Advertisement

రేపే వెలిగొండ పండుగ: 30 ఏళ్ల కలను సాకారం చేయనున్న చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే!

Veligonda festival tomorrow Chandrababu Naidu to realize thirty year dream here is the schedule
  • రేపు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును పూర్తి చేయడంపై సర్వత్రా హర్షం
  • తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు
  • కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధికి రెక్కలు వస్తాయని ఆశాభావం
  • ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ఘనంగా వేడుకలు
ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. కరవు నేలకు కృష్ణమ్మ జలాలు పరుగులెత్తనున్నాయి. మార్కాపురం జిల్లాతో పాటు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు పీడిత ప్రాంతాల తలరాతను మార్చగల వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం మార్కాపురం జిల్లాలో పర్యటించి, ప్రాజెక్టు తొలి దశను (ఫేజ్-1) లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. మూడు దశాబ్దాల క్రితం, 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, ఇప్పుడు తన చేతుల మీదుగానే తొలి దశను ప్రారంభించనుండటం ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.

జీవనాధార ప్రాజెక్టుతో కొత్త అధ్యాయం

తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు, ఫ్లోరైడ్ భూతంతో దశాబ్దాలుగా అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి వెలిగొండ కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు, అదొక జీవనాధారం. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, అక్కడి నుంచి కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. తొలి దశ ప్రారంభంతో 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. దీని ద్వారా తక్షణమే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందనుంది. 

ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని సుమారు 23 లక్షల మందికి తాగునీటి భద్రత లభిస్తుంది. ఈ జలాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ రంగంలో అనిశ్చితి తొలగిపోయి, వివిధ రకాల పంటలు పండించేందుకు మార్గం సుగమమవుతుంది. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గి, ఉద్యానవనం, ఆగ్రో ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనుబంధ రంగాల అభివృద్ధికి ఊతమిస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడనుంది.

సంకల్పం నుంచి సాకారం వరకు... 30 ఏళ్ల ప్రయాణం

1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు ప్రయాణం అంత సులభంగా సాగలేదు. సొరంగాల నిర్మాణం, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం వంటి క్లిష్టమైన సాంకేతిక, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ పనులు కొనసాగాయి. 2024లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే, వెలిగొండను అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించి పనులను పరుగులు పెట్టించింది. ముఖ్యంగా, ప్రాజెక్టు పురోగతికి అడ్డంకిగా మారిన నిర్వాసితుల పరిహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేవలం 48 రోజుల వ్యవధిలోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. 

అంతేకాకుండా, గెజిట్, జాబితాలలో పేర్లు లేని వారికి రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున అదనపు పరిహారం ప్రకటించి వారిలో భరోసా నింపింది. ‘శంకుస్థాపన చేసింది చంద్రబాబే, ప్రారంభిస్తున్నదీ చంద్రబాబే’ అనే అరుదైన ఘట్టానికి ఆగస్టు 31వ తేదీ వేదిక కానుండటంతో స్థానిక ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాలో ఈ క్రింది షెడ్యూల్ ప్రకారం పర్యటించనున్నారు:

ఉదయం 9:30: ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
ఉదయం 10:15: మార్కాపురం జిల్లా, దోర్నాల మండలం, గంటవానిపల్లి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఉదయం 10:25: రోడ్డు మార్గంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు.
ఉదయం 10:35 - 11:20: ప్రత్యేక పూజలు నిర్వహించి, పైలాన్‌ను ఆవిష్కరించి, గేట్లను ప్రారంభించి కృష్ణా జలాలను విడుదల చేస్తారు.
ఉదయం 11:30: గంటవానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 1:30: సభ అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.
మధ్యాహ్నం 2:15: ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

ఈ చారిత్రక ఘట్టంతో మార్కాపురం సహా రాయలసీమ కరవు పీడిత ప్రాంతాల అభివృద్ధికి కొత్త అధ్యాయం మొదలవుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
Advertisement
Chandrababu Naidu
Veligonda Project
Andhra Pradesh Irrigation Projects
Markapuram
Krishna River Water
Veligonda Phase 1 Inauguration

More Telugu News