చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమానే 'పెద్ది'. ఈ కథపై కసరత్తు చేయడానికి బుచ్చిబాబు చాలా కాలమే కష్టపడ్డాడు. బుచ్చిబాబుపై నమ్మకంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా చాలా సమయమే తీసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామాతో కూడిన కంటెంట్ కావడం, చరణ్ - జాన్వీ కలిసి తొలిసారిగా నటించిన సినిమా కావడంతో సహజంగానే అందరిలో ఆసక్తి పెరిగింది. ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన బాణీలకు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి. అలాంటి అంచనాల మధ్య ఈ రోజు (జూన్ 4)న ఈ సినిమా థియేటర్లకు వచ్చింది.
'విజయనగరం' జిల్లా పరిధిలోని కొండకింద ఊరు అది. అందువలన అందరూ దానిని 'కొండకింద ఊరు' అనే పేరుతోనే పిలుస్తుంటారు. అంతకు మించి ఆ ఊరుకంటూ ఒక పేరు లేదు. 450 కుటుంబాల వారు కలిసి నివసించే ఈ ఊరులో ఎవరికీ ఓటు హక్కు అనేది లేదు. ఆ ఊరు మీదుగా వెళ్లే ట్రైన్ అక్కడ ఆగదు. ఎంతదూరమైనా వాళ్లు కాలిబాటలో వెళ్లాల్సిందే. ఆ ఊళ్లో రైలు ఆగేలా చేయడం కోసం, 30 ఏళ్లుగా 'అప్పల సూరి' (జగపతిబాబు) ప్రయత్నిస్తూ ఉంటాడు. గవర్నమెంటు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
కొండకింద ఊరుకి చెందిన యువకుడే 'పెద్ది'. తన తల్లితో కలిసి అతను అక్కడ నివసిస్తూ ఉంటాడు. 'బెల్లం బట్టీ'లో పనిచేసే పెద్ది, 'ఆటకూలి'గా క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అతనితో సమానమైన ఆటగాడు లేడని అంతా చెప్పుకుంటూ ఉంటారు. అది ఆ ప్రాంతంలోని కలవారి కుటుంబాలకు చెందిన యువకులకు అసూయగా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో రాజకీయనాయకుడైన సుభద్రరాజు (రావు రమేశ్) కూతురైన అచ్చియమ్మ (జాన్వీ కపూర్)పై 'పెద్ది' మనసు పారేసుకుంటాడు.
కొండకింద ఊరులో రైలు ఆగేలా చేయడం కోసం 'సూరి' ప్రాణత్యాగం చేస్తాడు. అతని మరణం పెద్దిని కలవరపెడుతుంది .. ఆలోచింపజేస్తుంది. ఒక మనిషికైనా .. గ్రామానికైనా గుర్తింపు ఎంత అవసరమనేది అతనికి అర్థమవుతుంది. తన గ్రామానికి గుర్తింపు రావాలంటే ముందుగా తాను గుర్తింపును సంపాదించుకోవాలి. అది జరగాలంటే తాను ఎంచుకున్న రంగంలో తాను గెలవాలి అని నిర్ణయించుకుంటాడు. అందుకోసం పెద్ది చేసే పోరాటమే ఈ సినిమా కథ.
పాతికేళ్లకే పాతబడి పోవద్దు.. చేసేదేమైనా ఉంటే ఇప్పుడే చేసేయి .. నిదానంగా చేయొచ్చులే అని తాపీగా కూర్చోవడానికి మళ్లీ పుడతామా ఏంటి? అనే ఆలోచనా విధానంతో ఉండే ఒక కొండ ప్రాంతానికి చెందిన యువకుడి కథ ఇది. ఆట అనేది డబ్బుల కోసం కాదు .. పేరు కోసం ఆడాలి. అప్పుడే అది తన ఊరుకి కూడా గుర్తింపును తెస్తుందని తెలుసుకుని, ఆ దిశగా పోరాటాన్ని సాగించిన ఒక యోధుడి కథ ఇది.
దర్శకుడు బుచ్చిబాబు ఈ స్పోర్ట్స్ డ్రామాలో మూడు ఆటలను టచ్ చేశాడు. క్రికెట్ .. కుస్తీ .. పరుగు పందాలను చూపిస్తూ వెళ్లాడు. నిజానికి ఒక కథలో ఈ మూడు అంశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించడం కత్తిమీద సామువంటిదే. అయినా భారీస్థాయిలో అందుకు సంబంధించిన సన్నివేశాలను ఆవిష్కరిస్తూ వెళ్లాడు. ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ వెళ్లాడు. అయితే ఉన్న సమయమంతా ఆటలకే సరిపోవడంతో, లవ్ .. రొమాన్స్ .. ఇతర వినోదపరమైన అంశాలకు చోటు లేకుండా పోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
బుచ్చిబాబు చేసిన మరో సాహసం ఏమిటంటే ఒక పవర్ఫుల్ విలన్ అంటూ లేకుండా, కథానాయకుడి చుట్టూ ఉన్న పరిస్థితులనే విలన్ గా చూపిస్తూ వెళ్లడం. దాంతో హీరోకి ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనే ఒక టెన్షన్ లేకుండా ఆడియన్స్ కూల్ గా చూస్తుంటారు. ఇక జాన్వీ కపూర్ పాత్ర తెరపై అక్కడక్కడా కాకుండా, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆమె పాత్రపై ఏ మాత్రం ఫోకస్ పెట్టకపోవడం కనిపిస్తుంది. ఐటమ్ సాంగ్ కి ముందు .. వెనుక అన్నట్టుగా ఉంటుంది ఆమె పాత్ర ధోరణి. హీరోతో ప్రేమ వ్యవహారం పెద్దగా ముదరకుండానే, ఆమె అతని పేరు చెప్పి 'తాళి' కట్టేసుకోవడం ప్రేక్షకులు బిత్తరపోయేలా చేస్తుంది. రావు రమేశ్ లాంటి ఆర్టిస్టు కూడా, తెరపై ఆమె తండ్రి అనిపించుకుని వెళ్లిపోవడం ఆశ్చర్యం.
తెరపై అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తరువాత అదృశ్యమైపోయే పాత్రలు చాలానే కనిపిస్తాయి. ఒకటి రెండు చిన్న పాత్రలను హైలైట్ చేసిన బుచ్చిబాబు, మరికొన్ని ముఖ్యమైన పాత్రలను వదిలేశాడు. చరణ్ పాత్రను డిజైన్ చేసిన విషయంలో మాత్రం ఆయనను అభినందించవలసిందే. చరణ్ ఎంతగా కష్టపడ్డాడనేది మాత్రం ప్రతి ఫ్రేమ్ చెబుతూనే ఉంటుంది. ఇక ఆ తరువాత స్థానంలో జగపతిబాబు .. శివరాజ్ కుమార్ పాత్రలు మినహా ఎవరూ పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ విజిల్స్ కొట్టించలేకపోయింది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. తెరపై రత్నవేలు ఆవిష్కరించిన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలం అనే చెప్పాలి. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మంచి మార్కులు కొట్టేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేసిన తీరు .. కొరియోగ్రఫీ గొప్పగా అనిపిస్తాయి. సందర్భాను సారంగా అక్కడక్కడా కొన్ని డైలాగులు మనసును పట్టుకుంటాయి.
'నీకంటూ ఒక గుర్తింపు దక్కాలంటే నీ గెలుపు కనిపించాలి . లేదంటే ఆ గెలుపు శబ్దం వినిపించాలి. అంతవరకూ నువ్వు పరిగెడుతూనే ఉండాలి' అనే ఒక సందేశాన్ని ఇచ్చిన తీరు బాగుంది. అయితే ఆటలకి సంబంధించిన కోటా పెరిగిపోయి, లవ్ .. రొమాన్స్ .. మాస్ ఆడియన్స్ ఆశించే వినోదం వాటా తగ్గడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొగ్గు చూపితే, చరణ్ పడిన కష్టం ఫలించినట్టే అవుతుంది.
'పెద్ది' - మూవీ రివ్యూ!
Peddi Review
Movie Details
Movie Name: Peddi
Release Date: 2026-06-04
Cast: Ram Charan,,Janhvi Kapoor ,Jagapathi Babu,Shiva Rajkumar ,,Divyenndu ,
Director: Buchi Babu Sana
Music: A R Rahman
Banner: Mythri Movie Makers - Sukumar Writings
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer