బుల్లి తెరపై నుంచి వెండితెర వరకూ ఎదిగిన నటులలో కెవిన్ రాజ్ ఒకరుగా కనిపిస్తాడు. కథానాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కెవిన్, నయనతారతో కలిసి నటించిన సినిమానే 'హాయ్'. విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 28వ తేదీన విడుదలైంది. రాధిక . ప్రభు .. భాగ్యరాజ్ .. సుహాసిని కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ భాషల్లో ఈ రోజు (సెప్టెంబర్ 25) నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది.
సుబ్రమణ్యం (కెవిన్) ఒక రకంగా కలవారి కుటుంబానికి చెందిన అబ్బాయే. ప్రమీల దంపతులు ( రాధిక - భాగ్యరాజ్) సుబ్రమణ్యానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది సుబ్రమణ్యానికి ఉన్న కోరిక. తాను ఇష్టపడిన అమ్మాయిలు తనని ఎంతమాత్రం పట్టించుకోకపోవడం అతనికి చాలా అసంతృప్తిని కలిగిస్తుంది. అందువలన తనకి తగిన అమ్మాయికి కోసం వెతుక్కుంటూ అతను హైదరాబాద్ కి చేరుకుంటాడు. అక్కడే ఒక సంస్థలో జాబ్ చేస్తూ ఉంటాడు.
ఇక దేవసేన (నయనతార) తండ్రి చంద్రం (ప్రభు) ఒక తాగుబోతు. భార్య ఇల్లొదిలి వెళ్లిపోయిన దగ్గర నుంచి అతను తాగుడికి బానిస అవుతాడు. తన కోసం భార్య తప్పకుండా తిరిగొస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. తాగుడు కోసం అతను చేసిన అప్పు తీర్చమని దొరబాబు ఒత్తిడి చేస్తుంటాడు. లేదంటే దేవసేనను తనకిచ్చి పెళ్లి చేయమని పోరుతుంటాడు. ఈ నేపథ్యంలో దేవసేన పారిపోయి హైదరాబాద్ కి చేరుకుంటుంది. అక్కడే ఆమెకి 'సుబ్బు' తారసపడతాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.
దేవసేనతో సాన్నిహిత్యం పెరుగుతున్నా కొద్దీ సుబ్బూకి ఆమెపై ప్రేమ పెరిగిపోవడం మొదలవుతుంది. ఆమె పట్ల తనకి గల ప్రేమను బయటపెట్టే సమయం కోసం అతను ఎదురుచూస్తుంటాడు. అయితే సుబ్బు పట్ల దేవసేన స్నేహంగా మాత్రమే ఉంటుంది. జీవితంలో స్థిరపడటం కోసం 'లండన్' వెళ్లే ప్రయత్నాలలో ఉంటుంది. తన మనసులోని మాటను సుబ్బు చెప్పలేడు .. ఆమెను ఆపలేడు. అలాంటి పరిస్థితులలో అతను సతమతమైపోతుంటాడు.
సుబ్బు - దేవసేన లేచిపోయారనీ, ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారనే విషయం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. దాంతో వాళ్లంతా ఒక్కసారిగా వచ్చేసి ఇద్దరినీ నిలదీస్తారు. ఆ కంగారులో సుబ్బు, తాను దేవసేనను ప్రేమిస్తున్నాననీ .. తన కారణంగా ఆమె నెల తప్పిందని చెబుతాడు. దాంతో చంద్రం చేసిన అప్పు తీర్చేసి, దేవసేనను తమ కోడలిగా చేసుకోవడానికి ప్రమీల దంపతులు అంగీకరిస్తారు. అప్పుడు దేవసేన ఏం చేస్తుంది? ఆమె తల్లి ఇల్లొదిలి ఎందుకు వెళ్లిపోతుంది? దేవసేన లండన్ వెళ్లిపోతుందా? సుబ్బుతో పెళ్లికి ఒప్పుకుంటుందా? అనేది మిగతా కథ.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో పట్నానికి వచ్చిన హీరో. నచ్చని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పారిపోయి పట్నానికి చేరుకున్న హీరోయిన్ మధ్య పరిచయం జరుగుతుంది. అతని వైపు నుంచి ఆమె పట్ల ఉన్నది ప్రేమ. ఆమె వైపు నుంచి అతని పట్ల ఉన్నది స్నేహం. హీరో తన పేరెంట్స్ తో చెప్పిన ఒక అబద్ధం కారణంగా, అతని ఇంటికి ఆమె వెళ్లవలసి వస్తుంది. అతను చెప్పినట్టుగా నటించాల్సి వస్తుంది. ఫలితంగా చోటుచేసుకునే సన్నివేశాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.
హీరో .. హీరోయిన్ పారిపోయి చెరో దారిలో హైదరాబాద్ చేరుకోవడం .. అక్కడ ఇద్దరూ తారస పడటం .. వాళ్లిద్దరి మధ్య పరిచయం పెరగడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ చాలా సరదాగా .. సందడిగా సాగిపోతుంది. ఇక ఇరువురి కుటుంబాలకు ఈ విషయం తెలియడం, అబ్బాయితో పాటు ఆమెను కూడా తమ ఇంటికి తీసుకుని వెళ్లడం .. తాము చెప్పిన అబద్ధాన్ని నిజం చేయలేక హీరో - హీరోయిన్ నానా తిప్పలు పడటం వంటి మలుపులతో సెకండాఫ్ నడుస్తుంది.
పెళ్లి విషయంలో తనకంటూ ఒక అభిప్రాయం ఉన్న హీరో పట్నానికి రావడం, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక అదే పట్నానికి హీరోయిన్ రావడం .. ఇద్దరి మధ్య పరిచయం చాలా సినిమాలలో ఆల్రెడీ చూసేసిన ఒక రొటీన్ ట్రాక్. హీరోయిన్ డబ్బు కోసం ఒక దగ్గర కేర్ టేకర్ గా చేరడం .. ఆ ఫ్యామిలీ ద్వారా లండన్ వెళ్లే ఆలోచన చేయడం .. తనకి ఆమె దూరమైపోతుందేమోనని హీరో మానసిక సంఘర్షణకి లోను కావడం కూడా మామూలే.
ఇక ఈ కథలో కాస్త గందర గోళం ఏర్పడటానికి కారణం హీరో ఆడిన ఒక అబద్ధం. ఆ అబద్ధం హీరో చెప్పడం కూడా అంత అవసరమని ఆడియన్స్ కి అనిపించదు. ఈ అబద్ధమే దాదాపు అన్ని పాత్రలను అయోమయంలో పడేసి, అందుకు సంబంధించిన హడావిడితోనే ప్రీ క్లైమాక్స్ కి తీసుకుని వెళ్లి .. అక్కడి నుంచి క్లైమాక్స్ ను చూపిస్తుంది. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్లీ రొటీన్ బాటనే పట్టడం కనిపిస్తుంది.
చాలా కథలు నడిచిన ఫార్మాట్ లోనే ఈ కథ కూడా వెళుతుంది. అతకని అబద్ధం తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కాకపోతే ట్రీట్మెంట్ కారణంగా, రాధిక .. భాగ్యరాజ్ .. ప్రభు .. సుహాసిని వంటి బలమైన తారాగణం కారణంగా బోర్ అనిపించదు. ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా సీనియర్స్ కావడం వలన, ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. రాజేశ్ శుక్లా ఫొటోగ్రఫీ .. జీన్ మార్టిన్ సంగీతం .. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ఒకరిని ఇష్టపడటం చాలా తేలిక. అయితే ఆ వ్యక్తి చేత తిరిగి ప్రేమించబడటం చాలా కష్టం. నిజమైన ప్రేమను పొందాలంటే నిరీక్షణ తప్పదు అనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది.
'హాయ్' (జీ 5) మూవీ రివ్యూ!
Hi Review
Movie Details
Movie Name: Hi
Genre: Comedy, Drama, Romance
Release Date: 2026-09-25
Cast: Kavin,Nayanthara ,Prabhu,K. Bhagyaraj ,Radikaa Sarathkumar,Poornima Bhagyaraj
Director: Vishnu Edavan
PRO: -
Music: Jen Martin
Banner: Zee Studios - Rowdy Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer