చంద్రబాబు చేతుల మీదుగా.. రేపు విశాఖలో చారిత్రక ఘట్టం

చంద్రబాబు చేతుల మీదుగా.. రేపు విశాఖలో చారిత్రక ఘట్టం

Chandrababu Naidu to lead historic land titles distribution in Visakhapatnam
  • విశాఖలో 40 ఏళ్ల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం
  • రేపు 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
  • రూ.8,874 కోట్ల విలువైన 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ
  • ఇంటిపై పూర్తి హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి
  • విశాఖ అభివృద్ధిలో పేదలను భాగస్వాములను చేస్తామని వెల్లడి
విశాఖపట్నంలో దశాబ్దాలుగా నెలకొన్న ఒక జటిల సమస్యకు పరిష్కారం లభించింది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని, వాటిపై యాజమాన్య హక్కుల కోసం 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల కల రేపు సాకారం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నం వేదికగా ఈ చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం 28,445 కుటుంబాలకు రూ.8,874 కోట్ల విలువైన భూమిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేయనున్నారు.

దశాబ్దాల సమస్యకు ఫుల్‌స్టాప్
విశాఖ నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్నారు. అయితే, ఆ ఇంటి స్థలంపై వారికి పూర్తి హక్కులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తిని అమ్ముకోలేని, బదలాయించలేని పరిస్థితితో పాటు, భవిష్యత్తుపై భరోసా కరవైంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. మొత్తం 399 ఎకరాల విస్తీర్ణంలోని 19,33,853 చదరపు గజాల భూమిని క్రమబద్ధీకరించి, ఆయా కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది. విశాఖలో ఇంత భారీ స్థాయిలో భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పట్టాలు పంపిణీ చేయడం ఇదే తొలిసారి.

పేద కుటుంబాల కలను నిజం చేస్తున్నా: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు. "తమకంటూ పూర్తి హక్కులతో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్క కుటుంబ కల. అలాంటి వేల మంది కలను నిజం చేసేందుకే విశాఖ వస్తున్నా" అని ఆయన పోస్ట్ చేశారు. ఇది కేవలం పట్టాల పంపిణీ కాదని, 28 వేల కుటుంబాలకు వారి నివాసాలపై పూర్తి హక్కు కల్పించే చరిత్రాత్మక సందర్భమని పేర్కొన్నారు. ఈ పట్టాతో ప్రతి కుటుంబానికి విలువైన ఆస్తి, భవిష్యత్తుకు భద్రత, పిల్లలకు వారసత్వ సంపదతో పాటు ఆత్మగౌరవం, భరోసా లభిస్తాయని సీఎం వివరించారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన కుటుంబాల ఆనందం చూడటమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని ఆయన అన్నారు.

2014-19 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించి కొన్ని జీవోలను జారీ చేసినా, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా సమీక్షల్లో ప్రజాప్రతినిధులు ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకురావడంతో, అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మండలాల వారీగా లబ్ధిదారులు
ఈ క్రమబద్ధీకరణ ద్వారా గాజువాక నుంచి భీమిలి వరకు అనేక ప్రాంతాల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అత్యధికంగా విశాఖ రూరల్‌లో 9,261 కుటుంబాలు, గాజువాకలో 4,353, ములగాడలో 4,213, గోపాలపట్నంలో 3,253, పెందుర్తిలో 2,722, పెదగంట్యాడలో 1,910, మహారాణిపేటలో 1,235, సీతమ్మధారలో 668, భీమిలిలో 464, ఆనందపురంలో 349, పద్మనాభంలో 17 కుటుంబాలు ఈ ప్రయోజనం పొందనున్నాయి.

సీఎం పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం 10.30 గంటలకు విశాఖకు చేరుకుంటారు. ముందుగా ఆర్‌కే బీచ్‌లో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ముచ్చటిస్తారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని, లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు.


Advertisement
Nara Chandrababu Naidu
Visakhapatnam land titles
Vizag land regularization
Andhra Pradesh government
Free patta distribution
Chandrababu Naidu Vizag visit

More Telugu News