'కానిస్టేబుల్'(ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

-
వరుణ్ సందేశ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'కానిస్టేబుల్'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి ఆర్యన్ శుభాన్ దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది అక్టోబర్ 10వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మధులిక వారణాసి కథానాయికగా పరిచయమైన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

 'మోకిల' పోలీస్ స్టేషన్ లో కాశీ (వరుణ్ సందేశ్) పోలీస్ కానిస్టేబుల్ పనిచేస్తూ ఉంటాడు. అక్క (కల్పలత) బావ (సూర్య) మేనకోడలు 'కీర్తి'తో కలిసి అతను నివసిస్తూ ఉంటాడు. అక్కడ  స్థానిక రాజకీయనాయకుడిగా జనార్ధన్ (రవివర్మ) ఉంటాడు. ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎస్ ఐ గా ఉన్న 'గిరిధర్' తో జనార్ధన్ కి మంచి సంబంధాలు ఉంటాయి. అందువలన గిరిధర్ కి ఆ స్టేషన్లో అందరూ భయపడుతూ ఉంటారు. 

 ఆ పోలీస్ స్టేషన్లో కాశీతో పాటు భద్రం (దువ్వాసి మోహన్) మహతి (మధులిక వారణాసి) కూడా కానిస్టేబుల్స్ గా పనిచేస్తూ ఉంటారు. కాశీపై మహతి మనసు పడుతుంది గానీ, ఆ విషయాన్ని పైకి చెప్పలేకపోతుంటుంది. జనార్ధన్ కొడుకు 'అభి' కాలేజ్ లో ఒక రౌడీ మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతను కాశీ మేనకోడలు కీర్తిని వశపరచుకోవడానికి ప్రయత్నించి ఆమె చేతిలో అవమానం పాలవుతాడు. ఆ మరుసటి రోజునే కీర్తి డెడ్ బాడీ పొలిమేరలో కనిపిస్తుంది.

కీర్తి చనిపోవడానికి ముందు ఆమెకి అభితో గొడవ జరిగినట్టుగా కాశీకి తెలుస్తుంది. అభి కోసం అతని ఇంటికి వెళ్లిన కాశీపై జనార్ధన్ మండిపడతాడు. ఆ మరుసటి రోజు అభి అత్యంత దారుణంగా హత్య  చేయబడతాడు. తన కొడుకుని కాశీ హత్య చేశాడని భావించిన జనార్ధన్ పగ పెంచుకుంటాడు. కాశీని అంతం చేయించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. కీర్తిని అభి చంపాడా? లేదంటే కీర్తిని చంపినవారే అభిని కూడా చంపారా? అనేది తెలుసుకోవడానికి కాశీ రంగంలోకి దిగుతాడు.అప్పుడు ఆయనకి తెలిసే నిజాలేమిటి? అనేది కథ.

కొంతకాలంగా చిన్న సినిమాలన్నీ కూడా చాలా వరకూ విలేజ్ నేపథ్యంలోనే కొనసాగుతున్నాయి. స్థానికత కారణంగా ఈ తరహా కథలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి కూడా. అలా ఈ సినిమా కూడా విలేజ్ నేథ్యంలోనే నడుస్తుంది. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు .. వారికి పోలీస్ పెద్దల అండదండలు .. ఆ రాజకీయనాయకుల పిల్లల దూకుడు .. ఫలితంగా అమ్మాయిలు ఇబ్బందిపడటం వంటి సంఘటనలతో ఈ కథను మొదలుపెట్టిన తీరు బాగానే ఉంది.

ఒకే కాలేజ్ లో జరుగుతున్న స్టూడెంట్స్ ఎందుకు హత్యలకు గురవుతున్నారు? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే అంశంగా కనిపిస్తుంది. అయితే ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే విషయం తెలుసుకోవాలనుకున్న ఆడియన్స్, ఆ నిజాలు బయటపడుతున్నప్పుడు నీరుగారి పోతారు. హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేశాడు? అందుకు గల కారణాలు ఏమిటి? అనేవి చప్పగా అనిపిస్తాయి.

ఈ కథలో ప్రధానమైనవిగా మూడు పాత్రలు కనిపిస్తాయి. కానిస్టేబుల్ గా హీరో .. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఎస్ ఐ .. స్థానిక రాజకీయనాయకుడు. అయితే జరుగుతున్న సంఘటనల విషయంలో ఈ మూడు పాత్రలు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయి. పోలీస్ అధికారి - రాజకీయనాయకుడు కలిసి మున్ముందు చాలా చేయనున్నారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. కానీ ఆ తరువాత వాళ్లు తెరపై నుంచి ఎప్పుడు తప్పుకున్నారనేది కూడా గుర్తుండదు. 

 ఇక హీరో ఒక రేంజ్ లో చక్రం తిప్పేస్తాడని అనుకుంటే అది పొరబాటే. బైక్ వేసుకుని ఊర్లో తిరగడం తప్ప ఆయన చేసేదేమీ ఉండదు. ఇక ఆయనను ఆరాధిస్తున్నట్టుగా కనిపించే 'మహతి' పాత్ర .. ఆమె ఎంట్రీ చూసి, వీళ్లిద్దరి మధ్య లవ్ మ్యాటర్ మామూలుగా ఉండదని అనుకుంటారు. కనీసం మొహమాటానికి కూడా హీరో ఆమె వైపు చూడడు పాపం. ఆమె పాత్ర తెరపై అలా పడి ఉంటుందంతే. లవ్ .. రొమాన్స్ ఏ మాత్రం పట్టని పాత్రలవి.            

 దర్శకుడు ఈ కథను ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో తీసుకుని వెళ్లి తగిలించాడు.సెకండాఫ్ కొత్తగా ఉంటుందని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ ట్రాక్ కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోడం వలన, ఆ పాత్రలను పోషించినవారి యాక్టింగ్ ను గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. షేక్ హజరత్తయ్య ఫొటోగ్రఫీ .. గ్యాని నేపథ్య సంగీతం .. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. 

తెరపై వరుస హత్యలు జరిగే తీరు .. పోలీసుల వైపు నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. హంతకుడు ఎవరు? .. ఎందుకు చేస్తున్నాడు? అనేది తెలుసుకోవడం కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోకూడదు. చప్పున చల్లారిపోకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే, విలేజ్ నేపథ్యంలో రొటీన్ గా నడిచే కథ ఇది. క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ పెద్దగా ప్రభావితం చేయలేకపోయిన కంటెంట్ ఇది.     

Movie Details

Movie Name: Constable

Release Date:

Cast: Varun Sandesh, Madhulika Varanasi, Surya, Kalpalatha, Muralidhar Goud, Ravi Varma

Director: Aryan Subhan

Producer: Balagam Jagadish

Music: Gyaani

Banner: Jagruthi Move Makers

Constable Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews