అక్షర ఆంధ్రకు అద్భుత ఫలితాలు.. వచ్చే సెప్టెంబరుకు 100 శాతం అక్షరాస్యత: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Aims for 100 Percent Literacy in Andhra Pradesh by Next September
  • పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష
  • వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు పక్కా ప్రణాళికలు
  • అక్షర ఆంధ్ర కార్యక్రమంతో ఏడాదిలో 25 లక్షల మందికి అక్షరజ్ఞానం
  • బడిబయట ఉన్న 1.64 లక్షల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశం
  • మధ్యాహ్న భోజనంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని తల్లిదండ్రులకు, టీచర్లకు సూచన
  • ఇంటర్ విద్యార్థులకు 'తల్లికి వందనం' కింద రూ.1051 కోట్ల ఆర్థిక సాయం
రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసి, సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, దీని ద్వారా వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలపాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖల ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో చేపడుతున్న సంస్కరణలు, కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు.

ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... 2024 నాటికి రాష్ట్ర అక్షరాస్యత శాతం కేవలం 72.6 శాతంతో దేశంలోనే అట్టడుగున ఉందని, అయితే గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కేవలం ఒక్క ఏడాదిలోనే 25 లక్షల మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారారని తెలిపారు. ఈ కృషిని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర అక్షరాస్యత శాతం 10 శాతం పెరిగి 82.1 శాతానికి చేరుకుందని, ఇదే స్ఫూర్తితో 2027 సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని కోరారు. ఇందుకు అనుగుణంగా 2027 మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, ఆపై సెప్టెంబర్ నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వివరించారు. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకురావాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.

బడిబయట పిల్లలందరినీ బడిలో చేర్పించాలి

పాఠశాల విద్యపై సమీక్షిస్తూ, రాష్ట్రంలో బడిబయట ఉన్న 1,64,821 మంది పిల్లలను గుర్తించి, వారందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటికే 33 వేల మందిని పాఠశాలల్లో చేర్పించామని, మిగిలిన వారి వివరాలను 'లీప్' యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపామని పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. పిల్లలను బడికి పంపేలా తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. 

రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరు శాతం 98.97 శాతంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, విద్యార్థుల హాజరు శాతాన్ని కూడా పెంచాలని సూచించారు. వరుసగా మూడు రోజులు బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఈ బాధ్యతను పాఠశాల యాజమాన్య కమిటీలకు అప్పగించాలని స్పష్టం చేశారు.

ఇంటర్ విద్యలో పురోగతి

ఈ ఏడాది ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని, గత ఏడాదితో పోలిస్తే సుమారు 10 వేల అడ్మిషన్లు పెరిగాయని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం 'సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్' కింద ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. 

'తల్లికి వందనం' పథకం ద్వారా ఈ ఏడాది ఇంటర్ విద్యార్థులకు రూ.1051 కోట్లు అందించామని, మొదటి సంవత్సరం విద్యార్థులకు కూడా త్వరలో అందిస్తామని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి నూరుశాతం అపార్ (APAAR) ఐడీ ఇంటిగ్రేషన్ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై రాజీ లేదు

మధ్యాహ్న భోజనం పథకం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. నాణ్యతపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 'లీప్' యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించాలని కోరారు. అలాగే, విద్యార్థుల్లో ఒత్తిడి లేని అభ్యసన వాతావరణాన్ని కల్పించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఉపాధ్యాయులకు ఏఐ టూల్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు 'ఏఐ సమర్థ్' కార్యక్రమం చేపడుతున్నామని, ఈనెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తామని అధికారులు తెలిపారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహణ, పదో తరగతి విద్యార్థుల కోసం 'మిషన్ మార్చి-2026'పై కూడా సమావేశంలో చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, పాఠశాల విద్య మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Akshara Andhra
Andhra Pradesh Literacy Rate
Education Reforms AP
Thalliki Vandanam Scheme
School Education Review

More Telugu News