మలయాళంలో కుంచాకో బోబన్ కి మంచి క్రేజ్ ఉంది. 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాతో ఆయన ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. అలాంటి ఆయన నుంచి ఇటీవల థియేటర్లకు వచ్చిన సినిమానే 'ఉన్మాదం'. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది. కిరణ్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, లిజోమోల్ జోస్ కథానాయికగా నటించింది. జులై 31వ తేదీన విడుదలైన ఈ సినిమా, సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
అది 'పాలక్కడ్' పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్. అక్కడ కానిస్టేబుల్ గా 'షెల్లీ' (కుంచాకో బోబన్) పనిచేస్తుంటాడు. ఆయన భార్య 'సౌమ్య' ( లిజోమోల్ జోస్) ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. వారి ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు. మొదటి నుంచి కూడా షెల్లీకి సినిమాలంటే ఇష్టం. సినిమా రచయితగా కొనసాగాలనేది ఆయన ఆశయం. అందువలన సెలవులు పెట్టేసి మరీ కథలను రాస్తుంటాడు. అయితే ఆ కథలేవీ ఓకే కాకపోవడంతో, సౌమ్య అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్ లో చాలా కాలంగా ఉన్న ఒక కేసు ఫైల్ గురించి షెల్లీకి తెలుస్తుంది. ఆరేళ్ల క్రితం ఒక యువతి రైలు పట్టాల పక్కన చనిపోయి కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు ఆమె చనిపోయిందని చెప్పి అంతా భావిస్తారు. ఆ కేసును వాళ్లు అంత ఫాస్టుగా పక్కన పెట్టేయడానికి ఒక కారణం లేకపోలేదు. ఆ కేసు ఫైల్ ను ఎవరు టచ్ చేసినా, ఆ రోజున వాళ్లు రక్తం కళ్లచూస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ కావొచ్చు .. లేదంటే ప్రాణాలను పోగొట్టుకోవచ్చు. ఆ యువతి ప్రేతాత్మనే ఇందుకు కారణమనే ఆలోచన వలన, అందరూ భయపడుతుంటారు.
ఈ కేసును ఒక లైన్ గా రాసుకుని ఒక దర్శకుడికి వినిపిస్తాడు షెల్లీ. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి స్క్రిప్ట్ రాసుకుని రమ్మని అడ్వాన్స్ కూడా ఇప్పిస్తాడు ఆ దర్శకుడు. దాంతో పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ ఫైల్ ను రహస్యంగా పరిశీలించి, అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలని షెల్లీ భావిస్తాడు. ఆ ఫైల్ గురించి అందరూ చెప్పుకునే మాటలను కొట్టిపారేసి దానిని బయటికి తీస్తాడు. ఫలితంగా షెల్లీకి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఆ యువతి కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనేది కథ.
ఆరేళ్ల క్రితం నాటి ఒక యువతి కేసుకి సంబంధించిన ఫైల్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది. ఆ ఫైల్ ను టచ్ చేసినవారిని ఆ అమ్మాయి ప్రేతాత్మ ఇబ్బంది పెడుతుందని ఆ స్టేషన్ లో అంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ సంఘటనను సినిమా కథగా మార్చాలనే ఉద్దేశంతో, ఆ ఫైల్ ను కానిస్టేబుల్ షెల్లీ ఓపెన్ చేస్తాడు. పర్యవసానంగా ఆయన ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందనే అంశం చుట్టూ అల్లుకోబడిన కథ ఇది.
సినిమా రచయితగా పేరు తెచ్చుకోవాలనే ఒక పట్టుదల కలిగిన పోలీస్ కానిస్టేబుల్, సినిమాల గోల మనకెందుకు .. నీ జాబ్ నువ్వు జాగ్రత్తగా చేసుకో అని చెప్పే భార్య .. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలతో ఈ కథ మొదలవుతుంది. ఎలాగైనా తన కథ ఓకే కావాలనే ఉద్దేశంతో, ఒక రియల్ క్రైమ్ స్టోరీని కథగా మార్చుకోవాలనే నిర్ణయానికి హీరో రావడంవంటి అంశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది.
ఇక తన పోలీస్ స్టేషన్లో గతంలో మిగతా పోలీసులకు భయంకరమైన అనుభవాలను మిగిల్చిన ఒక కేస్ తాలూకు ఫైల్ ను హీరో టచ్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. బలమైన ఈ మలుపు కారణంగానే సెకండాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నిజంగానే ప్రేతాత్మ ఆ ఫైల్ ను అలా కనిపెట్టుకుని ఉందా? చనిపోయిన ఆ యువతి ఎవరు? అంతకుముందు ఏం జరిగింది? అనే ఒక ఉత్కంఠతో ఆడియన్స్ కథను ఫాలో అవుతూ ఉంటారు.
ఈ కథ నిదానంగానే మొదలవుతుంది .. నింపాదిగానే నడుస్తుంది. రెగ్యులర్ పోలీస్ కథల్లోని హడావిడి ఈ సినిమాలో కనిపించదు. అయితే చివరి 40 నిమిషాలలో కథ చకచకా మలుపులు తీసుకుంటూ పరుగులు పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ కథను మరింత బలంగా మారుస్తాయి. ప్రేతాత్మను పదే పదే చూపించకుండా, ఆ ప్రభావం కథ అంతా కనిపించేలా చూసుకుంటూ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
కుంచాకో బోబన్ పైనే పూర్తి కథ నడుస్తుంది. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. శత్రువులు తనపై పిచ్చివాడనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నా, హత్య చేయబడిన ఒక యువతికి న్యాయం చేయాలనే పట్టుదలతో పోరాటం చేసే వ్యక్తిగా ఆయన నటన మెప్పిస్తుంది. మిగతా పాత్రధారులంతా సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. అర్జున్ సేతు ఫొటోగ్రఫీ .. జస్టిన్ వర్గీస్ నేపథ్య సంగీతం .. జితిన్ జాన్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.
హత్య చేయబడినవారి ఆత్మలు, నేరస్థులు ఎవరనేది బయటపడేలా చేసిన దాఖలాలు కొన్ని ప్రదేశాలలో వెలుగు చూశాయి. అలా హత్య చేయబడిన యువతి, ఒక పోలీస్ కానిస్టేబుల్ ద్వారా నేరస్థులకు శిక్షపడేలా చేసిన కథ ఇది. కథ - స్క్రీన్ ప్లే నిదానంగా ఉన్నప్పటికీ, ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. చివరి 40 నిమిషాలు ఈ కంటెంట్ కి మరింత బలాన్ని ఇచ్చాయని చెప్పచ్చు. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ కంటెంట్ కనెక్ట్ అవుతుంది.
'ఉన్మాదం' (సోనీ లివ్) మూవీ రివ్యూ!
Unmadham Review
Movie Details
Movie Name: Unmadham
Genre: Crime, Thriller
Release Date: 2026-09-04
Cast: Kunchacko Boban, Lijomol Jose,Raina Radhakrishnan,Siddique,Kottayam Nazeer
Director: Kiran Das
PRO: -
Music: Justin Varghese
Banner: Panorama Studios
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer