వార్థానికి స్థావరాలుగా మార్చుకుంటూ ఉంటే, వాళ్ల వారసులు అడవులను తమకి అడ్డాగా మార్చుకోవడం చుట్టూ ప్రధానమైన కథ నడుస్తుంది. అలాగే ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ ఎమోషన్స్ తో ఆడుకుంటే, దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ కథ కదులుతుంది.
అటు గతం .. ఇటు ప్రస్తుతం .. సందర్భానికి తగినట్టుగా కథ అటూ ఇటూ మారుతూ ఉంటుంది. ఈ రెండు వైపులా పవన్ మార్క్ ఉండేలా హరీశ్ శంకర్ చూసుకున్నాడు. ఫస్టాఫ్ లో రాశి ఖన్నా ఎంట్రీ ఇస్తే, సెకండాఫ్ లో శ్రీ లీల అడుగుపెడుతుంది. రాశి ఖన్నా ట్రాక్ వైపు నుంచి కామెడీ .. శ్రీలీల వైపు నుంచి రొమాన్స్ తో కూడిన ఎమోషన్స్ ను రాబడుతూ, ఆడియన్స్ లుక్స్ తెరపై నుంచి జారిపోకుండా జాగ్రత్తపడటానికి హరీశ్ శంకర్ ప్రయత్నించాడు.
ఇక విలన్ పాత్రను హరీశ్ శంకర్ డిజైన్ చేసుకున్న తీరు కాస్త కొత్తగానే ఉంది. తెరపై విలన్ పాత్ర కనిపించేది కొంతసేపే అయినా, ఆ పాత్ర ప్రభావం కథ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. యాక్షన్ తో కూడిన కామెడీతో ఫస్టాఫ్, యాక్షన్ తో కూడిన ఎమోషన్స్ తో సెకండాఫ్ నడుస్తాయి. పవన్ మార్క్ సినిమాను అందించడానికి హరీశ్ ప్రయత్నించినప్పటికీ, ఈ రెండు భాగాల్లోను అసంతృప్తిని కలిగించే కొన్ని అంశాలైతే లేకపోలేదు.
రాశి ఖన్నాకి సంబంధించిన ట్రాక్ ను కామెడీ టచ్ ఇస్తూ రాసుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ ట్రాక్ నవ్వించలేకపోయింది. కామెడీపై హరీశ్ కు గల పట్టు ఈ సారి మిస్సయిందనిపిస్తుంది. అలాగే పవన్ డాన్స్ కి .. స్టెప్పులకు సంబంధించిన సంభాషణలను అనవసరంగా లాగిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ ప్రధాన అనుచరులైన శివ - కాశీకి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది.
పల్లవి రేప్ సీన్ .. నల్ల శ్రీను ఎపిసోడ్ కూడా పరిధి దాటుకుని కనిపిస్తాయి. విలన్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ ఆయనకి తీవ్రవాదులతో లింకులు .. వాళ్లంతా రంగంలోకి దిగడం కాస్త చిరాకు పెడుతుంది. రథయాత్రలో ఉస్తాద్ ఫైట్ .. పాతబస్తీకి వెళ్లి మియా భాయ్ ముందు తొడగొట్టే సీన్ .. నల్ల నాగప్ప ఇంటికి వెళ్లి అతనికి కౌంటర్ ఇచ్చే సన్నివేశం ఈ సినిమా హైలైట్స్ గా కనిపిస్తాయి.
హరీశ్ శంకర్ రాసుకున్న ఈ కథలో కొత్తదనమేదీ కనిపించదు. పవన్ మార్క్ కంటెంట్ తో చేసిన మేజిక్ మాదిరిగా ఈ సినిమా కనిపిస్తుంది. ఆయన అభిమానుల విజిల్స్ కోసం రాసుకున్న డైలాగ్స్ వినిపిస్తాయి. 'వాడు మార్కులు తెచ్చుకునే కుర్రాడు కాదు .. మార్పులు తెచ్చేవాడు' .. 'అది భగవద్గీత .. ఇది భగత్ గీత .. అమ్మచేతి వంట అమృతం - నాన్న చేతి వంట నైవేద్యం .. గాజు (గాజు గ్లాస్) అంటే సైజ్ కాదు .. సైన్యం, 'నేను వెళ్లేది పాకిస్థాన్ కి కాదు .. పాతబస్తీకి, 'నా గ్రౌండు వర్క్ గట్టిగా ఉంటది .. నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
పవన్ కాస్త ఒళ్లుచేసి కనిపించాడు. డైలాగ్స్ లోను .. డాన్సులలోను .. ఫైట్స్ లోను తన మార్క్ చూపించాడు. ఇక విలన్ గా పార్తీబన్ నటన మెప్పిస్తుంది. రాశి ఖన్నా అందంగా కనిపిస్తే, శ్రీలీల చలాకీదనంతో అలరించింది. ఆ తరువాత రావు రమేశ్ పోషించిన 'సింగయ్య' పాత్ర మినహా, చెప్పుకునే స్థాయిలో మిగతా పాత్రలేవీ కనిపించవు. అయాంక బోస్ ఫొటోగ్రఫీ బాగుంది. దేవిశ్రీ స్వరపరిచిన రెండు బాణీలు హుషారెత్తిస్తాయి. తమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫరవాలేదు.
హరీశ్ శంకర్ - పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో, కథాపరంగా కొత్తదనమేం కనిపించదు. రొటీన్ స్టోరీనే నడుస్తూ ఉంటుంది .. అక్కడక్కడా అనవసరమైన సీన్స్ తగులుతాయి. కామెడీ పెద్దగా పేలకపోయినా, పవన్ మార్క్ కంటెంట్ తో అభిమానులను అలరించడానికి హరీశ్ తనవంతు ప్రయత్నం చేశాడనే చెప్పాలి.
'ఉస్తాద్ భగత్ సింగ్'- మూవీ రివ్యూ!
Ustaad Bhagath Singh Review
Movie Details
Movie Name: Ustaad Bhagath Singh
Release Date: 2026-03-19
Cast: Pawan Kalyan, Sreeleela, Rashi Khanna, Parthiban, Rao Ramesh, KS Ravikumar, Temper Vamsi
Director: Harish Shankar
Music: Devisri Prasad- Thaman
Banner: Mythri Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer