జనవరిలో థియేటర్లకు వచ్చిన చిన్న సినిమాల జాబితాలో 'వనవీర' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాకి అవినాశ్ తిరువీధుల కథానాయకుడు .. ఆయనే దర్శకుడు. ప్రతినాయకుడిగా 'నందూ' నటించిన ఈ సినిమా, జనవరి 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా హఠాత్తుగా 'అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్' పైకి ఈ నెల 13వ తేదీన వచ్చింది. సిమ్రన్ చౌదరి కథానాయికగా నటించిన సినిమా ఇది.
అది 'వనపురం' అనే గ్రామం. చూడటానికి చిన్న గ్రామంగానే కనిపించినప్పటికీ, రాజకీయంగా చాలా కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. రఘు (అవినాశ్) అదే విలేజ్ లో తన తండ్రి సూరిబాబు (శివాజీరాజా)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. ఐఐటీ చదివిన రఘు, ఊరికి దూరంగా వెళ్లిపోయి మంచి జాబ్ చేయాలనేది సూరిబాబు కోరిక. రఘు అన్నయ్య 'సూర్య' మాత్రం 'దుబాయ్' లో జాబ్ చేస్తూ ఉంటాడు. రఘు మేనత్త (ఆమని) దంపతులు అదే ఊర్లో నివసిస్తూ ఉంటారు. మేనత్త కూతురు 'ఇందు' ( సిమ్రన్ చౌదరి) రఘు ప్రేమించుకుంటూ ఉంటారు.
ఆ ఊళ్లో రాజకీయంగా ఎదగడానికి 'రామచంద్రరావు' వారసుడిగా 'దేవా'(నందూ) ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ప్రధాన అనుచరులుగా బసవ - గురూ వ్యవహరిస్తూ ఉంటారు. స్థానికంగా తనకి గల ఇమేజ్ ను చూపించుకోవడం కోసం, దేవా బైక్ ర్యాలీ తీస్తాడు. అందుకోసం రఘు బైక్ ను కూడా తీసుకుంటాడు. రఘుకి తన బైక్ అంటే చాలా ఇష్టం. అలాంటి బైక్ ను తిరిగి రఘుకి ఇవ్వడానికి దేవా అనుచరులు నానా తిప్పలు పెడుతూ ఉంటారు.
ఆ బైక్ కోసం దేవా అనుచరులు చెప్పిన పనులు చేస్తూ, రఘు అక్కడే ఉంటూ ఉంటాడు. ఆ సమయంలోనే దేవాకి గల కులపిచ్చిని రఘు దగ్గర నుంచి చూస్తాడు. అయితే దేవాకి ప్రతికూలంగా కొన్ని పనులు జరుగుతూ ఉండటంతో, అతని అనుచరులకు రఘుపై అనుమానం కలుగుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? దేవాతో రఘుకి ఉన్న అసలు గొడవేంటి? దేవా నుంచి ఆ గ్రామాన్ని రఘు రక్షించగలుగుతాడా? అనేది మిగతా కథ.
గ్రామీణ రాజకీయాలు .. స్థానిక రాజకీయాలు తమ గుప్పెట్లోనే ఉండాలనే కొందరు వారసుల ఆధిపత్యం .. కులం పేరుతో కొందరిని తక్కువగా చూడటం .. అవసరానికి మాత్రమే వారిని ఉపయోగించుకోవడం .. అవసరమైతే హత్యలకు సైతం వెనుకాడకపోవడం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథ అంతా ఒక కారణంగా నడుస్తూ ఉంటుంది. కనిపించని రెండో కారణమే అసలైన ట్విస్ట్.
ఈ కథ పూర్తిగా విలేజ్ నేపథ్యంలోనే నడుస్తుంది. ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే, హీరో మినహా మిగతా వాళ్లంతా కాస్త పరిచయం ఉన్నవారే. విలేజ్ .. కుటుంబాలు అంటే సహజంగానే ఎమోషన్స్ ఉంటాయని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. నిజంగానే ఆ వైపు నుంచి ఎమోషన్స్ ను టచ్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే అవి పాత వాసనలతో రొటీన్ గా అనిపిస్తాయి. ఎక్కడ మనసుకు పట్టుకోవడానికి ప్రయత్నించినట్టుగా కనిపించవు.
సాధారణంగా హీరో ఓ మాదిరి స్టైల్లో ముందుకు వెళుతూ ఉంటే, మొత్తానికి ఇతగాడు ఏదో చేయబోతున్నాడు అనే ఒక కుతూహలం ఆడియన్స్ కి కలగాలి. కానీ అతను అసలు విషయాన్ని దాచేసి ప్రవర్తిస్తున్న తీరు కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇంత చిన్న కారణానికి ఎవరైనా ఇలా చేస్తారా? అనేసి హీరో ఆలోచన విధానంపై ప్రేక్షకులకు డౌట్ వచ్చేలా ఉంటుంది.
విలేజ్ .. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాలు .. ప్రేమలు వంటి అంశాలు ప్రధానమైన కథకి జోడిస్తే మరికాస్త బెటర్ గా ఉండేదేమో. అలా కాకుండా దర్శకుడు కేవలం రాజకీయాలు - కులపిచ్చి అనే అంశాలపై మాత్రమే పూర్తి ఫోకస్ పెట్టాడు. పోనీ దానికైనా పూర్తి న్యాయం చేయగలిగారా అంటే అదీ లేదు. సాగతీత సన్నివేశాలతోనే సరిపెట్టారు.
పృథ్వీ .. కోన వెంకట్ .. శివాజీ రాజా .. ఆమని .. ఇలా చూడటానికి మంచి తారాగణమే కనిపిస్తుంది. కాకపోతే వారి పాత్రలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. కామెడీ వైపు నుంచి చమ్మక్ చంద్ర - రచ్చరవి - సత్య కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లవ్ .. రొమాన్స్ కి అవకాశం ఉన్నప్పటికీ అటు వైపు తొంగి చూసే ప్రయత్నం కూడా చేయలేదు. హీరో - విలన్ పాత్రల మధ్య ఏ మాత్రం కొత్తదనం లేకుండా జరుగుతున్న పొలిటికల్ డ్రామాను అలా చూస్తూ కూర్చోవాలంతే. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే.
ఈ మధ్య కాలంలో చాలా కథలను యుగాలను దాటించి తీసుకెళ్లి మరీ పురాణాలతో .. ఇతిహాసాలతో ముడిపెడుతున్నారు. అలా త్రేతాయుగంతో .. రామాయణ కాలంతో ముడిపెడుతూ ఈ కథను మొదలుపెట్టారు. ఇలాంటి ఒక ప్రయత్నంలో సహజత్వం .. బలం లేకపోతే, ఈ మాత్రం దానికి ఇంతా లీడ్ అవసరమా అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలాగే అనిపిస్తుంది.
ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే, ముందుగా ఏదో టైటిల్ అనుకుని ఆ తరువాత ఇలా మార్చినట్టు ఉన్నారు. 'వనవీర' అనగానే ఈ కథ అడవిలో నడుస్తుందేమో .. కథానాయకుడు అడవిని కాపాడే వీరుడేమో అనే ఫీలింగ్ కూడా రాకుండా ఉండదు. ఏ వైపు నుంచి చూసినా పెద్దగా విషయం లేని ఒక రొటీన్ కంటెంట్ ఇది.
'వనవీర' (అమెజాన్ ప్రైమ్) రివ్యూ!
Vanaveera Review
-
Movie Details
Movie Name: Vanaveera
Release Date: 2026-02-13
Cast: Avinash Thiruveedhula,Simran Choudhary ,Nandu ,Aamani,Satya,Kona Venkat,Sivaji Raja
Director: Avinash Thiruveedhula
Music: Vivek Sagar
Banner: Silver Screen Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer