'మరువ తరమా' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!



ప్రేమకథలకు ఎప్పడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే సినిమాలను చూసేది యూత్. వారు కోరుకునే కంటెంట్ లవ్. అందువలన ఫీల్ తో కూడిన కంటెంట్ ను వాళ్లకి కనెక్ట్ చేయగలిగితే చాలు, ఆ ప్రేమకథలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి ఒక ప్రేమకథా చిత్రంగా 'మరువ తరమా' కనిపిస్తుంది. చైతన్య వర్మ దర్శకత్వం వహించిన సినిమా ఇది. క్రితం ఏడాది నవంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 'ఈటీవీ విన్'లో ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

అన్వీ (అతుల్య) శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. తల్లి లేని పిల్ల కావడం వలన గారాబంగా పెరుగుతుంది. అమ్మమ్మ దగ్గర కొన్ని రోజులు గడపడం కోసం వెళ్లిన ఆమె, ఆ ఊర్లో 'రిషి' (హరీశ్ ధనుంజయ)ని చూస్తుంది. అతనిని చూడగానే ఆకర్షితురాలవుతుంది. రిషి అలవాట్లు .. అభిరుచులు తెలుసుకుని అతనిని ఆరాధించడం మొదలుపెడుతుంది. రిషి విషయానికి వస్తే, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి సంగీత పాఠాలు చెబుతూ అతనిని పెంచుతుంది. 

రిషికి హైదరాబాదులో జాబ్ వస్తుంది. దాంతో అతను తెలిసిన ఫ్యామిలీ అయిన 'గీత' వాళ్లకు తల్లిని బాధ్యతను అప్పగించి హైదరాబాద్ వెళ్లిపోతాడు. ఒక ఏడాది తరువాత మళ్లీ అమ్మమ్మ ఇంటికి వచ్చిన 'అన్వీ'కి రిషి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలుస్తుంది. ఫలానా కంపెనీలో పనిచేస్తున్నాడని అతని స్నేహతుల ద్వారా తెలుసుకుంటుంది. ఫారిన్ లో ఎమ్మెస్ చేయాలనుకున్న ఆమె, ఆ ఆలోచనను విరమించుకుంటుంది. 

హైదరాబాదులో రిషి పనిచేస్తున్న ఆఫీసులో చేరాలని అనుకుంటుంది. తండ్రితో సిఫార్స్ చేయించి అందులో జాబ్ దక్కించుకుంటుంది. అన్వీ తనని ప్రేమిస్తుందని తెలియని రిషి, ఆమెను గురించి పెద్దగా పట్టించుకోడు. ఆల్రెడీ అతను సింధు (అవంతిక) ప్రేమలో ఉన్నాడనీ, అలిగి వెళ్లిపోయిన ఆమె కోసం అతను ఎదురుచూస్తూ ఉన్నాడనే విషయం అన్వీకి తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? సింధు - రిషి మధ్య గొడవేంటి? చివరికి రిషి ఎవరి జీవితంలో భాగమవుతాడు? అనేది కథ. 

'ప్రేమ' అనేది రెండు అక్షరాలే .. కానీ ప్రళయాన్ని సృష్టించగల శక్తి దానికి ఉంటుంది. వయసులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ ప్రేమ ఒక కొత్త పరిచయమే. అసలు ఈ ప్రపంచాన్ని మరింత అందంగా చూపించేదే ప్రేమ అనేది యూత్ మాట. ప్రేమను టచ్ చేయకుండగా పెళ్లి దిశగా వెళ్లేవారు ఈ జనరేషన్ లో చాలా తక్కువగా కనిపిస్తారు. అలాంటి ఒక ప్రేమకథ చుట్టూ అల్లుకున్న కథ ఇది. రిషి - అన్వీ - సింధు అనే మూడు పాత్రలను ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ కథను నడిపించాడు. 

ఎంత డబ్బు ఉన్నప్పటికీ తను ప్రేమించిన వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లేవారు కొందరైతే, డబ్బు కోసమే ప్రేమను నటిస్తూ వెళ్లేవారు మరికొందరు. ఏది నిజమైన ప్రేమ? అనేది తెలుసుకోలేని పరిస్థితులలో మరికొందరు ఉంటారు. ఇలాంటి స్వభావాలు కలిగిన పాత్రల చుట్టూనే దాదాపుగా ఈ కథ తిరుగుతుంది. యూత్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ దొరికేస్తూ ఉంటుంది. ఇక హీరో తల్లి వైవు నుంచి రాసుకున్న ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. 

తల్లిని ప్రేమించేవారి ప్రేమలో స్వార్థం ఇమడదు. అలాగే మూగ జంతువులను ఇష్టపడే అమ్మాయిల మనసులకి కల్మషం తెలియదు. స్వచ్ఛమైన మనసులను కొలవడానికి ఇంతకుమించిన కొలమానాలు మనకి కనిపించవు. దర్శకుడు చాలా సున్నితంగా ఈ అంశాలను టచ్ చేశాడు. హెవీ ఎమోషన్స్ ఆడియన్స్ పై రుద్దకుండా, ఒక చిన్నపాటి పెయిన్ ను క్రియేట్ చేయగలిగాడు. 

అయితే ఇంతవరకూ చూస్తూ వచ్చిన ప్రేమకథలకు భిన్నంగా గానీ .. కొత్తగా గాని ఈ సినిమా మనకి కనిపించదు. చెప్పదలచుకున్న కథ చాలా నిదానంగా .. నింపాదిగా తెరపై కదులుతూ ఉంటుంది. ఈ జనరేషన్ కి అది సాగతీతగా అనిపించకుండా ఉండదు. ఇక తరువాత జరగబోయేదేమిటో కూడా ఆడియన్స్ కి ముందుగానే తెలిసిపోయేలా రాసుకోవడం మరో మైనస్ గా చెప్పుకోవలసి ఉంటుంది.

ప్రేమకథలకు ప్రధానమైన ఆకర్షణ వర్షమే. కొన్ని సన్నివేశాలను వర్షం నేపథ్యంలో ఆవిష్కరిస్తూ వాటిని కనెక్ట్ చేసిన తీరు బావుంది. హీరో ఆఫీస్ నేపథ్యంలోని సన్నివేశాలను ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగే కామెడీ టచ్ కూడా కాసింత పెంచాల్సింది.   

ప్రేక్షకులకు తెలిసిన కథనే అయినా .. మలుపులను వాళ్లు గెస్ చేసే కథనే అయినా .. ఆడియన్స్ కి ఈ సినిమా పెద్దగా బోర్ అనిపించదు. అందుకు కారణం సంగీతం. ఈ సినిమాకి సంబంధించినంత వరకూ మొదటి మార్కులు దక్కేది సంగీతానికే అని చెప్పాలి. విజయ్ బుల్గానిన్ అందించిన బాణీలు .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఒక ప్రేమకథకు అవసరమైన ఫీల్ ను ఆయన వర్కౌట్ చేయగలిగాడు. అలాగే రుద్రసాయి ఫొటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వైవు నుంచి చూస్తే మాత్రం అక్కడక్కడా కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. 

హరీశ్ ధనుంజయ్ .. అతుల్య .. అవంతిక .. ఎవరి పాత్రల పరిధిలో వారు నటించారు. రోహిణి సీనియర్ ఆర్టిస్ట్. ఆమె నటన గురించి చెప్పుకోవలసిన పనిలేదు. మిగతా పాత్రలు కొన్ని కనిపిస్తాయి గానీ, తెరపై అవి చూపించే ప్రభావం ఏమీ లేదు. ఇలాంటి ప్రేమకథలు గతంలో చాలానే వచ్చినప్పటికి, ఫీల్ తో కూడిన ఆవిష్కరణ మెప్పిస్తుందని చెప్పాలి. 

Movie Details

Movie Name: Maruva Tarama

Release Date:

Cast: Harish Dhanunjay, Avanthika, Athulya, Rohini, Anand

Director: Chaitanya Varma

Producer: Ramanamurthy- Vjay Kumar Raju

Music: Vijay Bulganin

Banner: Silver Screen Pictures

Maruva Tarama Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews