బరువు తగ్గాలనుకునేవారికి చక్కెర కంటే బెల్లం బెటరా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బరువు తగ్గాలనుకునేవారికి చక్కెర కంటే బెల్లం బెటరా?

Jaggery vs Sugar which is better for weight loss
  • బెల్లం తినడం వల్ల నేరుగా బరువు తగ్గరంటున్న నిపుణులు
  • బెల్లం, చక్కెరలో క్యాలరీలు దాదాపు సమానమేనని వివరణ
  • బెల్లంలో ఐరన్‌, పొటాషియం వంటి ఖనిజాలు అధికం
  • బెల్లంలోనూ సుక్రోజ్‌ ఉంటుందని వెల్లడి
  • ఎక్కువ బెల్లం తింటే బరువు పెరిగే అవకాశం
చక్కెరకు బదులుగా బెల్లం వాడితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. బరువు తగ్గాలనుకునే వారు కూడా వైట్‌ షుగర్‌కు బదులు బెల్లాన్ని ఎంచుకుంటారు. అయితే బెల్లం తినడం వల్ల నేరుగా బరువు తగ్గుతారా? అసలు బెల్లం, చక్కెరలో ఏది మంచిది? పోషకాహార నిపుణుల అభిప్రాయాలు, పరిశోధనల ప్రకారం దీనికి సమాధానం అంత సులభం కాదు.

చెరకు రసం లేదా తాటి రసం నుంచి బెల్లాన్ని తయారు చేస్తారు. చక్కెరతో పోలిస్తే బెల్లంలో ఐరన్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు కొంత ఎక్కువగా ఉంటాయి. శుద్ధి చేసే ప్రక్రియ తక్కువగా ఉండటంతో కొన్ని సూక్ష్మ పోషకాలు ఇందులో మిగులుతాయి.

అయితే బరువు తగ్గించే విషయంలో మాత్రం బెల్లానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నట్లు ఆధారాలు లేవు. 100 గ్రాముల బెల్లంలో సుమారు 383 కిలోక్యాలరీలు ఉంటే.. వైట్‌ షుగర్‌లో దాదాపు 387 కిలోక్యాలరీలు ఉంటాయి. అంటే క్యాలరీల విషయంలో పెద్ద తేడా లేదు.

బరువు తగ్గాలంటే రోజువారీగా తీసుకునే క్యాలరీల కంటే ఖర్చు చేసే క్యాలరీలు ఎక్కువగా ఉండాలి. అందుకే బెల్లాన్ని ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. వైట్‌ షుగర్‌లాగే బెల్లంలోనూ సుక్రోజ్‌ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.

బెల్లంలో పోషక విలువలు కొంత ఎక్కువగా ఉన్నా.. అది బరువు తగ్గించే ఆహారం మాత్రం కాదు. తీపి తినాలనిపిస్తే తాజా పండ్లు, పండ్లు- చక్కెరలేని యోగర్ట్, నట్స్‌, సీడ్స్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. బెల్లం తీసుకున్నా పరిమితంగా తీసుకోవడం ముఖ్యం.
Advertisement
Jaggery
Sugar
Weight Loss
Calories
Nutrition
Dieting

More Telugu News