Advertisement

వెలిగొండతో వెలుగులు.. ఇది నినాదం కాదు, మా విధానం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says Veligonda brightness is our policy not just a slogan
  • వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభంపై మార్కాపురం ప్రజలకు మంత్రి లోకేశ్ అభినందనలు
  • 30 ఏళ్ల కలను సీఎం చంద్రబాబు నిజం చేశారని ప్రశంస
  • కరవు, ఫ్లోరైడ్ సమస్యలకు ఈ ప్రాజెక్ట్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ధీమా
  • ప్రాజెక్ట్ కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు ప్రత్యేక ధన్యవాదాలు
  • ప్రజల అభిమానం పొందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ
దశాబ్దాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో మార్కాపురం జిల్లా ప్రజలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నేడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుతో ఈ ప్రాంత దశ, దిశ మారబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"వలసల కష్టాలకు సెలవు చెబుతూ, అభివృద్ధికి స్వాగతం పలుకుతున్న మార్కాపురం జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు" అని తన సందేశాన్ని ప్రారంభించారు. దాదాపు 30 ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజం చేస్తున్నారని కొనియాడారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు దశాబ్దాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వివరించారు.

"వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కేవలం సాగునీరే కాకుండా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతాం. తాగు, సాగు నీటి లభ్యతతో ఈ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం" అని లోకేశ్ తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించి, తమ భూములను, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో పనిచేస్తోందని లోకేశ్ స్పష్టం చేశారు. "ప్రజలకు మంచి చేయడం ద్వారా వారి అభిమానాన్ని పొందడమే మేం కోరుకునే అసలైన క్రెడిట్. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' అనేది కేవలం నినాదం కాదు, అది కూటమి ప్రభుత్వ విధానం" అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. వెలిగొండ జలాలతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
Nara Lokesh
Veligonda Project
Chandrababu Naidu
Markapuram District
Andhra Pradesh Irrigation
Fluoride Problem Solution

More Telugu News