వరుణ్ సందేశ్ - శ్వేతాబసు ప్రసాద్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా 'కొత్త బంగారు లోకం' కనిపిస్తుంది. అప్పట్లో యూత్ ను ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది. అలాంటి ఆ సినిమా తరువాత, ఇద్దరూ ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు ముందుకు వెళ్లారు. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాగా 'నా వైఫ్ మిస్సింగ్' కనిపిస్తుంది. స్వాతిప్రకాశ్ మంత్రి ప్రగడ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'ఆహా'లో నేరుగా ఈ రోజు ( అక్టోబర్ 22)వ తేదీన విడుదలైంది.
'బాలు' (వరుణ్ సందేశ్) 'అమలాపురం'లోని ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంటాడు. ఒక రోజున బ్యాంక్ కి వచ్చిన 'స్వప్న' (శ్వేతాబసూ ప్రసాద్)ను చూసి మనసు పారేసుకుంటాడు. పేరెంట్స్ ఏర్పాటు చేసిన పెళ్లిచూపులలో ఎదురుగా స్వప్న వచ్చి కూర్చునేసరికి అతను షాక్ అవుతాడు. అయితే అతని ఆనందాన్ని పటాపంచలు చేస్తూ, తాను 'వర్జిన్' కాదని స్వప్న తేల్చిచెబుతుంది. తనకి 'అబన్' అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అంటుంది. అయినా 'బాలు' ఆమెనే చేసుకుంటాడు.
తన పరిస్థితిని తల్లిదండ్రులు .. బాలూ అర్థం చేసుకోకపోవడం పట్ల స్వప్న అసహనంతో ఉంటుంది. ఫస్టు నైట్ బాలూని దూరం పెడుతుంది. తాను తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్లిపోవాలని అనుకుంటున్నట్టుగా చెబుతుంది. తనంటే ఇష్టం లేనట్టుగా తన తల్లిదండ్రుల ముందు నటించమని అంటుంది. ఆమె చెప్పినట్టుగానే చేసి, అత్తమామలకి తనపైనే అనుమానం కలిగేలా చేస్తాడు బాలు. ఆమె తాను ఇష్టపడిన వ్యక్తితో వెళ్లిపోవడానికి అంగీకరిస్తాడు.
అయితే ఒకరోజున స్వప్నను గుడికి తీసుకువెళతాడు బాలు. ఆమె అక్కడి నుంచే అదృశ్యమవుతుంది. దాంతో అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు అతనినే అనుమానించి సెల్లో వేస్తారు. స్వప్న లవర్ 'అబన్' వచ్చి అతనికి బెయిల్ ఇప్పిస్తాడు. స్వప్న అతని దగ్గరికి వెళ్లి ఉంటుందని బాలు భావిస్తాడు. కానీ స్వప్న తన దగ్గరికి రాలేదని అతను చెప్పడంతో బిత్తరపోతాడు. ఇంతకీ స్వప్న ఏమైనట్టు? అనేదే కథ.
తన భార్య కనిపించకుండా పోయిందంటూ ఒక భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం, పోలీసులు అతనినే అనుమానించడం .. అతని కదలికలపై నిఘా పెట్టడం వంటి కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఇక కొత్తగా తన జీవితంలోకి అడుగుపెట్టిన భార్య, వేరొకరిని ప్రేమిస్తుందని తెలిసి ఆమెను అక్కడికి పంపించడానికి అంగీకరించడం వంటి సన్నివేశాలు కూడా తెరపై చూసినవే. అలాంటి ఒక కథనే ఇది.
ఇష్టం లేకుండా బాలూని స్వప్న పెళ్లి చేసుకోవడం .. ఆమె అతణ్ణి టార్చర్ చేయడం .. అతను భరిస్తూ వెళ్లడం వంటి సన్నివేశాలు ఫస్టాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఇక ఆమె కనిపించకుండా పోవడంతో హీరో వెతుక్కుంటూ వెళ్లడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
సాధారణంగా వివాహమైన తరువాత కొంతమంది అమ్మాయిలు బాంబ్ పేలుస్తుంటారు. తాను వర్జిన్ కాదనీ ... తాను ఆల్రెడీ వేరొకరిని లవ్ చేస్తున్నాననీ .. తాను అతనితో వెళ్లిపోతానని. అయితే పెళ్లిచూపులలోనే చాటుకు పిలిచి ఈ విషయాలన్నీ చెబుతుంది స్వప్న. అయినా హీరో ఆమె మెడలో సంతోషంగా తాళి కడతాడు. ఫస్టు నైట్ ఆమె దగ్గరికి రానీయకపోయినా, దిండూ దుప్పటి తీసుకెళ్లి ఓ మూలాన సర్దుకుంటాడు.
స్వప్న తల్లిదండ్రుల ముందు తన వ్యక్తిత్వమే సరైనది కాదనేలా నాటకమాడతాడు. ఇవన్నీ అతను ఎందుకు చేస్తున్నట్టు అనే అనుమానం మనకి మాత్రమే కాదు, స్వప్న లవర్ కి కూడా వస్తుంది. ఈ ప్రశ్నలన్నింటికీ మనకి ఒక ఆన్సర్ దొరుకుతుందేమోనని అనుకుంటాము. నిజంగానే హీరో అంతటి విశాల హృదయంతో ప్రవర్తించడం వెనుక బలమైన కారణం ఏదో ఉందని భావిస్తూ .. అదేంటో చూద్దామని వెయిట్ చేస్తాము. ఆ కారణం మరేదో కాదు .. ఆమె పట్ల అతనికి గల ప్రేమనే అని తెలిసినప్పుడు ఆడియన్స్ పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదనుకుంటా.
వరుణ్ సందేశ్ .. శ్వేతా బసు ప్రసాద్ తమ పాత్రలలో బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనీ .. తాను వర్జిన్ కాదని చెప్పిన అమ్మాయిని హీరో పెళ్లి చేసుకుంటాడు. ఫస్టు నైట్ రోజున హ్యాపీగా ఆమె గదిలోకి అడుగుపెడతాడు. తనని ఆమె దూరం పెట్టి .. ఆ తరువాత బాయ్ ఫ్రెండ్ ను కలిస్తే ఊరుకుంటాడు. ఆమె కోసం తన కేరక్టర్ పై మచ్చ వేసుకుంటాడు. ఇవన్నీ హీరోకి గల గొప్ప లక్షణాలని అనుకున్నారేమో తెలియదు గానీ, ఆడియన్స్ మాత్రం ఈ త్యాగాల చిట్టాను తట్టుకోలేరనే చెప్పాల్సి ఉంటుంది. కొత్తదనం పేరుతో వాస్తవాలకు దూరంగా వెళితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా చూస్తే అర్థమైపోతుంది. మితిమీరిన త్యాగాలు తెరపై చూపిస్తే సదరు హీరో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు .. కథను కూడా దెబ్బతీస్తాయని మరిచిపోకూడదు.
'నా వైఫ్ మిస్సింగ్' (ఆహా) మూవీ రివ్యూ!
Na Wife Missing Review
Movie Details
Movie Name: Na Wife Missing
Genre: Thriller
Release Date: 2026-10-22
Cast: Varun Sandesh, Swethabasu Prasad, Praveen, Sathya Sri
Director: Swathi Prakash
PRO: -
Music: Sai Karthik
Banner: Light House Cine Magic
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer