టీవీ సీరియల్స్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది, ఆ తరువాత వెండితెరపై కూడా హీరోలుగా అవకాశాలను .. అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి కథానాయకుల జాబితాలో 'నిహార్ ముఖేశ్' కూడా చేరిపోయాడు. తెలుగులో 'గుప్పెడంత మనసు' సీరియల్ లో 'రిషి' పాత్ర ద్వారా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ముఖేశ్, 'తీర్థరూప తాండేయ వారిగే' సినిమా ద్వారా, వెండితెరకి పరిచయమయ్యాడు. 'అమెజాన్ ప్రైమ్'లో తెలుగులోను ఈ సినిమా అందుబాటులో ఉంది.

పృథ్వీ (నిహార్ ముఖేశ్) ఓ ట్రావెల్ వ్లాగర్. మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అందమైన .. అనుభూతి ప్రధానమైన ప్రదేశాలకు వెళుతూ, అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. జనంలో అతనంటే మంచి క్రేజ్ ఉంటుంది. అయితే అతనికి మాత్రం జీవితం చాలా వెలితిగా ఉంటుంది. అందుకు కారణం, తన చిన్నతనంలోనే తండ్రి శివ శంకర్ (రవీంద్ర విజయ్) ఇల్లొదిలి వెళ్లిపోవడం. ఎక్కడ ఉన్నాడో ఏమైపోయాడో తెలియకపోవడం.

తండ్రిలేని కారణంగా స్కూల్ ఏజ్ మొదలు, కాలేజ్ వరకూ పృథ్వీ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటాడు. ఇప్పుడు కూడా 'వాక్ మేన్' అతని ఫ్రెండ్స్ అతనిని ఆ విషయంపై హేళనగా మాట్లాడుతూ ఉంటారు. తన తండ్రి ఎందుకు ఇల్లొదిలి వెళ్లిపోయాడనేది అతని ముందున్న పెద్ద ప్రశ్న. ఆయన ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలనే ఒక పట్టుదల అతనిలో బలంగా ఉంటాయి.   

తన తల్లి జానకి (సితార) విశ్వనాథ్ (రాజేశ్ నటరంగ)తో సన్నిహితంగా ఉండటం పృథ్వీకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోవడానికి తల్లి ప్రవర్తనయే కారణమని అతను భావిస్తుంటాడు. అందువలన ఆమెతో ముభావంగా ఉంటాడు. అతని ధోరణి జానకిని ఎంతో బాధిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అతనికి అక్షర (రచన ఇందర్)తో పరిచయమవుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. ఆమె తండ్రి సీనియర్ జర్నలిస్ట్ రవి రామనాథపుర అని తెలుసుకుని పృథ్వీ షాక్ అవుతాడు. తమ ప్రేమ ఫలించడం కష్టమనే నిర్ధారణకు వస్తాడు.

ఒకరోజున రవి రామనాథపుర హఠాత్తుగా చనిపోతాడు. తన కోసం ఆయన రాసి పెట్టిన లెటర్ ను అక్షర చదువుతుంది. అప్పుడు ఆమెకి ఒక చేదు నిజం తెలుస్తుంది. అదేమిటి? పృథ్వీ తండ్రి శివశంకర్ కనిపించకుండా పోవడానికీ, రవి రామనాథపురకి మధ్య గల సంబంధం ఏమిటి? వాళ్లిద్దరికీ సంబంధించిన గతంలో ఏం జరుగుతుంది? అది తెలుసుకున్న అక్షర ఏం చేస్తుంది? తన తండ్రి జాడ తెలుసుకోవాలనే పృథ్వీ కోరిక నెరవేరుతుందా? అనేది మిగతా కథ.

ప్రతి ఒక్కరి జీవితంలోను తల్లి - తండ్రి ప్రధానమైన పాత్రలను పోషిస్తారు. ఇద్దరిలో ఎవరు లేకపోయినా, అది మరెవరూ భర్తీ చేయలేని ఒక వెలితిగానే ఉంటుంది. పూర్తి ఆనందాన్ని .. సంతోషాన్ని అందకుండా చేస్తుంది. అలా చిన్నతనంలోనే తండ్రి ప్రేమకి దూరమైన హీరో, అందుకు కారణం తల్లి అనుకుని ఆమెకి తాను దూరంగా మసలుకుంటూ ఉంటాడు. అదే ఆలోచన కారణంగా మనసిచ్చిన అమ్మాయిని కూడా దూరం పెట్టాలని నిర్ణయించుకుంటాడు. చివరికి అతనికి తెలిసే నిజం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు.

తన  తండ్రిని జాడ తెలుసుకోవడానికి ఆరాటపడుతున్న పృథ్వీకి, అక్షర సాయపడాలనుకుంటుంది. అయితే  అసలు పృథ్వీ తండ్రి కనిపించకుండా పోవడానికి కారకుడు తన తండ్రి రవి రామనాథపురనే అనే విషయం అక్షరకి  తెలియడం ఈ కథలో మరో కీలకమైన అంశంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కథ కాస్త ఊపందుకుంటుంది. అది క్లైమాక్స్ వరకూ అలాగే కొనసాగుతూ వెళుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

అయితే ఈ కథ చాలా నిదానంగా మొదలవుతుంది. ఫస్టాఫ్ అంతా కూడా చాలా నింపాదిగా సాగుతుంది. హీరోకి తండ్రిలేడనే అసంతృప్తి .. తల్లి పట్ల అసహనం ఉన్నాయనే విషయాన్ని దర్శకుడు సాగదీస్తూ వెళ్లాడు. లవ్ ట్రాక్ అందుబాటులో ఉన్నా పెద్దగా వాడుకోలేదు. ఆ ట్రాక్ కి కాస్త రొమాన్స్ ను జోడించినా, నీరసానికి నిమ్మరసం దొరికినట్టుగా ఉండేది. ఇక హీరో ఎదుగుదలను ఓర్చలేని గ్యాంగ్ ను కూడా కాస్త హైలైట్ చేస్తే బాగుండేది. 

దీపక్ ఫొటోగ్రఫీ బాగుంది. మేఘాలయ వంటి లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు గొప్పగా ఉంది. జో కోస్టా బాణీలు .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. పాటలకి సంబందించినంత వరకూ సాహిత్యాన్ని గురించి గానీ .. పాడించడం గురించిగాని ఎంతమాత్రం పట్టించుకోలేదనే విషయం అర్థమవుతుంది. కంటెంట్ లో ఎక్కువ ఇబ్బంది పెట్టిన అంశం ఇదే.

నిజానికి ఈ కథలో మంచి పాయింట్ ఉంది. అయితే పాయింట్ వరకూ వెళ్లడానికి తీసుకున్న సమయం ఎక్కువ. అక్కడివరకూ ఆసక్తికరమైన సన్నివేశాలను డిజైన్ చేయకుండా, నాన్చుతూ నిదానంగా నడిపించడం లోపంగా కనిపిస్తుంది. టోటల్ గా చూసుకుంటే ఓ మాదిరి కంటెంట్ గానే ఇది మిగిలిపోతుందని చెప్పచ్చు.