అధర్వ హీరోగా రూపొందిన సినిమానే 'ఇదయం మురళి' (హృదయం మురళి). అధర్వ తండ్రి మురళి హీరోగా 1991లో 'ఇదయం' (హృదయం) సినిమా చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా మ్యూజికల్ హిట్ గా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమా పేరును .. తండ్రి పేరును కలుపుతూ, ఆయనను గుర్తుచేస్తూ అధర్వ ఈ సినిమా చేశాడనుకోవాలి. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 7వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
'హృదయ' (అధర్వ) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అప్పటి నుంచి మేనమామ (నట్టి సుబ్రమణ్యం) అతని ఆలనాపాలన చూస్తూ వస్తాడు. అయితే తల్లిదండ్రులు లేని కారణంగా ఒక రకమైన బెరుకు 'హృదయ'లో ఉండిపోతుంది. ఆ కారణంగా అతను తన మనసులోని మాటను బయటికి చెప్పలేకపోతుంటాడు. కాలేజ్ లో చదువుకునే రోజులలో అతను 'సమంత' (ప్రీతి ముకుందన్)ను ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమను మనసులోనే దాచుకుంటాడు. ఆ తరువాత చదువు పూర్తి చేసి చెన్నైలో జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు.
ఆ సమయంలోనే అతనికి 'అముద' (కయాదు లోహార్) పరిచయమవుతుంది. డాక్టర్ గా ఉన్న ఆమెను అతను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆమె పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేయమని స్నేహితులు ఎంతగా చెప్పినా, హృదయ ధైర్యం చేయలేకపోతాడు. ఆమె తన ఊరికి వెళ్లిపోవడంతో దిగాలు పడిపోతాడు. సమంతకుగానీ .. అముదకుగాని తన మనసులోని ప్రేమను చెబితే బాగుండునని అనుకుంటాడు. 'అదితి'తో హృదయ ఎంగేజ్ మెంట్ జరిగిన తరువాత వాళ్లిద్దరూ తారసపడతారు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.
టీనేజ్ లో అడుగుపెట్టిన తరువాత ప్రేమలో పడటం సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అయితే అబ్బాయిలే ముందుగా తమ ప్రేమను వ్యక్తం చేయాలని అమ్మాయిలు కోరుకుంటారు. కొంతమంది అబ్బాయిలు మౌనంగా ఆరాధిస్తారే తప్ప ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి జంకుతారు. అలాంటి ఒక బెరుకు వలన, మనసుపడిన అమ్మాయిలు ఎలా దూరమైపోతారనే అంశం చుట్టూ అల్లుకుంటూ వెళ్లిన కథ ఇది.
'హృదయం' సినిమా .. ఆ సినిమా హీరో మురళి గుర్తున్నవారికి ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనే నిర్ధారణకి వచ్చేస్తారు. కానీ ఈ సినిమాలో ఆశించినస్థాయిలో కథాబలం గానీ .. సన్నివేశాలలో ఫీల్ గాని కనిపించవు. ఫ్రెండ్స్ మధ్య ప్రేమకి సంబంధించిన అల్లర చిల్లర కామెడీతో కూడిన సీన్స్ ను వేసుకుంటూ వెళ్లారే తప్ప, ఫీల్ పై దృష్టిపెట్టలేదు. కొన్ని సీన్స్ ను ఏరుకొచ్చి అక్కడక్కడా పడేసినట్టుగా అనిపిస్తుంది.
ఇక హీరో వెనుక మిత్రబృందం ఉంటుంది .. ఆ బృందంలో లేడీస్ కూడా ఉంటారు. పోనీ వాళ్లైనా హీరో మనసు పడిన అమ్మాయిల దగ్గరికి వెళ్లి, అతను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పకపోవడం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. హీరో తన మనసులోని మాట హీరోయిన్స్ కి చెప్పకుండా ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాడు. క్రికెట్ విషయంలో గొడవపడటం .. హాస్పిటల్లో ఎవరో డెలివరీ అవుతుంటే ఇతను భర్త అనుకుని డాక్టర్లు ఇబ్బంది పెట్టడం .. తాగేసి డ్రైవ్ చేస్తూ పోలీసులకు దొరికిపోవడం .. రాజకీయ నాయకుడి అనుచరులు వెంటపడటం అనవసరమైన సీన్స్ గా అనిపిస్తాయి.
ఈ కథ 1990లలో మొదలై 2024 వరకూ కొనసాగుతుంది. హీరో స్కూల్ డేస్ కి సంబంధించిన కొన్ని సీన్స్ సరదాగా అనిపిస్తాయి. అలాగే లవ్ సీన్స్ కూడా అక్కడక్కడా ఆకట్టుకుంటాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం, బలమైన కథాకథనాలు లోపించిన కంటెంట్ గానే అనిపిస్తుంది. అధర్వ .. ప్రీతి ముకుందన్ .. కయాదు లోహార్ నటన ఆకట్టుకుంటుంది. మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ ఫరవాలేదు.తమన్ బాణీలు అంతగా ప్రభావితం చేయలేదు. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది.
హీరో బాల్యం నుంచి అతని పెళ్లివరకూ నడిచే కథ ఇది. లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి అవకాశం ఉంది. కానీ ఈ అంశాలను కలుపుకుంటూ ఒక బలమైన కథనే కనిపించదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా సాగడం మరో లోపంగా అనిపిస్తుంది. చివరివరకూ హీరోయిన్స్ కి హీరో దూర దూరంగా తిరగడం వలన, రొమాన్స్ కి అవకాశం లేకుండా పోయింది. దానిని ఆశించిన ఆడియన్స్ కి నిరాశే ఎదురవుతుంది. ఎలాంటి కొత్తదనం లేని ఓ రొటీన్ స్టొరీగానే ఇది మిగిలిపోతుందని చెప్పచ్చు.
'హృదయం మురళి' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Hrudayam Review
Movie Details
Movie Name: Hrudayam
Release Date: 2026-08-07
Cast: Atharvaa, Preity Mukhundhan, Kayadu Lohar
Director: Aakash Baskaran
Music: Thaman S
Banner: Dawn Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer