Advertisement

మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర.. రేపు వెలిగొండ పండుగ వద్ద కలుసుకుందాం: సీఎం చంద్రబాబు ట్వీట్

Chandrababu Naidu invites people to Veligonda Festival tomorrow
  • మార్కాపురంలో కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందన్న సీఎం చంద్రబాబు
  • 30 ఏళ్ల వెలిగొండ కలను నిజం చేస్తున్నామన్న ముఖ్యమంత్రి
  • నల్లమల కొండల గుండా నల్లమల సాగర్‌లోకి కృష్ణా జలాలు
  • తొలి దశలో లక్షలాది మందికి సాగు, తాగునీటి ప్రయోజనం
  • రేపు వెలిగొండ పండుగ వద్ద కలుద్దామంటూ ప్రజలకు పిలుపు
మార్కాపురం జిల్లా గడ్డపై సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మూడు జిల్లాల్లోని లక్షలాది మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు పడనుందని, రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందని ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. కరవు పీడిత ప్రాంత ప్రజలు మూడు దశాబ్దాలుగా కంటున్న వెలిగొండ కల, కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి, ప్రారంభించే అవకాశం రావడం తనను భావోద్వేగానికి గురిచేస్తోందని, మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదని, కరవుతో పోరాడిన రైతుకు భరోసా అని, ఫ్లోరైడ్ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత అని, వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తును ఇచ్చే ప్రగతి మార్గమని ఆయన అభివర్ణించారు.

ఈ ప్రాజెక్టు మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు వివరించారు. ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టి పెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు దూసుకువస్తాయని, ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు ఆ ప్రాంత అభివృద్ధికి కొత్త రెక్కలు తొడుగుతాయని అన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని 'వెలిగొండ పండుగ' వద్ద కలుద్దామంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
Veligonda Project
Andhra Pradesh Irrigation
Markapuram News
Krishna River Water
Veligonda Festival

More Telugu News