తమిళంలో రూపొందిన మరో క్రైమ్ డ్రామానే 'మథి మారన్'. లెనిన్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, మంత్ర వీరపాండియన్ దర్శకత్వం వహించాడు. ఇవానా .. వెంకట్ సెంగుట్టువన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2023లో థియేటర్లకు వచ్చింది. 'అమెజాన్ ప్రైమ్'లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
అది ఒక అందమైన పల్లెటూరు. ఆ విలేజ్ లో 'సుందరం' పోస్టుమేన్ గా పనిచేస్తుంటాడు. ఆయనకి ఒక కూతురు .. ఓ కొడుకు. వాళ్లిద్దరూ ట్విన్స్. మథి (ఇవానా) నెడుమారన్ (వెంకట్). అయితే నెడుమారన్ లో శారీరక పరమైన ఎదుగుదల ఆగిపోతుంది. దాంత్ అందరూ పొట్టివాడని అతనిని ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ విషయంలో అతను మానసికంగా కుంగిపోకుండా 'మథి' అండగా నిలబడుతూ ఉంటుంది. ఇద్దరూ స్కూల్ చదువు పూర్తి చేసి, వేరు వేరు కాలేజీలలో చేరతారు.
నెడుమారన్ పొట్టివాడైనప్పటికీ మంచి తెలివైనవాడు. అతని వ్యక్తిత్వం పట్ల ఆకర్షితురాలైన 'ప్రభావతి' అతనిని ప్రేమిస్తూ ఉంటుంది. చదువు పూర్తయిన తరువాత తండ్రి మాదిరిగా పోస్టుమేన్ గా చేయాలనేది నెడుమారన్ కోరిక. ఈ విషయంలోను అతనిని ఎంతో సపోర్టు చేసే మథి, తాను ప్రేమిస్తున్న వ్యక్తితో కలిసి ఊరొదిలి వెళ్లిపోతుంది. ఊహించని ఈ సంఘటన నుంచి అతను తేరుకోలేకపోతాడు.
మథి ఆ విధంగా చేయడం వలన సుందరం ఆ ఊళ్లో తలెత్తుకోలేకపోతాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయానికి కూతురు గర్భవతి కూడా అనే నిజాన్ని తట్టుకోలేకపోతాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దాంతో తన అక్కయ్యను వెతుక్కుంటూ నెడుమారన్ 'చెన్నై' కి చేరుకుంటాడు. ఆ సమయంలో అక్కడ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తుంటారు. అక్కడికి వెళ్లిన నెడుమారన్ ఏం చేస్తాడు? అక్కడ జరుగుతున్న హత్యలకు కారకులు ఎవరు? పోస్టుమేన్ కావాలనే అతని కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.
'రూపం చూసి ఎదుటివారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తెలివి తేటలతోనే ఎవరైనా ఏ రంగంలోనైనా రాణిస్తారు. సమయస్ఫూర్తితోనే విజయాలను సాధిస్తారు. అందుకు హైటూ .. పర్సనలిటీతో పనిలేదనే ఒక కాన్సెప్ట్ చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వచ్చాడు.
నెడుమారన్ పొట్టివాడు. అందువలన అతను చిన్నప్పటి నుంచి అందరితో అవహేళనలు ఎదుర్కుంటూ వస్తాడు. తాను హైట్ లేకపోవడం వలన జీవితంలో ఏమీ సాధించలేనేమో అనే ఒక భావనతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఎవరేమన్నా తన అక్కయ్యకి ఆసరాగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది.
ఇక తల్లిదండ్రులను కోల్పోయి అక్కయ్యను వెతుక్కుంటూ సిటీకి వెళ్లిన నెడుమారన్, అక్కడ జరుగుతున్న వరుస హత్యలకు కారకులు ఎవరనేది తెలుసుకునే బాధ్యతను మీదేసుకుంటాడు. ఆ విషయంలో ఆయనకి ఎదురయ్యే అనుభవాల చుట్టూ సెకండాఫ్ నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ కాస్త హడావిడిగా పరిగెడతాయి.
రూపాన్ని బట్టి ఎదుటివారి టాలెంట్ ను జడ్జ్ చేయకూడదు. సమస్యలు పరిష్కారమయ్యేది తెలివి తేటలతోనే అనే లైన్ బాగానే ఉంది. కాకపోతే పోలీస్ డిపార్టుమెంట్ పక్కనే ఉంటూ, నేరస్థులను పట్టుకునే బాధ్యతను హీరోకి అప్పగించడమే కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో పొట్టివాడు కావడం వలన ఈ కథలోని ఇతర పాత్రలకు న్యాయం జరిగిందేమోకానీ, ఆడియన్స్ మాత్రం లవ్ .. యాక్షన్ .. రొమాన్స్ .. వంటి అంశాలను పూర్తిగా మిస్సయ్యారని చెప్పాలి.
వెంకట్ నటన చాలా బాగుంది. కాకపోతే ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం వలన, ఎలాంటి సానుభూతి కలగదు. ఇవానా చాలా ఆకర్షణీయంగా కనిపించింది. కాకపోతే ఆమె వైపు నుంచి వేసుకున్న ట్రాక్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించదు. ఫోటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
అక్కా తమ్ముళ్ల ఎమోషన్ .. వరుస హత్యలు .. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ నడిచే కథ ఇది. పొట్టివాడైనా గట్టివాడే అనే విషయాన్ని దర్శకుడు ఎక్కడికక్కడ నిరూపించడానికి ప్రయత్నించాడు. అయితే ఆ దిశగా డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. హత్యలు జరిగే తీరు .. హంతకుడిని పట్టుకోవడానికి పన్నే వ్యూహాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఎలాంటి కొత్తదనం లేని ఓ మాదిరి కంటెంట్ కేటగిరీలోనే ఇది మిగిలిపోతుందని చెప్పచ్చు.
'మథి మారన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Mathi Maran Review
Movie Details
Movie Name: Mathi Maran
Genre: Crime, Drama
Release Date: 2026-08-28
Cast: Venkat Senguttuvan,Ivana,M. S. Bhaskar,Aadukalam Naren,Bava Chelladurai
Director: Mantra Veerapandian
PRO: -
Music: Karthik Raja
Banner: GS Cinema International
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer