ఒకప్పుడు కోర్టు నేపథ్యంలో నడిచే కథలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. కోర్టులో జరిగే వాదోపవాదనలను ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా వినేవారు.. విజిల్స్ కొట్టేవారు. కానీ ఆ తరువాత కోర్టు రూమ్ చుట్టూ తిరిగే కథలపట్ల అనాసక్తిని చూపించడం మొదలుపెట్టారు. అయితే ఆ పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు మార్పు మొదలైంది. ఈ నేపథ్యంలో వచ్చిన లీగల్ థ్రిల్లర్ గా 'ఇక్కా' కనిపిస్తోంది. సన్నీ డియోల్ - అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా, 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 10వ తేదీ నుంచి వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

'ముంబై' మహానగరంలో సీనియర్ లాయర్ గా 'అర్జున్ మెహ్రా' (సన్నీ డియోల్)కి మంచి పేరు ఉంటుంది. భార్య 'అవంతిక' (దియామీర్జా) కూతురు 'సమైరా' .. ఇదే అతని ఫ్యామిలీ. బాధితుల పక్షాన పోరాడే లాయర్ గా ఆయన గురించి అంతా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అతను ఒక కేస్ తీసుకున్నాడంటే ఇక ఆ కేసు గెలిచి తీరుతుందనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. అలాంటి ఆయన శౌర్యమాన్ (అక్షయ్ ఖన్నా) కేసును తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

శౌర్యమాన్ ఒక పారిశ్రామిక వేత్త  ఒక్కగానొక్క కొడుకు. ఒక రోజున ఆయన పబ్ కి వెళతాడు. అక్కడే అతనికి 'సోమా మిట్టల్' (ఆకాన్ష రంజన్ కపూర్) పరిచయమవుతుంది.  అర్ధరాత్రి సమయంలో ఆమెను వెంటబెట్టుకుని తన కార్లో శౌర్యమాన్ బయల్దేరతాడు. ఆ తరువాత 'సోమా మిట్టల్' రక్తసిక్తమైన శరీరంతో నడిరోడ్డుపై పడిపోయి కనిపిస్తుంది. 'కోమా'లోకి వెళ్లిన ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. హత్యా ప్రయత్నం క్రింద శౌర్యమాన్ పై కేసు ఫైల్ అవుతుంది. 

ఈ కేసు నుంచి తన కొడుకుని బయటపడేయమని శౌర్యమాన్ తండ్రి హర్షవర్ధన్, లాయర్ అర్జున్ మెహ్రాను కోరతాడు. గతంలో అర్జున్ కీ .. శౌర్యకి మధ్య గొడవలు ఉంటాయి. అతని నైజం తెలిసిన కారణంగా ఆ కేసును వాదించడానికి అర్జున్ నిరాకరిస్తాడు. అయితే ఆ తరువాత అర్జున్ స్వయంగా వెళ్లి తాను ఆ కేసును తీసుకుంటున్నట్టు శౌర్యామాన్ కి చెబుతాడు. అందుకు కారణం అర్జున్ పదేళ్ల కూతురు 'సమైరా'. 

సమైరా కేన్సర్ బారినపడినట్టుగా తెలుసుకున్న అర్జున్ .. అతని భార్య తీవ్రమైన మనోవేదనకు గురవుతారు. సమైరా తండ్రి నుంచి 'బోన్ మ్యారో' అవసరమవుతుంది. సమైరాకి బయోలాజికల్ ఫాదర్ శౌర్యమాన్. 'సోమా'కేసు నుంచి తనని బయటపడేస్తే, 'బోన్ మ్యారో' ఇవ్వడానికి తాను సిద్ధమని శౌర్య అంటాడు. ఇక సోమా తరఫున వాదించడానికి మధురా బెనర్జీ (తిలోత్తమ షోమ్) రంగంలోకి దిగుతుంది. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుంది? సమైరాను అర్జున్ కాపాడుకుకుంటాడా? అవంతిక - శౌర్యమాన్ గతం ఎలాంటిది? ఈ కేసు చివర్లో అర్జున్ ప్రయోగించే 'ఇక్కా' ఏంటి? అనేది మిగతా కథ.

అర్జున్ పేరు ప్రతిష్ఠలున్న ఒక లాయర్. నిజాయితీ అతని ఇంటి పేరు అని అంతా చెప్పుకుంటూ ఉంటారు. సమైరాకి అతను పెంపుడు తండ్రి. సమైరా అసలు తండ్రి ఒక నేరంలో జైలుకు వెళతాడు. కేన్సర్ బారిన పడిన సమైరాను కాపాడుకోవడానికి, అర్జున్ కి ఆమె అసలు తండ్రి సాయం అవసరమవుతుంది. తనని కేసు నుంచి బయటపడేస్తే తన కూతురు ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తానని శౌర్యమాన్ డీల్ మాట్లాడతాడు. అందుకు సిద్ధపడిన అర్జున్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం. 

దర్శకుడు ఈ కథను చాలా వేగంగానే కోర్టు రూమ్ కి తీసుకుని వస్తాడు. ఇక అక్కడ ఇటు డిఫెన్స్ లాయర్ కి .. అటు ప్రాసిక్యూషన్ లాయర్ వాదోపవాదనలతో ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. సమైరా కోసం తన మనఃసాక్షికి వ్యతిరేకంగా పనిచేసే అర్జున్, ఆధారాలన్నీ పక్కాగా ఉన్నప్పటికీ ఈ కేసును అతను ఎందుకు టేకప్ చేశాడో తెలియని అయోమయ స్థితిలో ప్రాసిక్యూషన్ లాయర్. ఈ మధ్యలో సమైరా ఆరోగ్య పరిస్థితి ఈ కథపై ఆసక్తిని పెంచుతూ వెళతాయి. 

ఒక నిజాయితీ పరుడైన లాయర్, ఒక నిందితుడిని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నంలో ఎంతటి మానసిక సంఘర్షణను అనుభవిస్తాడనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. అదే సమయంలో లాయర్ కీ .. నిందితుడికి గతంలో ఉన్న గొడవేంటి? అవంతికతో నిందితుడికి గల సంబంధం ఏమిటి? అనే అంశాలు అలా సస్పెన్స్ లో ఉంచుతూ ప్రేక్షకులను వెయిట్ చేయిస్తాయి.

అయితే చిన్నపిల్లలకు కేన్సర్ .. ఆ వ్యాధితో వాళ్లు చేసేపోరాటం .. వంటి సన్నివేశాలు కథ ఆరంభంలోనే కాలు పెడతాయి. అప్పటి నుంచి ఇందుకు సంబంధించిన సన్నివేశాలు తెరపైకి వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాలను చూడటానికి చాలామంది ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. ఈ ట్రాక్ కి సంబంధించిన సన్నివేశాలు ఆ తరహా ప్రేక్షకులకు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. ఇక కోర్టు రూమ్ సన్నివేశాలు .. అందుకు సంబంధించిన అంతర్మథనాలు ఓకే. 

ఒక వైపున తాను ఎంతో గారాబంగా పెంచుకున్న కూతురు. మరో వైపున చావుబతుకుల్లో ఉన్న సోమా. ఆమెకి న్యాయం జరగడం కోసం పోరాడుతున్న సోమా తల్లి. తాను పెంచుకున్న పాప కోసం .. తన శత్రువును రక్షించే పరిస్థితి .. ఈ విధమైన ఒక చట్రంలో అర్జున్ పాత్రను డిజైన్ చేయడమే ఈ కథా బలానికి కారణమవుతుంది. బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నందుకు పశ్చాత్తాపంతో పొందే భావోద్వేగాలను సన్నీ గొప్పగా ఆవిష్కరించాడు. ఇక అక్షయ్ ఖన్నా నటన కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం కథను మరింత బలంగా ముందుకు తీసుకుని వెళతాయి. అయితే తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు మాత్రం కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తాయి. 

ఒక్కోసారి కొంతమంది లాయర్లు తమ అనుభవాన్ని .. తెలివి తేటలను నిందితులను నిర్దోషులుగా నిరూపించడానికి ఉపయోగించవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ లాయర్లు గెలిచినట్టా ? ఓడినట్టా ? అనే ఒక ఆలోచనను రేకెత్తించే కంటెంట్ ఇది. ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు గానీ .. సంభాషణలుగాని లేని ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.