విదేశంలోనూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. ఘనా తీరంలో భారత్ చొరవ

విదేశంలోనూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. ఘనా తీరంలో భారత్ చొరవ

India promotes Swachh Bharat spirit with beach cleaning initiative in Ghana
  • ఘనాలో 'స్వచ్ఛతా హి సేవ' ప్రచారంలో భాగంగా భారత హైకమిషన్ కార్యక్రమం
  • అనన్సే బీచ్‌లో టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించిన వందలాది మంది వాలంటీర్లు
  • పర్యావరణ పరిరక్షణలో సామూహిక బాధ్యతను చాటిన కార్యక్రమం
విదేశీ గడ్డపై సైతం భారత్ తన 'స్వచ్ఛతా హి సేవ' స్ఫూర్తిని చాటిచెప్పింది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఘనాలోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ బీచ్ క్లీనింగ్ (తీర ప్రాంత పరిశుభ్రత) కార్యక్రమాన్ని నిర్వహించారు. నుంగువాలోని అనన్సే బీచ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వాలంటీర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

భారత హైకమిషన్ అధికారులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులతో కూడిన వాలంటీర్లు తీరప్రాంతంలో పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించారు. దీంతో అనన్సే బీచ్ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా మారింది. సముద్రాలు, పర్యావరణ పరిరక్షణలో సామూహిక భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ఎంత కీలకమో ఈ కార్యక్రమం తెలియజేసిందని భారత హైకమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పరిశుభ్రతను పౌరుల బాధ్యతగా ప్రోత్సహించే లక్ష్యంతో భారత్ ఏటా 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా, ఘనాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత హైకమిషనర్ ఎస్. భగత్ ఇటీవల పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఘనా-ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ ఛైర్మన్ క్వామెనా మింటా న్యాకు, వైస్ ఛైర్మన్ అలెగ్జాండర్ అక్వాసీ అక్వాలతో పార్లమెంటరీ వ్యవహారాలపై ఆయన చర్చలు జరిపారు. అలాగే, గతవారం ఘనా స్కౌట్స్ అసోసియేషన్ చీఫ్ కమిషనర్ హిలరీ వై. అవుసీతో భేటీ అయి యువత సాధికారత, విద్య, సాంస్కృతిక మార్పిడి వంటి కీలక అంశాలపై సమాలోచనలు చేశారు.
Advertisement
High Commission of India
Swachhata Hi Seva
Ghana Beach Cleanup
Ananse Beach Nungua
High Commissioner S Bhagat
Swachh Bharat Spirit Abroad

More Telugu News