'బ్లాస్ట్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Blast Review
కోలీవుడ్ నుంచి ఒక యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లకు వచ్చింది. అర్జున్ .. అభిరామి .. ప్రీతి ముకుందన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమా పేరే 'బ్లాస్ట్'. ఏజీఎస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఆశించిన స్థాయి రెస్పాన్స్ కనిపించలేదు. అయితే తమిళనాట మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. 18 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమా 5 భాషల్లో ఈ నెల 25 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాజారామ్ (అర్జున్) అతని భార్య నీలవేణి (అభిరామి) కూతురు 'నీల' (ప్రీతీ ముకుందన్) తమ్ముడు ఈశ్వర్ ( వివేక్ ప్రసన్న) కలిసి నివసిస్తూ ఉంటారు. రాజారామ్ అతని భార్య ఇద్దరూ కూడా మార్షల్ ఆర్ట్స్ కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రవేశం ఉంటుంది. అందువలన తమ కూతురు 'నీల'కి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. అవమానం .. అన్యాయం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలనేది తండ్రి నుంచి 'నీల' నేర్చుకుంటుంది. రాజారామ్ చిన్న పిల్లలకు కరాటేలో శిక్షణ ఇస్తుంటాడు. ఆయన భార్య మిషన్ కుడుతుంటుంది. 'నీల' ఒక వైపున జాబ్ చేస్తూనే .. మరో వైపున మెడికల్ షాప్ లో బాబాయ్ కి సాయం చేస్తుంటుంది.
ఇది ఇలా ఉండగా వరుణ్ దయాళన్ (జాన్ కొక్కేన్) 7వేల కోట్ల ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాజెక్టు కారణంగా 800 వందల కుటుంబాలు నివసించే ఒక చిన్నపాటి గ్రామం సమాధి అవుతుంది. ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లడానికి ఒక మినిస్టర్ కి వరుణ్ వెయ్యు కోట్లు లంచంగా ఇవ్వాల్సి వస్తుంది. వాటిని మినిస్టర్ ట్రస్ట్ పేరుతో ఉన్న ఎకౌంట్ కి 'వైట్' గా పంపించడం కోసం వరుణ్ ఏర్పాటు చేస్తాడు. అందుకోసం మూడు అంచెల పద్ధతిలో కృపాలన్ .. అబ్రహం .. శివ అనే ముగ్గురు అనుచరులను నియమిస్తాడు. ఆ వెయ్యి కోట్లకి సంబంధించిన 'కోడ్' గా ఒక 100 రూపాయల నోటు ఉంటుంది. అది అబ్రహం దగ్గర ఉంటుంది. అయితే ఒక చిన్న పొరపాటు కారణంగా అది 'శివ' పర్స్ లోకి వెళుతుంది.
అనుకోకుండా పోలీసులకు పట్టుబడిన అబ్రహం, గాయాలతో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతనికి అవసరమైన టాబ్లెట్స్ కోసం ఈశ్వర్ మెడికల్ షాప్ కి వెళ్లిన టోబీ, అక్కడున్న 'నీల'తో గొడవ పడతాడు. అది కాస్తా కృపాలన్ గ్యాంగ్ రాజారామ్ ఇంటిని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. రాజారామ్ ఫ్యామిలీ అంతా కలిసి ముగ్గురు రౌడీలను చంపేసి, గొయ్యితీసి పాతేస్తారు. ఆ ముగ్గురులో శివ ఒకడు .. అతని జేబులోని పర్సులోనే వెయ్యి కోట్లకి సంబంధించిన 100 నోటు ఉంటుంది. ఆ 100 నోటు కోసం వరుణ్ రంగంలోకి దిగుతాడు. ఫలితంగా రాజారామ్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేది మిగతా కథ.
ఈ కథ మొదలైనప్పుడు .. ఓ తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఒక ఎమోషనల్ డ్రామా అనిపిస్తుంది. తమ పని తాము చేసుకుపోతున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తుంది. ఆ తరువాత మాఫియా .. రాజకీయాలు కలిసి ఒక ప్రమాదకరమైన ప్రాజెక్టు దిశగా కదలడం మొదలవుతుంది. వాళ్లకి సంబంధించిన ఆ వ్యూహంలోకి తమ ప్రమేయం లేకుండానే హీరో ఫ్యామిలీ ఎంటర్ కావడం .. అది చాలా సామాన్యమైన ఫ్యామిలీనే అనుకుని విలన్ గ్యాంగ్ ఆ ఫ్యామిలీని ఎటాక్ చేయడం ఈ కథలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారుతుంది.
విలన్ తలపెట్టిన 7 వేల కోట్ల ప్రాజెక్టు .. అందులో వెయ్యి కోట్లను లంచంగా అడిగిన రాజకీయనాయకుడు. ఈ ఇద్దరి పనులతో ముడిపడిన ఒక వందరూపాయల 'నోటు'. ఈ మూడు అంశాలు ఈ కథలో చాలా కీలకమైనవిగా కనిపిస్తాయి. అంచెలంచెలుగా విలన్ అనుచరులు .. విలన్ నేరుగా రంగంలోకి దిగే తీరు ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది. తండ్రీ .. తల్లీ .. కూతురు తమ మార్షల్ ఆర్ట్స్ తో విలన్ గ్యాంగ్ ను ఎదుర్కునే తీరు, అందుకు సంబంధించిన ఫైట్స్ ను కంపోజ్ చేసిన విధానం మెప్పిస్తుంది.
సినిమా ఇంకా 37 నిమిషాల నిడివి ఉందనగా ఇక ఈ కథ ఊపిరి తీసుకోనీయదు. స్క్రీన్ ప్లే లోని గొప్పతనం ఇక్కడి నుంచి మరింత బయటపడుతుంది. హీరో ఇంటిలోకి అబ్రహం ఎంట్రీ ఇవ్వడం, ఒక విలన్ ను వెతుక్కుంటూ వెళ్లి బంధించడం .. అదే సమయంలో వెతుక్కుంటూ వచ్చిన మరో విలన్ బంధించడం, హీరో ఎవరనేది విలన్, అతను ఎవరనేది హీరో ఒకే సమయంలో గుర్తించడం, అందుకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ కి థ్రిల్ ను కలిగిస్తాయి. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దృశ్యాలు ఆడియన్స్ ను కదలనీయకుండా చేస్తాయి.
అర్జున్ .. అభిరామి .. ప్రీతీ ముకుందన్ నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. అలాగే విలన్ పాత్రలను చేసిన వారు కూడా ఆయా సన్నివేశాలను అలా నిలబెట్టేశారు. అరుణ్ రాధాకృష్ణన్ ఫొటోగ్రఫీ .. రవి బస్రూర్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయనడంలో ఎలాంటి అభిశయోక్తి లేదు. కథ .. స్క్రీన్ ప్లే .. యాక్షన్ సీన్స్ .. ఎమోషనల్ డ్రామా మంచి మార్కులను రాబడతాయి. ఓటీటీలో ఈ సినిమా చూసిన తరువాత, ఇంత ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను థియేటర్లలో మిస్సయ్యామని మాత్రం తప్పకుండా అనిపిస్తుంది.
"మనవాళ్లకు మాత్రమే కాదు, మనచుట్టూ ఉన్నవారిలో ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నించాలి .. అలాంటివారి తరఫున పోరాడాలి" అనే సందేశంతో తెరకెక్కిన సినిమా ఇది. బలమైన కథాకథనాలతో, ఆద్యంతం అలరించే యాక్షన్ .. ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మని తమని తాము రక్షించుకోవడం కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరం. ఇతరులను రక్షించాలంటే మార్షల్ ఆర్ట్స్ తో పాటు మానవత్వం కూడా అవసరమనే సందేశంతో కూడిన ఈ కంటెంట్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది.
Movie Details
Movie Name: Blast
Release Date: 2026-06-25
Cast: Arjun, Abhirami, Preity Mukundan, John Kokken, Vivek Prasanna, Pawan, Vinod Sagar
Director: Subhash K Raj
Music: Ravi Basrur
Banner: AGS Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer