కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న కథానాయకుడు సుహాస్ నటించిన తాజా చిత్రం 'హే బల్వంత్'. మొదట్లో 'హే భగవాన్' టైటిల్‌తో ప్రచారం జరుపుకున్న ఈ చిత్రాన్ని సెన్సారు సభ్యుల అభ్యంతరం మేరకు' హే బల్వంత్'గా మార్చడం జరిగింది. ప్రచార చిత్రాలతో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ సినిమాతో సుహాస్ విజయం దక్కిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కృష్ణ (సుహాస్) ఎప్పటికైనా నాన్న రావు బల్వంత్ (నరేష్) బిజినెస్‌ను టేకప్ చేయాలని ఆశపడుతుంటాడు. కానీ బల్వంత్కు కొడుకు వ్యాపారం అప్పజెప్పడం ఇష్టం ఉండదు. కానీ కృష్ణ మాత్రం ఎప్పటికైనా ఆయన చేసే బిజినెస్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటాడు.అయితే అందుకోసం బిజినెస్‌లో సరైన అనుభవం రావడం కోసం కొంత మందికి బిజినెస్ సలహాలు ఇస్తుంటాడు. ఆ క్రమంలోనే మిత్ర (శివానీ) పరిచయమవుతుంది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈలోపు రావు బల్వంత్కు ఆరోగ్య సమస్య రావడంతో బిజినెస్ కృష్ణ చేతుల్లోకి వెళుతుంది. నాన్న బిజినెస్ ఏంటో తెలుసుకున్న కృష్ణ షాక్ తింటాడు. ఆశలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. ఇందువల్ల ప్రేమించిన అమ్మాయి మిత్ర కూడా దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకి రావు బల్వంత్ బిజినెస్ ఏమిటి? అందువల్ల కృష్ణ జీవితంలో వచ్చిన మార్పులేమిటి? ఈ బిజినెస్‌కు చంప (స్రవంతి)కి సంబంధమేమిటి? చివరకు ఏం జరిగింది? మిత్ర, కృష్ణలు కలిశారా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రతి అబ్బాయికి జీవితంలో నాన్నే ఇన్స్పిరేషన్. ఈ క్రమంలోనే తండ్రిని అలా భావించే అబ్బాయికి, తండ్రి బిజినెస్ టేకోవర్ చేసి జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ తండ్రి మాత్రం అబ్బాయి కోసం ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుతూ భరిస్తూ, తనలాంటి కష్టం కొడుకుకు రాకుండా అతనికి మంచి జీవితం ఇవ్వాలని తపన పడే తండ్రి, అయితే తండ్రి వ్యాపారం గురించి తెలుసుకున్న తరువాత కొడుకు ఎలా స్పందించాడు అనేది ఈ చిత్ర కథ. ఇలాంటి కథకు పూర్తి వినోదాన్ని, కాస్త ఎమోషన్‌ను జోడించి దర్శకుడు గోపీ ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా మొదటి సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకు సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది.
కమెడియన్ సుదర్శన్, నటుడు సుహాస్, హీరోయిన్ సుదర్శన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆద్యంతం నవ్వులు పండిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్ ప్రకృతి వైద్యం ఎపిసోడ్లో ఆయన పాత్ర రాగానే థియేటర్ అంతా నవ్వులతో ఊగిపోతుంది. కిషోర్ వెన్నెల సూర్య నారాయణగా కడుపుబ్బా నవ్వించాడు. సినిమా ఆద్యంతం కిషోర్, సుదర్శన్‌ల వన్‌లైనర్ పంచ్‌లు బాగా పండాయి. సెకండాఫ్‌లో కూడా కథ ఆసక్తికరంగానే మొదలై నవ్వులతో ముంచెత్తుంది. ఇక చివరి పదిహేను నిమిషాలు సుహాస్, నరేష్‌ల మధ్య చిత్రీకరించిన భావోద్వేగ సన్నివేశాలు అందరి హృదయాలను హత్తుకుంటాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే ప్రధానంగా తొలిసగాన్ని రాసుకున్నదర్శకుడు సెకండాఫ్‌లో ఎమోషనల్ సన్నివేశాలను కూడా బాగానే డీల్ చేశాడు. హీరో తమ బిజినెస్‌ను హీరోయిన్‌కు తెలియకుండా దాచేందుకు పడ్డ మదన, సుహాస్, సుదర్శన్‌ల మందు సిట్టింగ్‌లో వచ్చే సంభాషణలు పొట్టచెక్కలు అయ్యేలా నవ్విస్తాయి.
సెకండాఫ్‌లో హీరోయిన్ తాతకు చావుకు కథను ముడిపెట్టిన విధానం కూడా అలరిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో నరేష్ హీరో మహేష్‌బాబుని, నందమూరి బాలకృష్ణను అనుకరిస్తూ చేసిన సన్నివేశాలు ఆడియన్స్‌కు థ్రిల్ల్‌ను కలిగిస్తాయి. ముఖ్యంగా సినిమా కథలో కీలకమైన వ్యాపారం గురించి, దానిని చేయడం వెనుక దాగి ఉన్న నిజం గురించి దర్శకుడు చాలా కన్వీన్సింగ్‌గా చెప్పగలిగాడు. ఇక్కడ ఏ మాత్రం తడబడిన సినిమా ఫలితం మరోలా ఉండేది. ఈ విషయంలో దర్శకుడు ప్రతిభను మెచ్చుకోవాల్సిందే.
గత కొంతకాలంగా సీరియస్ పాత్రల్లో నటిస్తున్న సుహాస్ ఈ సినిమాలో తొలిసారిగా ఎంటర్టైన్మెంట్ పాత్రలో ఎనర్జీగా కనిపించాడు. కృష్ణ పాత్రలో వినోదాన్ని, ఎమోషన్‌ను పండించి నటుడిగా మంచి మార్కులే సంపాందించుకున్నాడు. మిత్రగా శివానీ నటన ఎంతో ముచ్చటగా అనిపించింది. ప్రతి సన్నివేశంలో ఆ సిట్యుయేషన్ తగ్గట్గుగా ఆమె ఇచ్చిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అలరిస్తాయి. నరేష్ లైబ్రరీలో రావు బల్వంత్ పాత్ర మరో మెమెరబుల్ పాత్రగా ఉండిపోతుంది. సుదర్శన్, వెన్నెల కిషోర్ తమ సహజ శైలిలో థియేటర్ మొత్తం నవ్వులు పూయించారు.
స్రవంతి పాత్ర కథలో కీలకంగా ఉన్నా, ఆమె పాత్రను ఇంకాస్త ఎమోషనల్‌గా డిజైన్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. హర్షవర్థన్, అన్నపూర్ణమ్మ తమ పాత్రలకు న్యాయం చేశారు. బాబుమోహన్ పాత్రకు డైలాగులు లేకపోయినా ఆయన ఫేస్‌లో ఉండే ఎక్స్ప్రెషన్ నవ్వులు పండించాయి. దర్శకుడు తను రాసుకున్న ఇలాంటి కథను ఎటువంటి అశ్లీలత లేకుండా తెరకెక్కించడంలో అతని ప్రతిభ తెలుస్తుంది. పాటలు పర్వాలేదనిపించుకున్నా, నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాల్లో బలాన్ని నింపింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
అక్కడక్కడా రచనా పరంగా లోపాలున్నా, ఎటువంటి లాజిక్‌లు ఆలోచించకపోతే వినోదాన్ని కోరుకునే వాళ్లకు 'హే బల్వంత్' పూర్తిస్థాయి సంతృప్తినిస్తుంది. ఈ వీకెండ్ 'హే బల్వంత్' మంచి టైమ్ పాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది.
'హే బల్వంత్' సినిమా రివ్యూ
Hey Balwanth Review
Movie Details
Movie Name: Hey Balwanth
Release Date: 2026-02-20
Cast: Suhas, Shivani Nagaram,Harsha Vardhan, Ajay Ghosh, Naresh, Vennela Kishore, Sravanthi
Director: Gopi Atchara
Music: Vivek Sagar
Banner: Trishul Visionary Studios
Review By: Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer