యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను .. సిరీస్ లను రూపొందించడంలో బాలీవుడ్ మేకర్స్ ముందుంటారు. ఇక దేశభక్తితో ముడిపడిన వాస్తవ సంఘటనలకు దృశ్య రూపం ఇవ్వడంలోను హిందీ సిరీస్ లు తమ ప్రత్యేకతను చాటుతూ ఉంటాయి. అలా సిద్దార్థ్ హీరోగా రూపొందిన సిరీస్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్'. 1999లో భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన 'కార్గిల్ యుద్ధం' .. వాయుసేనకి చెందిన 'ది గోల్డెన్ యారోస్' పోషించిన పాత్ర నేపథ్యంలో రూపొందిన సిరీస్ ఇది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 7వ తేదీ నుంచి వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో శాంతి చర్చలకు భారత్ ప్రయత్నిస్తూ ఉంటుంది. భారత ప్రధాని వాజ్ పేయీ రోడ్డు మార్గం ద్వారా బస్సులో పాక్ వెళ్లడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. అయితే కశ్మీర్ ను దక్కించుకుని తీరాలనే పట్టుదలతో పాక్ ఆర్మీ చీఫ్ ముషారఫ్ ఉంటాడు. కశ్మీర్ ను ఆక్రమించడానికి వ్యూహ రచన చేయడంలో నిమగ్నమై ఉంటాడు. 'ఎల్ ఓ సి' నియంత్రణ రేఖ వెంట ఉన్న భారత్ స్థావరాలను ఆక్రమించమని చెప్పి, ఉగ్రవాదుల వేషంలో పాక్ సైనికులను పంపిస్తాడు.
ఒక ఎత్తయిన మంచు పర్వతంపై పాక్ సైనికులు స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆర్మీ హెలికాఫ్టర్ లపై కూడా దాడి చేయలేని ఎత్తు నుంచి, భారత సైనికులపై తూటాల వర్షం కురిపిస్తూ ఉంటారు. దాంతో శత్రువులను ఎలా ఎదుర్కోవాలనేది భారత సైన్యానికి అర్థం కాదు. వాయుసేనకి చెందిన 'ది గోల్డెన్ యారోస్' బృందాన్ని రంగంలోకి దింపడమే పరిష్కార మార్గంగా తోస్తుంది. వింగ్ కమాండర్ ధనోవా సారథ్యంలో యువ పైలట్ల బృందం రంగంలోకి దిగుతుంది. టోనీ .. అజయ్ అహూజా గైడెన్స్ తో, థాలి .. బాల్డీ .. సాంగ్రి .. నిశి ఫైటర్ జట్లతో బయల్దేరుతారు.
పాక్ సైన్యం రాకెట్ లాంఛర్లతో రంగంలోకి దిగుతుంది. జెట్ ఫైటర్ ఇంజన్ ఫెయిల్ అయిన కారణంగా, నిశి ప్రమాదంలో పడతాడు. ఎలాంటి పరిస్థితులలోను అతనిని కాపాడాలనే ప్రయత్నంలో అజయ్ జెట్ ఫైటర్ రాకెట్ లాంఛర్ దెబ్బకి కుప్పకూలుతుంది. పారాచూట్ సాయంతో బయటపడిన అజయ్, పాక్ సైనికులకు దొరికిపోతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అతణ్ణి రక్షించుకోవడానికి భారత్ సైన్యం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ.
దేశభక్తి .. పోరాట పటిమ .. సాహసాలు చేయడంలో ఆసక్తి కలిగిన కొందరు యువకులు, ఫైటర్ పైలెట్లు కావాలని కలలు కంటారు. ఎంతో కష్టపడి తమ కలను నిజం చేసుకుంటారు. వాళ్లంతా కలిసి పనిచేసే ఆపరేషన్ గా ఈ కథ తెరపైకి వస్తుంది. కశ్మీర్ ను ఆక్రమించాలనే పాక్ కుట్రను ఈ టీమ్ ఎలా ఎదుర్కొంది? అనే ప్రధానమైన సమస్య చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు.
ఒక వైపున పాక్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు .. ముషారఫ్ తీసుకున్న నిర్ణయాలు .. పాక్ కుట్రల కారణంగా బలైపోయిన భారత జవాన్లు .. ఆవేదనతో నిండిపోయిన వారి కుటుంబాల చుట్టూ ఈ యథార్థ కథను ఆవిష్కరిస్తూ వెళ్లారు. 'గోల్డెన్ యారోస్'లో పనిచేసే ఫైటర్ పైలెట్ల శిక్షణ ఎలా ఉంటుంది? ఆ సమయంలో వారు ఎదుర్కునే ఒత్తిడి ఎలా ఉంటుంది? ప్రేమ .. పెళ్లి .. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అనే అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.
మంచుకొండలు .. ఫైటర్ జెట్లు .. శత్రువుల స్థావరాలు .. బాంబింగ్ జరిగే తీరు .. శత్రు దేశానికి ఫైటర్ పైలెట్స్ దొరికిపోతే ఎలా ఉంటుంది? ఒకరి కోసం ఒకరు చేసే త్యాగాలు ఎలా ఉంటాయి? వంటి సన్నివేశాలను సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించారు. 1999లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టారు. సిద్ధార్థ పాత్రకి సంబంధించిన క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టేలా ఉంటుంది. దేశభక్తి వైపు నుంచి .. ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి మనసును కదిలించడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
ఈ సిరీస్ కోసం ఆర్టిస్టులను ఎంపిక చేసిన తీరు బాగుంది. ఒరిజినల్ పాత్రలకు చాలా దగ్గరగానే కనిపిస్తారు. అందరూ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా తమ పాత్రలను నడిపించారు. దర్శకుడు 'ఓనీ సేన్' టేకింగ్ బాగుంది. సత్యజిత్ పాండే ఫొటోగ్రఫీ .. అనురాగ్ నేపథ్య సంగీతం .. మిక్కీశర్మ ఎడిటింగ్ కథ మరింత బలంగా నడపడం కోసం తమ వంతు కృషి చేశాయి. కథకి తగినట్టుగా ఎంచుకున్న లొకేషన్స్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు.
'ఆపరేషన్ సఫేద్ సాగర్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
Operation Safed Sagar Review
Movie Details
Movie Name: Operation Safed Sagar
Release Date: 2026-08-07
Cast: Jimmy Shergill, Siddharth, Vinay Pathak, Manu Rishi Chadha, Abhay Verma, Harssh Singh, Adil Hussain, Barun Sobti
Director: Oni Sen
Music: Anurag Saikia
Banner: Matchbox Shots -Feel Good Films
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer