కోర్టు దృశ్యాలను ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ
- కోర్టు విచారణలను విచ్చలవిడిగా, అసంపూర్తిగా ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- అనుమతి లేకుండా వీడియోలను అప్‌లోడ్ చేయడంపై నిషేధం
- కోర్టులు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు కావు అన్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి
కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియాలో విచ్చలవిడిగా, అసంపూర్తిగా ప్రసారం చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని సీసాలో నుంచి బయటకు వచ్చిన భూతంతో పోల్చిన ధర్మాసనం, సంబంధిత కోర్టుల ముందస్తు అనుమతి లేకుండా వాటిని పోస్ట్ చేయడం, ఎడిట్ చేయడం లేదా రీ-పోస్ట్ చేయడంపై మధ్యంతర స్టే విధిస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా ఆయా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా విచారణల వీడియోలను ఎక్స్‌ట్రాక్ట్ చేయడం, మార్పులు చేయడం, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం లేదా వాటి ద్వారా ఆదాయం పొందడం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేసింది. అయితే ఈ ఉత్తర్వులు సాధారణ వార్తా కవరేజ్ లేదా జర్నలిజం రిపోర్టింగ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపవని, ఇవి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకునే ఉత్తర్వులు కాదని ధర్మాసనం తెలిపింది. విచారణ క్లిప్‌లు వైరల్ కావడంపై వివరణ ఇవ్వాలని మెటా, ఎక్స్ సహా పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి మాట్లాడుతూ... కోర్టులు 24 గంటల ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లు కావు అని స్పష్టం చేశారు. వర్చువల్ లింక్‌లు దుర్వినియోగం కాకుండా పరిమిత యాక్సెస్ మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ... ఏఐ టూల్స్ ఉపయోగించి న్యాయమూర్తులు లేదా లాయర్ల మాటలను మార్చి మార్ఫింగ్ చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.